మన దేశ స్వాతంత్య్రపోరాటంలో వందలాది మంది తన రక్తాన్ని, ప్రాణాన్ని ధారపోశారు. వారి త్యాగ ఫలితమే మనం అనుభవిస్తున్న స్వేచ్ఛా, స్వాతంత్య్రాలు. సుదీర్ఘపోరాటంలో ఎంతో మంది సమరయోధులు జాతిలో స్పూర్తి నింపి ఉద్యమం వైపు నడిపేందుకు తమ శక్తివంతమైన మాటలు, నినాదాలతో ప్రచారం చేశారు. కొన్ని నినాదాలు ఒక్కరితో మొదలై లక్షల మంది గొంతుల్లో ప్రతిధ్వనించాయి. ఆ ప్రతిధ్వనులు బ్రిటిష్ వారిని కూడా భయపెట్టాయి.


1857 సిపాయిల తిరుగుబాటు తరువాత ఉద్యమం ఊపందుకుంది. నాయకులంతా నినాదాలు ఇవ్వడం ప్రారంభించారు. నేతాజీ ఇచ్చిన జైహింద్ నినాదం ఇప్పటికీ మనం ఉపయోగిస్తూనే ఉంటాం. 1907లో షెన్‌బగరామన్ పిళ్లై అనే వ్యక్తి తొలిసారి ఆ పదాన్ని ఉపయోగించారు. దాన్ని నేతాజీ స్వీకరించి ప్రజల్లోకి వెళ్లేలా చేశారు. సంపూర్ణ స్వాతంత్య్రం కోసం అంతిమంగా ఇచ్చిన పిలుపు ‘క్విట్ ఇండియా’. దీన్ని 1942లో ముంబై మేయర్ గా ఉన్న యూసుఫ్ మెహర్ అలీ తొలిసారి నినదించారు. గాంధీజీకి ఇది అమితంగా నచ్చింది. దీన్ని భారత ప్రజల గుండెల్లోకి తీసుకెళ్లారు. ఈ నినాదం బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరుగెట్టేలా చేసింది. వేలాదిమంది ఒక్కసారి ‘క్విట్ ఇండియా’ అని నినదిస్తుందటే ఆ శబ్ధాన్నే భరించలేకపోయారట తెల్లపాలకులు.


1928లో ఏర్పాటైన సైమన్ కమిషన్లో ఒక్క భారతీయుడికి కూడా చోటు దక్కలేదు. ఆ కమిషన్ ఏర్పాటైంది ఇండియాలో బ్రిటిష్ పాలనను మెరుగుపరుకునేందుకు. అందుకోసమే యూసుఫ్ మెహెర్ అలీ ‘సైమన్ గో బ్యాక్’ అనే నినాదంతో ముందుకొచ్చారు. ఇవే కాదు స్వాతంత్ర్య చరిత్రలో ఎన్నో నినాదాలు ప్రజల్లో స్పూర్తి నింపాయి. 


ప్రజల్లో స్పూర్తి నింపిన నినాదాలు ఎన్నో...


1. ప్రతి భారతీయులు తాను రాజ్‌పుత్, సిక్కు, హిందువు అనే విషయాలను మరచిపోవాలి. తాము భారతీయులమనే విషయాన్ని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి - సర్దార్ వల్లభాయ్ పటేల్


2. స్వరాజ్యం నా జన్మహక్కు... నేను దాన్ని పొందితీరుతాను - బాల గంగాధర్ తిలక్


3. స్వేచ్ఛ, సమానత్వం, సోదరభావాన్ని ప్రచారం చేసే మతాన్ని మాత్రమే నేను నమ్ముతాను - చంద్రశేఖర్ ఆజాద్


4. ఒక సిద్ధాంతం కోసం ఒక వ్యక్తి మరణించవచ్చు, కానీ అతని మరణం తరువాత ఆ సిద్ధాంతం వెయ్యి జీవితాల్లో స్పూర్తి నింపుతుంది - నేతాజీ సుభాష్ చంద్రబోస్


5. అహింసకు మించి ఆయుధం లేదు - మహాత్మగాంధీ


6. దేశంలోని తల్లులు అందించే ప్రేమ, త్యాగాలపైనే ఆ దేశం గొప్పదనం ఆధారపడి ఉంటుంది - సరోజినీ నాయుడు


7. మనం కోరుకున్న లక్ష్యం చేరుకోవాలంటే... లక్ష్యం మాత్రం గొప్పదైతే సరిపోదు, దాన్ని చేరుకోవడానికి ఎంచుకున్న దారి కూడా సరైనదై ఉండాలి - డా. రాజేంద్రప్రసాద్


8. అన్యాయం, వివక్షతో నిండిన వ్యవస్థను మార్చడానికి జరిగే ఏ పోరాటమైన విప్లవం కిందకే వస్తుంది. ఇంక్విలాబ్ జిందాబాద్ - భగత్ సింగ్


10. మీ రక్తాన్ని ధారపోయండి... మీకు స్వాతంత్య్రాన్ని నేను తెస్తాను - సుభాష్ చంద్ర బోస్


11. మేము శత్రువుల బుల్లెట్లను ఎదుర్కొంటాం... స్వేచ్ఛా, స్వాతంత్య్రాలతోనే జీవిస్తాం- చంద్రశేఖర్ ఆజాద్


12. సత్యమేవ జయతే (ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది)- పండిట్ మదన్ మోహన్ మాలవీయ


13. క్విట్ ఇండియా , సైమన్ గోబ్యాక్ - యూసుఫ్ మెహెర్ అలీ  


Also Read: హ్యాపీ రిపబ్లిక్ డే.. దేశభక్తిని రగిలించే ఈ కోట్స్‌తో శుభాకాంక్షలు తెలపండిలా..


Also Read: మనదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించేందుకు జనవరి 26వ తేదీనే ఎందుకు ఎంచుకుంది?