కొబ్బరి నీళ్లు తాగిన తర్వాత చాలామంది ఆ కొబ్బరి బొండాన్ని రెండు ముక్కలు చేస్తారు. లోపల ఉండే లేత కొబ్బరి అంటే ఎంతోమంది ఇష్టపడతారు. దీన్నే కోకోనట్ ఫ్లెష్ అని కూడా పిలుస్తారు. మృదువైన జెల్లి లాగా ఉంటుంది ఇది. ఈ పదార్థం లేత కొబ్బరికాయల్లోనే దొరుకుతుంది. ఈ లేత కొబ్బరిలో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీర్ణ క్రియను పెంచడంలో సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని మెరుగుపరిచే లారిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో అధికంగా ఉంటాయి. ఈ లేత కొబ్బరిని తినడం వల్ల చర్మానికి మెరుపు వస్తుంది. కొబ్బరి గుజ్జులో కొవ్వు, కొలెస్ట్రాల్ చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇలా తాజా కొబ్బరి గుజ్జుతో రుచికరమైన వంటకాలు కూడా చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం. 


పాయసం


కావలసిన పదార్థాలు
లేత కొబ్బరి - ఒక కప్పు 
పాలు - ఒక లీటరు 
పంచదార - అరకప్పు 
యాలకుల పొడి - అర స్పూను 
బాదం పప్పులు - 10 
జీడిపప్పులు - 10 
ఎండు ద్రాక్షలు - 10 
కుంకుమపువ్వు - నాలుగు రేకులు


తయారు చేసే విధానం
స్టవ్ మీద కళాయి పెట్టి పాలు పోయాలి. చిన్న మంట మీద అరగంట పాటు మరిగించాలి. పాలు అడుగున అంటుకోకుండా ఉండేందుకు రెండు నిమిషాలకు ఒకసారి గరిటతో కలుపుతూ ఉండాలి. మరొక కళాయిలో లేత కొబ్బరి తురుమును వేసి కాస్త డ్రై అయ్యేవరకు వేయించాలి. వేయించిన ఆ లేత కొబ్బరి తురుమును మరగబెడుతున్న పాలలో వేసి కలపాలి. అదే పాలలో పంచదార, యాలకుల పొడి, కుంకుమ పువ్వు కూడా వేసి కలపాలి. అలా పది నిమిషాలు ఉడికించాలి. పాయసంలా కాస్త మందంగా వచ్చాక పైన బాదం, జీడిపప్పులు తరుగును వేయాలి. వేయించిన కిస్‌మిస్‌లను కూడా గార్నిషింగ్ చేయాలి. స్టవ్ కట్టేసి చల్లబడ్డాక  ఈ పాయసాన్ని తింటూ ఎంజాయ్ చేయొచ్చు.


...............................................


లడ్డు


కావలసిన పదార్థాలు
కొబ్బరి తురుము - ఒక కప్పు 
పాలపొడి - ఒక కప్పు 
పంచదార - ముప్పావు కప్పు 
నెయ్యి - పావు కప్పు 
యాలకుల పొడి - 1/4 స్పూను 
జీడిపప్పు తరుగు - రెండు స్పూన్లు


తయారు చేసే విధానం
స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. నెయ్యి వేడెక్కాక సన్నగా తరిగిన కొబ్బరి తురుమును వేసి పొడిగా అయ్యేవరకు వేయించాలి. దానిలో పాలపొడి, యాలకుల పొడి వేసి కూడా కలపాలి. మరొక కళాయిలో చక్కెర, నీళ్లు వేసి సిరప్‌లా అయ్యే వరకు మరిగించాలి. కొబ్బరి పాలపొడి మిశ్రమంలో ఈ చక్కెర సిరప్‌ను వేసి బాగా కలపాలి. కళాయికి మిశ్రమం అంటుకోకుండా, తక్కువ వేడి మీద ఉంచి, గరిటెతో కలుపుతూ ఉండాలి. సన్నగా తురిమిన జీడిపప్పును కూడా వేసి కలపాలి. లడ్డూ చుట్టడానికి వీలుగా ఆ పొడి మందంగా అయ్యేవరకు అలా చిన్న మంట మీద ఉడికిస్తూనే ఉండాలి. తరువాత స్టవ్ కట్టేసి చేతులకు కాస్త నెయ్యి రాసుకొని ఆ మిశ్రమాన్ని లడ్డూలా చుట్టుకోవాలి.


.............................................


ఐస్ క్రీమ్


కావలసిన పదార్థాలు 
లేత కొబ్బరి - ఒక కప్పు 
కొబ్బరి నీళ్లు - ఒక కప్పు 
క్రీమ్ - ఒక కప్పు 
పంచదార - అర కప్పు 
వెనిల్లా ఎసెన్స్ - ఒక టీ స్పూను


తయారు చేసే విధానం
లేత కొబ్బరిని కొబ్బరి నీళ్లతో కలిపి మిక్సీలో పేస్టులా చేయాలి. దానిలో క్రీమ్,  పంచదార, వెనిల్లా ఎసెన్స్ కూడా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఒక టిన్నులో లేదా ఐస్ క్రీమ్ మౌల్డ్ లో వేసి ఫ్రీజర్‌లో పెట్టండి.  నాలుగైదు గంటలు అలా వదిలేస్తే క్రీమ్ రెడీ అయిపోతుంది. 


Also read: పిసిఓఎస్ సమస్యతో బాధపడే మహిళలు తినాల్సిన, తినకూడని ఆహార పదార్థాల జాబితా ఇదిగో




























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.