చేదు రుచి కలిగి ఉన్నా కూడా కాకరకాయ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మధుమేహుల్లో షుగర్ లెవల్స్ అదుపులో ఉంచుతుంది. కాలేయాన్ని శుభ్రపరుస్తుంది. క్యాన్సర్ ని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. చేదుగా ఉండటం వల్ల దాన్ని తినడానికి అంతగా ఆసక్తి చూపించరు. అయితే దాని చేదు వదిలించడం చాలా సులభం. ఈ టిప్స్ పాటించి కాకరకాయతో రకరకాల వంటలు చేస్తే పెద్ద వాళ్ళతో సహా పిల్లలు కూడా లొట్టలేసుకుని మరీ లాగించేస్తారు. కష్టం లేకుండా కాకరకాయ చేదు ఇలా వదిలించేయండి.
తొక్క తీయాలి
కాకరకాయ చేదు లేకుండా చేయాలంటే ముందుగా చేయాల్సింది దాని బొడిపిలుగా ఉండే తొక్క అంతా తీయడం. ఎందుకంటే కాకరకాయ చేదులో ఎక్కువ శాతం దాని తొక్కలేనే ఉంటుంది. అందుకే చాకు లేదా పీలర్ ని తీసుకుని దాని తొక్క అంతా తీసేస్తే సరిపోతుంది.
బెల్లం వేసుకోవచ్చు
కాకరకాయ రుచి మార్చాలంటే బెల్లం చేర్చుకోవచ్చు. ఇది కూరకి మంచి రూపం ఇవ్వడమే కాదు అద్భుతమైన రుచిని అందిస్తుంది. కొద్దిగా బెల్లం ముక్క తురిమి పులుసులో వేసుకుంటే తీపి రుచి వస్తుంది. ఇంకా తీపి కావాలంటే పెంచుకోవచ్చు, వద్దని అనుకుంటే బెల్లం తగ్గించి వేసుకోవాలి.
డీప్ ఫ్రై
కాకరకాయతో పకోడీలు కూడా చేసుకోవచ్చు. కరకరలాడుతూ ఉండటం వల్ల పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చేదు పోవాలంటే డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే అది రుచిగా ఉంటుంది. ఫ్రై చేసుకోవడానికి ముందుగా అందులోని విత్తనాలు పూర్తిగా తొలగించుకోవాలి. ఇంట్లో కాకరకాయ పెంచుకోవాలని అనుకుంటే ఆ విత్తనాలు మీ గార్డెన్ లో వేసుకోవచ్చు.
ఉప్పుతో మెరినేషన్
కాకరకాయ చేదు వదిలించే మరొక మార్గం ఉప్పులో మెరినేట్ చేయడం. కాకరకాయ తొక్క, విత్తనాలు తీసేసి దానిపై కాస్త ఉప్పు చిలకరించాలి. ఒక 30 నిమిషాల పాటు వాటిని పక్కన పెట్టేసుకోవాలి. ఉప్పు కాసేపు అలాగే ఉండటం వల్ల నీరు వస్తుంది. ముక్కల్లోని నీరు పోయేలాగా గట్టిగా వాటిని పిసికి పక్కన పెట్టుకోవాలి.
ఇలా కూడా నానబెట్టుకోవచ్చు
1/2 కప్పు నీళ్ళు, 1/2 కప్పు వెనిగర్, 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకోవాలి. ఆ మిశ్రమంలో కాకరకాయ వేసుకుని కనీసం 20-30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఆ నీటిని తీసేసి మరికొన్ని నీళ్ళు తీసుకుని మరోసారి శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు వాటిని వండుకోవచ్చు. ఇలా చేస్తే కాకరకాయ చేదుగా అనిపించదు.
చేదు వదిలించుకునే మరొక మార్గం
ఒక గిన్నెలో 2-3 కప్పుల నీటిని మరిగించుకోవాలి. దానిలో ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి. నీరు బాగా మరిగిన తర్వాత కాకరకాయ అందులో వేసుకోఆలి. రెండు నిమిషాల పాటు ఎక్కువ మంట మీద ఉడికించుకోవాలి. ముక్కలు బయటకి తీసి చల్లటి నీటిలో మరొక రెండు నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు ఆ నీళ్ళనీ పారబోసి ముక్కలు తీసుకుంటే వంట చేసుకోవచ్చు. ఈ పద్ధతి ఉపయోగించి కూడా వాటి చేదుని వదిలించుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: గుండెకు మేలు చేసే నూనె ఇదే - ఏయే వంటలకు ఏయే నూనెలు మంచివో తెలుసా?