Sunday Special Gulab Jamun Cake Recipe : మీకు గులాబ్ జామూన్ అంటే ఇష్టమున్నా.. ముఖ్యంగా కేక్స్ అంటే ఇష్టపడే కిడ్స్ ఉన్నా ఈ రెసిపీని ఫాలో అయిపోవచ్చు. స్వీట్ క్రేవింగ్స్​ని దూరం చేసే సింపుల్ కేక్ రెసిపీ కోసం చూస్తుంటే ఇదే పర్​ఫెక్ట్. గులాబ్ జామూన్ పొడితో.. టేస్టీ, బెస్ట్ కేక్​ను రెడీ చేసుకుని ఇంటిల్లిపాది హాయిగా లాగించేయవచ్చు. మరి దీనిని ఎలా చేయాలి? రెసిపీ ఏంటి? ఫాలోఅవ్వాల్సిన టిప్స్ ఏంటి వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం. 


కావాల్సిన పదార్థాలు


మైదా - కప్పు 


గులాబ్ జామూన్ పౌడర్ - 1 కప్పు


పెరుగు - అరకప్పు


పంచదార - అరకప్పు


నెయ్యి - పావు కప్పు


పాలు - ముప్పావు కప్పు


రోజా ఎసెన్స్ - అర టీస్పూన్


వెనీలా ఎసెన్స్ - పావు టీస్పూన్


బేకింగ్ పౌడర్ - 1 టీస్పూన్


బేకింగ్ సోడా - అర టీస్పూన్


నీళ్లు - అర కప్పు


పంచదార - కప్పు


కుంకుమ - చిటికెడు


తయారీ విధానం


ముందుగా పంచదారను తీసుకోవాలి. దానిని మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. దానిలో ముందుగా అరకప్పు పెరుగు వేసుకోవాలి. దానిలోనే పంచదార పొడి వేయాలి. పావు కప్పు నెయ్యి కూడా వేసుకోవాలి. ఈ మూడు పదార్థాలు కలిసేలా బాగా కలపాలి. పంచదారను కచ్చితంగా పౌడర్ చేసుకోవాలి. దీనివల్ల పదార్థాల్లో పంచదార త్వరగా కలుస్తుంది. ఇప్పుడు మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత దానిలో పాలు వేయాలి. దానిని కూడా బాగా మిక్స్ చేయాలి. 


ఇప్పుడు ఓ జల్లెడ తీసుకుని దానిలో మైదా పిండి, గులాబ్ జామూన్ పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, చిటికెడు ఉప్పు వేసి.. జల్లించుకోవాలి. ఈ పిండిని ముందుగా కలిపి పెట్టుకున్న పంచదార మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. పిండి ఉండలు లేకుండా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు దానిలో రోజ్ ఎసెన్స్, వెనిలా ఎసెన్స్ వేసి మరోమారు బాగా కలపాలి. ఈ రెండు అందుబాటులో లేనప్పుడు.. యాలకుల పొడి కూడా వేసి కలుపుకోవచ్చు. కుదిరితే గులాబ్ జామున్ ఎసెన్స్ వేస్తే.. రుచి మరింత బాగా వస్తుంది. 


ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకుని.. దానికి బటర్ రాయండి. ఇప్పుడు దానిలో ఓ స్పూన్ మైదా పిండిని చల్లి.. మౌల్డ్​ని కోట్ చేయాలి. అనంతరం ముందుగా రెడీ చేసుకున్న మిశ్రమాన్ని.. ఈ మౌల్డ్​లోకి వేయాలి. సమానంగా సర్దిన తర్వాత.. మౌల్డ్​ను నేలపై సున్నితంగా 5 సార్లు టాప్ చేయాలి. ఇలా చేయడం వల్ల మధ్య గ్యాప్స్ లేకుండా ఉంటుంది. కేక్ మంచిగా వస్తుంది. ఇప్పుడు దానిని ప్రీహీట్ చేసిన ఓవెన్​లో ఉంచాలి. 170 డిగ్రీల ప్రీహీట్​లో 40 నుంచి 45 నిమిషాలు దీనిని బేక్ చేసుకోవాలి. 


ఇలా బేక్ చేసిన కేక్​ని టూత్ పిక్​తో టెస్ట్ చేసి బయటకు తీయాలి. ఓ పది నిమిషాలు పక్కన పెట్టాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి.. గిన్నె పెట్టి దానిలో ఓ కప్పు పంచదార.. నీళ్లు వేసి.. కరగనివ్వాలి. దానిలోనే కుంకుమ పువ్వు వేయాలి. పంచదార కరిగే లోపు.. కుంకుమ పువ్వు ఫ్లేవర్ సిరప్​లోకి వెళ్తుంది. ఈ పాకాన్ని.. పక్కన పెట్టుకున్న కేక్​పై వేసుకోవాలి. ఈ సిరప్ పూర్తిగా కేక్​లోకి వెళ్లేలా విడతల వారిగా.. సిరప్ వేసుకోవాలి.



దీనిని ఓ అరగంట ఫ్రిజ్​లో ఉంచాలి. అంతే టేస్టీ టేస్టీ గులాబ్ జామున్ కేక్ రెడీ. దీనిని మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్, గులాబ్ జామున్ ముక్కలతో గార్నిష్ చేసుకుని హాయిగా లాగించేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ సండేని ఈ గులాబ్ జామూన్ కేక్​తో హాయిగా స్పెండ్ చేయండి.


Also Read : టేస్టీ, క్రిస్పీ చెక్క అప్పాలు.. బోనాలకు ఈ పిండి వంటను చేసేయండిలా