Leg Cramp Causes and Home Remedies : కొందరికి రాత్రుళ్లు మంచి నిద్రలో కాళ్లు పట్టేస్తుంటాయి. సడెన్‌గా భరించలేని నొప్పి వచ్చేస్తుంది. ఇలాంటివి మీరు ఏదొక సమయంలో ఫేస్ చేసే ఉంటారు. ఇవి కొందరిలో చాలా కామన్. అయితే వీటి గురించి ఎవరికి చెప్పినా లేనిపోని రీజన్స్‌తో అనవసరంగా మీకు స్ట్రెస్‌ని పెంచుతారు. అందుకే వీటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. అసలు ఇవి ఎందుకు వస్తాయి? వీటికి చికిత్స ఉందా? లేదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
లెగ్ క్రాంప్స్
నిద్రలో ఉన్నప్పుడు కాలు కండరాల్లో సడెన్‌గా బిగుసుకుపోతుంది. దానివల్ల నొప్పి కలుగుతుంది. ఇది కొన్ని సెకన్లు, నిమిషాలు ఉంటాయి. దీనివల్ల నిద్ర డిస్టర్బ్ అవుతుంది. తర్వాత నిద్రరాకపోవచ్చు. అంతేకాకుండా ఇవి మీ నిద్ర, వ్యాయామం, లైఫ్‌స్టైల్‌ని ప్రభావితం చేయవచ్చు. ఇవి సాధారణంగా రాత్రులే ఎక్కువగా వస్తాయట. కొన్నిసందర్భాల్లో ఇది నొప్పిని ఎక్కువగా కలిగిస్తుంది కానీ.. ప్రమాదరమైనది కాదని చెప్తున్నారు నిపుణులు. మరి ఈ లెగ్ క్రాంప్స్ రావడానికి కారణాలు ఏంటి?
కారణాలు ఇవే..
సాధారణంగా నిద్రలో కాళ్లు తిమ్మిరి లేదా లెగ్ క్రాంప్ రావడానికి సరైన కారణం లేదు. కానీ డీహైడ్రేషన్ కూడా దీనికి ఓ కారణమంటున్నారు. అలాగే ఆల్కహాల్ తీసుకునేవారిలో కూడా ఇది కామన్‌గా ఉంటుంది. శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత కూడా కండరాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీనివల్ల తిమ్మిరి, కాళ్లు పట్టేయడం వంటివి జరగొచ్చట. అలాగే స్ట్రెస్ వల్ల కూడా కండరాల నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట. శారీరక శ్రమ ఎక్కువైనప్పుడు, వ్యాయామం చేసినప్పుడు కండరాలు అలసిపోయి ఈ క్రాంప్స్ వస్తాయి.
ఆస్తమాకోసం వినియోగించే మందులు, ఆరోగ్య సమస్యల గురించి వినియోగించే వివిధ రకాల మందులు ఉపయోగించినప్పుడు శరీరంలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల లెగ్ క్రాంప్స్ వస్తాయి. గర్భిణీ స్త్రీలలో ఈ లెగ్ క్రాంప్స్ కాస్త ఎక్కువగా ఉంటాయట. ముఖ్యంగా సెకండ్, థర్డ్ ట్రైమిస్టర్లో ఇవి కాస్త ఎక్కువగానే ఉంటాయట. మధుమేహం, మూత్రపిండాల వ్యాధి, థైరాయిడ్, నరాల సంబంధిత రుగత్మలు కూడా వీటికి కారణమవుతాయట. వయసు అయిపోతున్నవారిలో కూడా ఈ సమస్య ఎక్కువగానే ఉంటుందని చెప్తున్నారు.
నివారణ చర్యలు ఇవే..
కండరాల తిమ్మిరికి దారి తీసే డీహైడ్రేషన్‌కు దూరంగా ఉండాలి. కాబట్టి రోజంతా తగినంత నీటిని తీసుకోవాలి. ఆల్కహాల్‌కి దూరంగా ఉండాలి. ఇది క్రాంప్స్‌ని కలిగించడమే కాకుండా కండరాల కణజాలాన్ని కూడా దెబ్బతీస్తుంది. పడుకునే ముందు లెగ్‌ని స్ట్రెచ్ చేస్తూ ఉంటే కండరాలు ఫ్రీగా మూవ్ అవుతాయి. పడుకుని కూడా కాలును స్ట్రెచ్ చేసి పడుకుంటే క్రాంప్స్ ఉండవు. పైగా కండరాల నొప్పులు దూరమవుతాయి.
నొప్పి వచ్చినప్పుడు ఏమి చేయాలంటే..
నిద్రలో లెగ్ క్రాంప్ వస్తే అప్పుడు కూడా మీరు స్ట్రెచ్ చేయవచ్చు. ఎఫెక్టెడ్ లెగ్‌ని సాగదీసి ఉంచాలి. ఇలా కొంతసేపు ఉంటే క్రాంప్ తగ్గుతుంది. లేదంటే మీరు కొంతసేపు నిల్చొంటే కూడా ఇది తగ్గొచ్చు. హీట్ ప్యాక్స్ కూడా మంచి ఉపశమనం ఇస్తాయి. లేదంటే మీరు హాట్ వాటర్‌తో స్నానం చేయడం వల్ల కూడా కండరాలు రిలాక్స్ అవుతాయి. నొప్పి తగ్గుతుంది. క్రాంప్ ఉండే ప్రాంతంలో మసాజ్ చేసుకోవడం వల్ల కూడా నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది.
సప్లిమెంట్స్
శరీరంలో మెగ్నీషియం తక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ తరహా క్రాంప్స్ వస్తాయని పలు అధ్యయనాలు తెలిపాయి. కాబట్టి వైద్యుల సలహా మేరకు మెగ్నీషియం సప్లిమెంట్స్ తీసుకోవచ్చు. అలాగే అరటిపండు, నారింజ, బంగాళదుంపలు కూడా డైట్లో చేర్చుకోవాలి. వీటిలోని పొటాషియం కండరాలకు మేలు చేస్తుంది. పడుకునే బెడ్ కూడా కొన్నిసార్లు క్రాంప్కి కారణమవుతుంది. కాబట్టి అది కూడా మీకు అనుకూలంగా ఉండేది ప్లాన్ చేసుకోండి.
Also Read : పొట్ట ఎక్కువగా ఉందా? ఈ అలవాట్లతో బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవచ్చట.. నిపుణుల సలహాలు ఇవే