వేడి వేడి మసాలా పకోడీ బయట చూడగానే నోరూరిపోతుంది. వెంటనే వాటిని కొనేసి లాగించేస్తారు. కానీ బయట ఎక్కువగా కాగిన నూనెలో వాటిని వేయించి ఇస్తారు. అది ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం కాదు. అందుకే ఎక్కువ నూనె ఉపయోగించకుండా ఇంట్లోనే సింపుల్ గా మూడు చక్కని మార్గాల్లో పకోడీ తయారు చేసుకోవచ్చు. నూనెలో ముంచకుండానే మీకు ఇష్టమైన క్రిస్పీగా వాటిని రెడీ చేసుకోవచ్చు. వీటికి ఎక్కువ శ్రమ పడాల్సిన పని కూడా లేదు. మీ టైమ్ సేవ్ అవుతుంది.. అలాగే ఆరోగ్యంగా కూడ ఉంటారు.


వేడి నీటిలో పకోడాలు


అదేంటి నీటిలో వేస్తే మెత్తగా అయిపోతాయి కదా క్రిస్పీగా ఎలా ఉంటాయని అనుకుంటున్నారా? కానీ ఆరోగ్యానికి హాని కలిగించే నూనెను ఎక్కువగా వాడే డీప్ ఫ్రై పకోడాలు ఇప్పటి వరకు మనం తిన్నాం. ఉల్లిపాయ, వంకాయ పకోడీలు చేసుకునేందుకు వాటిని సన్నగా తరిగి పెట్టుకుంటారు. పకోడీకి కావాల్సిన శెనగపిండి, ఉప్పు, కారం ఇలా అన్నీ కలిపి పిండి సిద్ధం చేసుకోవాలి. మరొక పాన్ లో నీటిని బాగా మరిగించుకోవాలి.  నీరు బాగా బాయిల్ అయిన తర్వాత చేతులతో లేదా స్పూన్ తో పకోడీలు వేసుకోవచ్చు. నీటిలో ఎలా వేగుతాయనే కదా మీ అనుమానం. వేడి వేడి నూనెలాగా మరిగే నీరు కూడా బాగా పని చేస్తుంది. దీని వల్ల పిండి నీటిలో కలవకుండా ఉంటుంది. పకోడీలు మునిగే వరకు నీరు ఉండేలా చూసుకోవాలి. అవి నీటి వేడికి రంగు మారడం ప్రారంభమయితే అవి ఉడుకుతున్నాయని అర్థం. ఉడికిన వాటిని బయటకి తీసి నాన్ స్టిక్ పాన్ లో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసుకుని 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే ఎంతో సింపుల్ గా చేసే పకోడీలు రెడీ అయిపోయినట్టే. చాట్ మసాలా చల్లుకుని గ్రీన్ చట్నీ తో సర్వ్ చేసుకోవచ్చు.


పకోడీ కోసం నాన్ స్టిక్ పాన్


పకోడీలు చేసుకోవడం కోసం నాన్ స్టిక్ పాన్ ఉపయోగిస్తే అది తక్కువ నూనెని తీసుకుంటుంది. అందుకే సాధారణ పాన్ కి బదులుగా నాన్ స్టిక్ ఉపయోగించాలి. పకోడీ పిండిని సిద్ధం చేసుకుని స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ వేడి చేసి అందులో ఒక స్పూన్ నూనె వేసి పాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. నూనె కాస్త వేడి అయ్యాక పకోడీలు ఒక్కొక్కటిగా వేసి తక్కువ మంట మీద 5 నిమిషాలు ఉడికించాలి. బంగారు రంగు వర్ణంలోకి వచ్చినప్పుడు వాటిని మరొక వైపు తిప్పుకుని ఉడికించుకుంటే టేస్టీ టేస్టీ పకోడీలు రెడీ.


అప్పం మేకర్ లో


నూనె లేని పకోడీలు చేసుకోవడానికి ఉన్న మరొక మార్గం అప్పం మేకర్. శెనగపిండి, నీరు, ఉప్పు, మసాలాలు వేసుకుని పిండి రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద అప్పం మేకర్ పెట్టుకుని అచ్చుల్లో నెయ్యి లేదా నూనె కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత అందులో పకోడీ పిండి వేసుకోవాలి. తక్కువ మంట మీద పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. గోధుమ రంగులోకి మారినప్పుడు వాటిని మరొక వైపుకు తిప్పుకోవాలి.


ఎయిర్ ఫ్రైయర్ ఉపయోగించడం


చాలా మంది ఇళ్ళలో ఇప్పుడు ఈ బుల్లి కిచెన్ గ్యాడ్జెట్ కనిపిస్తుంది, ఎయిర్ ఫ్రైయర్ లో పకోడీ చేసుకోవచ్చు. పకోడీ కోసం పిండి రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎయిర్ ఫ్రైయర్ ని 175-190 డిగ్రీల సెల్సియస్ వద్ద సుమారు 5 నిమిషాల పాటు వేడి చేసి పెట్టుకోవాలి. కుకింగ్ ట్రే తీసుకుని పిండిని చిన్న చిన్న భాగాలుగా లేదా బాల్స్ గా వేసుకోవాలి. కుకింగ్ స్ప్రేతో ఎయిర్ ఫ్రైయర్ లో ఆయిల్ వేసుకోవచ్చు. లేదంటే వాటి మీద బ్రష్ తో నూనె రాయవచ్చు. 10-15 నిమిషాల పాటు ఉడికించుకుని సగం కాలిన తర్వాత మరొకవైపుకి వాటిని తిప్పుకోవాలి. గ్రీన్ చట్నీ కెచప్ తో వేడి వేడి పకోడీలు లాగించేయడమే.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: ఈ లక్షణాలు కనిపిస్తే జలుబు అనుకోవద్దు- కొత్త వైరస్ లక్షణాలు కావొచ్చు