Ginger Carrot Soup : చలికాలంలో పెద్దలతో పాటు.. పిల్లల్లో కూడా రోగనిరోధక శక్తి (Immunity)తగ్గుతూ ఉంటుంది. వారిలో ఇమ్యూనిటీ పెంచడం చాలా అవసరం. అయితే ఈ సమయంలో పిల్లలకు టేస్టీ, హెల్తీ సూప్ ఇవ్వాలనుకుంటే.. మీరు వారికి అల్లం, క్యారెట్ సూప్ ఇవ్వండి. ఇది కేవలం పిల్లలకే అనుకుంటే పొరపాటే.. పెద్దలు కూడా హాయిగా ఈ సూప్‌ను ఆస్వాదించవచ్చు. మరి ఈ హెల్తీ సూప్(Healthy Soup For Winter)ను ఏ విధంగా తయారు చేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
క్యారెట్లు - 8 పెద్దవి
ఆలివ్ నూనె - పావు కప్పు
ఉప్పు - రుచికి తగినంత
వెజిటెబుల్ స్టాక్ - 6 కప్పులు
అల్లం - అంగుళం (పై తొక్క తీసేయాలి)
పెద్ద ఉల్లిపాయ - 1 (చిన్నగా తరగండి)
వెల్లుల్లి - 2 (చిన్నగా తరగాలి)
మిరియాల పొడి - కొంచెం
తయారీ విధానం
అల్లం క్యారెట్ సూప్ తయారు చేసుకోవడానికి ఓవెన్ ఉంటే మంచిది. ముందుగా క్యారెట్లతో తొక్కను తీసి.. రౌండ్ షేప్‌లో పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయండి. ఇప్పుడు రిమ్డ్ బేకింగ్ షీట్లో వాటిని పేర్చి.. దానిపై 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె వేయాలి. పైన కాస్త ఉప్పు చల్లండి. ఇప్పుడు ఓవెన్ రాక్ సెట్ చేసి బ్రాయిలర్ ఆన్ చేయండి. దానిలో రాక్ ఉంచండి. క్యారెట్లు బ్రౌన్ కలర్లోకి మారి మెత్తబడేవరకు ఉంచండి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి వాటిని తిప్పండి.
ఈలోపు స్టౌవ్ వెలిగించి గిన్నె పెట్టి దానిలో వెజిటెబుల్ స్టాక్ వేయండి. అది మరుగుతున్న సమయంలో అల్లం, కొత్తిమీర వేసి ఉడికించండి. ఫ్రై పాన్‌లో ఆలివ్ నూనె వేసి ఉల్లిపాయను బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించండి. దానిలో వెల్లుల్లి వేయండి. ఇప్పుడు సిద్ధం చేసుకున్న క్యారెట్లు కూడా వేయండి. వాటిని గరిటెతోనే స్మాష్ చేసి.. బాగా కలపండి. ఇప్పుడు మరిగించిన వెజిటేబుల్ స్టాక్‌ని దీనిలో వేసేయండి. బాగా కలిపి.. రుచికి తగినంత ఉప్పు వేయండి. సూప్ బాగా మందంగా అనిపిస్తే.. నీరు వేయొచ్చు. చివరిగా మిరియాల పొడి వేసి బాగా కలిపి దించేయండి. అంతే వేడి వేడి అల్లం క్యారెట్ సూప్ రెడీ.
పిల్లల్లో ఈ సూప్ ఇమ్యూనిటీని పెంచుతుంది. వారు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. పెద్దల్లో కూడా ఈ సూప్ పలు ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. వింటర్లో వచ్చే ఫ్లూ వంటి వ్యాధులు దరిచేరకుండా రక్షిస్తుంది. ఒకవేళ జలుబు, దగ్గుతో బాధపడుతున్నప్పుడు దీనిని తీసుకుంటే మీకు ఉపశమనం కలుగుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు కూడా దీనిని హాయిగా లాగించేయవచ్చు. బరువు తగ్గడంలో కూడా ఈ సూప్ ముఖ్యపాత్ర పోషిస్తుంది. వింటర్లో బద్ధకంగా అనిపిస్తే.. ఈ సూప్ ఒక కప్పు తాగండి. ఇది మీరు రోజంతా యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాదండోయ్.. జుట్టు, చర్మ సంరక్షణకు ఇది సహాయం చేస్తుంది. చలికాలంలో ఎదురయ్యే జుట్టు, చర్మ సమస్యలను దూరం చేస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ చేసి పొడిబారకుండా చేస్తుంది.
Also Read :హెల్తీ, టేస్టీ బనానా మిల్క్.. ఇది ప్రోటీన్‌కు మంచి సోర్స్
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆
*T&C Apply*
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.