చికెన్ రెసిపీల తరువాత ఎక్కువ మంది ఫేవరేట్ వంటకం మటన్ వంటకాలే. నాన్‌వెజ్ ప్రియులకు మటన్ బిర్యానీ, మటన్ పులావ్, మటన్ వేపుడు చాలా నచ్చుతాయి. ఇవి ఇంట్లోనే టేస్టీగా వండుకోవచ్చు. 


కావాల్సిన పదార్థాలు
మటన్ - అరకిలో 
అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్ 
బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పు 
పెరుగు - ముప్పావు కప్పు 
ఉప్పు - రుచికి సరిపడా 
నెయ్యి - ఒక స్పూన్ 
నూనె - రెండు స్పూన్లు 
 మసాలా దినుసులు - అన్నీ కలిపి ఒక గుప్పెడు 
ఉల్లిపాయ - ఒకటి 
పచ్చిమిర్చి - రెండు 
కొత్తిమీర - ఒక కట్ట 
పుదీనా - ఒక కట్ట 
నీళ్లు - సరిపడినన్ని 
కారం - ఒక టీ స్పూను 
గసగసాలు - ఒక స్పూను


తయారీ ఇలా 
1. ముందుగా మటన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. అందులో పెరుగు, ఉప్పు వేసి ఒక గంట పాటు మారినేట్ చేయాలి.
3. కళాయిపై స్టవ్ పై కళాయి పెట్టి మసాలా దినుసులు, గసగసాలు అన్ని వేసుకుని వేయించాలి. వాటిని మిక్సీలో మెత్తని పొడిలా చేసుకోవాలి. మసాలా పొడి రెడీ అయినట్టే. 
4. ఇప్పుడు కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టి నూనె, నెయ్యి కలిపి వేయాలి. 
5. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. 
6. అవి బాగా వేగాక కొత్తిమీర, పుదీనా, కారం, ముందుగా మిక్సీలో చేసుకున్న మసాలా పొడి వేసి బాగా వేయించాలి.
7. అందులో మటన్ వేసి ఉడికించాలి. కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వరకు ఉడికిస్తే మటన్ మెత్తగా ఉడికిస్తుంది.
8. ఆ తర్వాత మూత తీసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేయాలి.
9. అవసరమైతే ఒక గ్లాస్ వాటర్ వేయాలి. మళ్ళీ విజిల్ పెట్టి రెండు విజిల్స్ వరకు స్టవ్ మీద ఉంచాలి. 
10. తరువాత మూత తీస్తే టేస్టీ మటన్ పులావ్ రెడీ. 


మటన్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. బీ కాంప్లెక్స్, పొటాషియం, సెలీనియం, కొలెైన్ వంటి క్యాన్సర్ నిరోధకాలు ఉంటాయి. మటన్ సోడియం తక్కువ, పొటాషియం అధికంగా ఉండడం వల్ల రక్తపోటు, స్ట్రోకు, మూత్రపిండాల సమస్యలు రాకుండా ఉంటాయి. దీనిలో కాల్షియం అధికంగా ఉంటుంది, కాబట్టి ఎముకలకు, దంతాలకు గట్టిగా ఉంటాయి. గర్భిణులు తమ డైట్లో మటన్ ని భాగం చేసుకోవాలి. మటన్ తినడం వల్ల పుట్టే బిడ్డల్లో న్యూరో సమస్యలు వంటివి రాకుండా ఉంటాయి. చర్మానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. మటన్ తరచూ తినడం వల్ల చర్మం కాంతిమంతంగా మారుతుంది. అయితే చెడు కొలెస్ట్రాల్ శరీరంలో అధికంగా ఉన్నవారు మటన్ తగ్గించాలి. డయాబెటిస్ ఉన్న వారు మాత్రం మటన్ తక్కువగా తినాలి. ఎందుకంటే మటన్ వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది.   అలాంటి వారు వారానికి ఒకసారి వందగ్రాములకు మించకుండా మటన్ తినాలి. ఎక్కువ తింటే మాత్రం సమస్యలు తప్పవు.  ముఖ్యంగా డయాబెటిస్ అదుపులో లేని వారు పూర్తిగా మటన్ పక్కన పెట్టేయాలి. డయాబెటిస్ అదుపులో ఉన్నప్పుడు మాత్రం మటన్ తినవచ్చు. 


Also read: డయాబెటిస్ ఉన్నవారు వారానికి రెండుసార్లు ముల్లంగి తింటే చాలు, అదుపులో ఉండడం ఖాయం