PCOS సమస్యతో బాధపడే మహిళలకు ఏం తినాలి? అన్న విషయంలో చాలా సందేహాలు ఉంటాయి. PCOS లేదా పాలీ సిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అనేది ప్రపంచవ్యాప్తంగా 10 శాతం కంటే ఎక్కువ మంది మహిళలను వేధిస్తున్న హార్మోన్ల రుగ్మత. PCOS ఉన్న మహిళల్లో ఆండ్రోజన్ హార్మోన్ అధిక స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. ఇది ఒక మగ హార్మోను. ఇది ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి. అంతేకాదు టైప్2 డయాబెటిస్, రక్తపోటు, డిప్రెషన్ వంటివి వీరిలో త్వరగా వస్తాయి. జుట్టు అధికంగా పెరగడం, మొటిమలు రావడం, బరువు త్వరగా పెరగడం, పీరియడ్స్ సరిగా రాకపోవడం వంటివి కూడా వీరిలో ఎక్కువగా కనిపిస్తాయి. గర్భం ధరించడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే PCOS సమస్యతో బాధపడుతున్న మహిళలు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.
కార్బోహైడ్రేట్లు మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకం. ఇది మనకు శక్తిని అందిస్తుంది. అయితే PCOS సమస్య ఉన్న మహిళలు సాదా కార్బోహైడ్రేట్లను తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధారణ కార్బోహైడ్రేట్లకు బదులుగా సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను ఎంచుకోవాలి. ఎందుకంటే అవి విచ్ఛిన్నం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం తగ్గుతుంది. ఇలా సంక్లిష్ట కార్బోహైడ్రేట్లను కలిగి ఉన్న ఆహారాలైన బ్రౌన్ రైస్, క్వినోవా, ఓట్స్, చిరుధాన్యాలు, కాయధాన్యాలు, బీన్స్, నట్స్, బంగాళదుంపలు, బఠానీలు, మొక్కజొన్న, ఆపిల్, పియర్స్ వంటివి ఎంచుకోవాలి. వీటన్నింటిలో కూడా పిండి పదార్థాలు సంక్లిష్టంగా ఉంటాయి
పాలకు బదులు
ఈ సమస్యతో బాధపడుతున్న మహిళలు పాల వినియోగం వల్ల మరింతగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. 2013లో చేసిన అధ్యయనం ప్రకారం తక్కువ పాల ఉత్పత్తులను తీసుకునే వారితో పోలిస్తే, ఎక్కువ మొత్తంలో పాల ఉత్పత్తులను వినియోగించే PCOS స్త్రీలు ఇన్సులిన్ నిరోధకతను అధికంగా కలిగి ఉంటారు. అయితే వ్యక్తికి వ్యక్తికి ఈ ఫలితం భిన్నంగానే ఉన్నట్టు కూడా అధ్యయనం చెప్పింది. పాల ఉత్పత్తులు మీకు సరిపడకపోతే ప్రత్యామ్నాయంగా ఓట్స్ పాలు, బాదం పాలు, సోయా పాలను ఎంచుకోవడం మంచిది. పనీర్‌కు బదులుగా సోయాతో చేసిన టోఫూను తినవచ్చు.
ఉడికించినవే
వేయించిన ఆహారాలు, కాల్చిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. క్యాలరీలు కూడా ఎక్కువే. వీటిని తినడం వల్ల PCOS సమస్య పెరుగుతుంది. ఇన్సులిన్ నిరోధక శక్తి మరింతగా దిగజారుతుంది. కాబట్టి PCOS సమస్యతో బాధపడుతున్న మహిళలు వేయించిన, కాల్చిన ఆహారాలకు దూరంగా ఉండాలి. ఉడికించిన ఆహారాన్ని ఎప్పుడు ఎంచుకోవాలి.
ప్యాక్డ్ ఫుడ్ వద్దు
బయట ప్యాకేజింగ్ ఫుడ్స్ చాలా దొరుకుతున్నాయి. అవన్నీ కొన్ని రోజులు పాటు నిల్వ ఉండే సామర్థ్యం కలిగి ఉంటాయి. వాటిని తినడం పూర్తిగా మానుకోవాలి. ఎందుకంటే వీటిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే తినాలి. ఎక్కువ కూరగాయలు, ప్రోటీన్, కార్బోహైడ్రేట్లతో కూడిన ఆహారాన్ని తినడం అలవాటు చేసుకోవాలి. పప్పు, కూర, రోటి, అన్నం వంటివి మీ ఆరోగ్యానికి మీ సమతుల్యం చేస్తాయి.
Also read: వంటల్లో ఉప్పు అధికంగా పడిందా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.