Vinayaka Chavithi Recipes 2024 : వినాయక చవితి సమయంలో కచ్చితంగా చేసే వంటల్లో ఉండ్రాళ్లు ఉంటాయి. భాషలకు, ప్రాంతాలకు అతీతంగా ఈ ఉండ్రాళ్లు చేస్తారు. అయితే స్వామివారికి బెల్లంతో చేసిన ఉండ్రాళ్ల పాయసం అంటే కూడా మహా ప్రీతి. అందుకే ఆయనకు నైవేద్యంగా ఉండ్రాళ్ల పాయసం (Undralla Payasam) పెడతారు కొందరు. దీనిని చేయడం చాలా సింపుల్. పైగా రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఈ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
నెయ్యి - 3 టేబుల్ స్పూన్స్
ఉప్పు - రుచికి తగినంత
బెల్లం - 2 టేబుల్ స్పూన్స్
బియ్యం పిండి - 1 కప్పు
పచ్చి శనగపప్పు - 2 టేబుల్ స్పూన్స్
బెల్లం - 1 కప్పు
కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్స్
పాలు - 1 కప్పు
యాలకుల పొడి - రుచికి తగినంత
జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్స్
ఎండుద్రాక్ష - 1 టేబుల్ స్పూన్
తయారీ విధానం
ముందుగా పచ్చిశనగపప్పును ఓ గంట ముందు నానబెట్టుకోవాలి. అనంతరం మిగిలిన అన్ని పదార్థాలు సిద్ధం చేసుకోవాలి. బెల్లం కూడా కోరుకుని పెట్టుకుంటే చేసుకునే సమయంలో ఈజీగా ఉంటుంది. కొందరు ముందు రోజు రాత్రే బెల్లాన్ని సిద్ధం చేసుకుంటారు. ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టాలి. దానిలో ఒకటిన్నర కప్పుల నీరు వేయాలి. వేడి అవుతున్న సమయంలో 1 టీస్పూన్ నెయ్యి, చిటికెడు సాల్ట్ వేసి కలపాలి. దానిలో రెండు టేబుల్ స్పూన్స్ బెల్లం వేసి నీటిని మరగనివ్వాలి.
బెల్లం కరిగి నీళ్లు మరుగుతున్న సమయంలో కప్పు బియ్యం పిండిని వేయాలి. మంటను తగ్గించి.. బియ్యంపిండి నీటిని పూర్తిగా పీల్చుకునేవరకు కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా పిండిని కలిపిన తర్వాత స్టౌవ్ ఆపేసి.. మూతపెట్టి రెండు నిమిషాలు పక్కను ఉంచాలి. అనంతరం మూత తీసి పిండిని కలిపేందుకు ట్రై చేయాలి. కాస్త వేడిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా.. ఉండలు లేకుండా మృదువుగా అయ్యోలా పిండిని కలుపుకోవాలి. అవసరమైతే కాస్త నీళ్లు చల్లుకుని చలివిడి ముద్దలాగా చేసుకోవాలి.
ఇలా సిద్ధం చేసుకున్న పిండిని చిన్న సైజ్ బాల్స్‌లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాల్స్ చేసుకునేప్పుడు చేతికి పిండి అంటుకున్నట్లు అనిపిస్తే చేతులకు నెయ్యి లేదా.. బియ్యం పిండి రాసుకుని బాల్స్ చేయాలి. ఇలా చేస్తే పిండి చేతికి అంటుకోదు. ఇప్పుడు పెద్ద కడాయి తీసుకుని స్టౌవ్ వెలిగించండి. దానిలో రెండు కప్పుల నీళ్లు, నానబెట్టుకున్న శనగపప్పు, కాస్త ఉప్పు వేసి 5 నిమిషాలు ఉడికించాలి. లేదా పప్పు బాగా ఉడికేవరకు కుక్ చేసుకోవాలి.
శనగపప్పు ఉడికిన తర్వాత దానిలో కప్పు బెల్లం వేయాలి. అనంతరం కొబ్బరి తుమురు కూడా వేసి బాగా కలపాలి. బెల్లం కరిగిపోయాక.. దానిలో ముందుగా సిద్ధం చేసుకున్న రైస్ బాల్స్ వేయాలి. ఇప్పుడు మూత పెట్టి దానిని 5 నిమిషాలు ఉడికించాలి. ఇప్పుడు చిన్న గిన్నెలో బియ్యం పిండి ఓ టీస్పూన్ తీసుకుని.. దానిలో కాస్త నీళ్లు కలపాలి. రైస్ బాల్స్ ఉడికిపోయిన తర్వాత ఈ పిండిని దానిలో వేయాలి. ఇలా చేయడం వల్ల పాయసం క్రీమిగా వస్తుంది.
పాయసాన్ని కాస్త ఉడకనిస్తే మంచి క్రీమీగా వస్తుంది. దీనిని చల్లార్చాలి. ఇప్పుడు దానిలో కాచిన పాలు, యాలకుల పొడి వేసి కలపాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టి దానిలో రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేయాలి. దానిలో జీడిపప్పు, ఎండుద్రాక్ష వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. వాటిని కూడా పాయసంలో వేసి బాగా కలపాలి. అంతే టేస్టీ, టేస్టీ ఉండ్రాళ్ల పాయసం రెడీ. దీనిని వినాయకుడికి నైవేద్యంగా పెట్టి.. మీరు కూడా హాయిగా లాగించవచ్చు.
Also Read : గణేషుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాళికలు.. టేస్టీ, సింపుల్ రెసిపీ ఇదే