ఎప్పుడూ సాధారణ దోశె, గారెలు తిని బోరు కొడితే కాస్త డిఫెరెంట్‌గా అటుకులతో చేసి చూడండి. వీటికి ముందుగా గంటల ముందు పప్పులు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం పావు గంట నానబెడితే చాలు అప్పటికప్పుడే దోశెలు, గారెలు రెడీ అయిపోతాయి. వీటిని కొబ్బరి చట్నీతో తింటే రుచి అదిరిపోతుంది.
కావాల్సిన పదార్థాలు
అటుకులు - ఒక కప్పు
పెరుగు - పావు కప్పు
బొంబాయి రవ్వ - అర కప్పు
వంట సోడా - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - తగినంత
తయారీ ఇలా
1. ఒక గిన్నెలో అటుకులు ముందు నానబెట్టుకోవాలి. ఇది పావుగంటలో నానిపోతాయి.
2. అలాగే బొంబాయి రవ్వ కూడా వేయించకుండానే నీళ్లలో నానబెట్టుకోవాలి.
3. రెండూ పావు గంట నానాక మిక్సీలో రెండింటినీ వేసి మెత్తగా రుబ్బుకోవాలి.
4. ఆ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని అందులో పెరుగు వేసి బాగా కలపాలి.
5. దీనిలో ఉప్పు, చిటికెడు వంట సోడా కలిపి ఓ పదినిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
6. పెనంపై నూనె రాసి దోశెల్లా పలుచగా వేసుకోవాలి.
7. వీటిని కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.
............................
అటుకుల గారెలు
కావాల్సిన పదార్థాలు
అటుకులు - ఒక కప్పు
పెరుగు - పావు కప్పు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చి మిర్చి - రెండు
కరివేపాకులు - గుప్పెడు
బియ్యప్పిండి - రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు- రెండు స్పూన్తు
అల్లం పేస్టు - అర స్పూను
నూనె - వేయించడానికి సరిపడా
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ ఇలా
1. ఒక గిన్నెలో అటుకులు, నీళ్లు పోసి నానబెట్టాలి. అవి నానాక నీళ్లు ఒంపేసి, అటుకులను ముద్దలా మెదుపుకోవాలి.
2. ఆ గిన్నెలోనే పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి.
3. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకులు సన్నగా తరుక్కోవాలి. వాటిని కూడా వేసి బాగా కలపాలి.
4. తరువాత ఆ మిశ్రమంలో అల్లం పేస్టు, కొత్తిమీర తరుగు, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి.
5. మిశ్రమం గారెల్లా వేసుకోవడానికి వీలుగా వచ్చేలా కలుపుకోవాలి. అవసరమైతేనే నీళ్లు వేసుకోవాలి.
6. స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేయాలి.
7. నూనె వేడేక్కాక పిండిని గారెల్లా చేత్తో అద్దుకుని నూనెలో వేసుకోవాలి. అంతే రుచికరమైన గారెలు రెడీ అయినట్టే.
Also read: కొవ్వు కరిగి బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజు ఉసిరి టీ తాగండి