కొత్త ఏడాదిని చికెన్ బిర్యానీతో స్వాగతం పలుకుదామనుకుంటున్నారా? కానీ వంట పెద్దగా రానివాళ్లు, బ్యాచిలర్లకు కాస్త కష్టమే. బయట కొందామంటే పెద్ద క్యూలు, రెస్టారెంట్ల నిండా జనాలు... అందుకే ఇంట్లోనే వండేసుకుంటే బెటర్. సింపుల్‌గా చేసే బ్యాచిలర్ బిర్యాని రెసిపీ ఇది. దీనికి పెద్దగా కష్టపడక్కర్లేదు. కింద మేం చెప్పినట్టు చేస్తే చాలు. ఇలా వండితే టేస్టు కూడా బావుంటుంది, దమ్ బిర్యానీ తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది. వంట వచ్చిన వాళ్లు ఎలాగూ వండుకుంటారు, వారికి రెసిపీలు అవసరం లేదు. అందుకే వంట సరిగా రాని వాళ్ల కోసమే ఈ సింపుల్ చికెన్ బిర్యానీ రెసిపీ. 


కావాల్సిన పదార్థాలు
బాస్మతి బియ్యం - రెండు కప్పులు
చికెన్ - అరకిలో
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూను
పచ్చి మిర్చి - రెండు 
ఉల్లి పాయ - ఒకటి
పెరుగు - అర కప్పు
కారం  - ఒక స్పూను   
పసుపు - అర స్పూను
గరం మసాలా - అర టీస్పూను
ధనియాల పొడి - ఒక స్పూను
మసాలా దినుసులు - గుప్పెడు
బిర్యానీ ఆకులు - రెండు
పుదీన - ఒక కట్ట
కొత్తిమీర - ఒక కట్ట
యాలకులు - మూడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
నెయ్యి - రెండు స్పూన్లు
నిమ్మరసం - ఒక స్పూను


తయారీ ఇలా...
1.  ముందుగా చికెన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. 
2. ఆ చికెన్లో పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం, గరం మసాలా, ధనియాల పొడి, పుదీనా, కొత్తిమీర, ఉప్పు, పెరుగు వేసి బాలా కలపాలి. 
3. మారినేషన్ కోసం ఒక అరగంట పక్కన పెట్టాలి. 
4. ఇప్పుడు స్టవ్ మీద రెండు కప్పుల బియ్యానికి మూడున్నర కప్పుల నీళ్లు పోసి పెట్టాలి. అందులో యాలకులతో పాటూ మసాలా దినుసులు, ఉప్పు కూడా వేసి కలపాలి. 
5. మరో పక్క స్టవ్ పె బిర్యానీ వండే పెద్ద కళాయి పెట్టి అందులో నూనె వేసి ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
6. అందులో మారినేషన్ చేసిన చికెన్ మొత్తాన్ని వేసి, బాగా కలిపి, మూత పెట్టాలి. 
7. చిన్న మంట మీద ఉడికిస్తే చికెన్ ఉడుకుతుంది. నూనె పైకి తేలే వరకు కర్రీలా ఉడికించుకోవాలి. 
8. ఇప్పుడు మంట చాలా చిన్నగా పెట్టుకోవాలి.
9. అన్నం 80 శాతం ఉడికాక స్టవ్ కట్టేసి, ఈ చికెన్ మిశ్రమంపై వేసుకోవాలి. 
10. అన్నం కాస్త పలుకుగా ఉంటుంది కాబట్టి అర గ్లాసు నీళ్ల చిలకరించుకోవచ్చు. 
11. పైన మూత పెట్టి చిన్న మంట మీద ఉడికించుకోవాలి. 
12. ఓ అయిదు నిమిషాల అలా ఉడికిస్తే అన్నం బాగా ఉడికేస్తుంది. 
13. ఓ పావుగంటసేపు మూత తీయకుండా అలానే వదిలేయాలి. 
14. తినేముందు మెల్లగా కింద నుంచి కలుపుకుంటూ రావాలి. జాగ్రత్తగా కలపకపోతే ముద్దయిపోవచ్చు. కాబట్టి పొరలు పొరలుగా కలపండి. టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయినట్టే. 


Also read: మనదేశంలో గత రెండేళ్లలో 5 శాతం పెరిగిన ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు, కరోనానే కారణమా?