అరటికాయలతో సాధారణంగా వేపుడు, కూర, బజ్జీలే చేస్తారు. కానీ వాటిని గుజ్జులా చేసి కోఫ్తా కర్రీ చేసుకుంటే ఆ రుచే వేరు. ఈసారి అరటికాయలతో ఇలా కోఫ్తా కర్రీ ప్రయత్నించండి. రుచి అదిరిపోతుంది. పిల్లలకు,పెద్దలకు ఎంతో నచ్చుతుంది. దీన్ని చేయడం కూడా చాలా సులభం.
కావాల్సిన పదార్థాలు
అరటికాయలు - మూడు
సెనగపిండి - నాలుగు స్పూన్లు
అల్లం వెల్లుల్లి ముద్ద - రెండు స్పూన్లు
కొత్తిమీర తరుగు - పావు కప్పు
కారం - రెండు స్పూన్లు
నూనె - తగినంత
ఉల్లిపాయ - ఒకటి
బిర్యాని ఆకు - ఒక్కటి
పసుపు - అర స్పూను
టమోటా - ఒకటి
గరం మసాలా - అర స్పూను
ఉప్పు - రుచికి సరిపడా
తయారీ ఇలా
అరటికాయలను పైన తొక్క తీసేసి పెద్ద ముక్కలుగా చేసి కుక్కర్లో నీళ్లు పోసి ఉడకబెట్టాలి. ఆవిరిపోయాక కుక్కర్ మూత తీసి అరటికాయలను ఒక గిన్నెలో వేసి చేతితో మెత్తగా మెదుపుకోవాలి. అరటికాయల గుజ్జులో శనగపిండి, కొత్తిమీర తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం వేసి బాగా కలపాలి. వాటిని కోఫ్తాలు ఏ సైజులో కావాలో, ఆ సైజులో ఉండలుగా చుట్టుకోవాలి. ఇప్పుడు కళాయి మీద స్టవ్ పెట్టి ఈ ఉండలను చిన్న మంట మీద నూనె వేసి వేయించుకోవాలి. తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో మరి కొంచెం నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు, బిర్యాని ఆకు వేసి వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. ఇది బాగా వేగాక టమోటో తరుగును వేసి వేయించాలి. టమోటో వేగిన తరువాత కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. రెండు కప్పుల నీళ్లు వేసి గ్రేవీలా కలుపుకోవాలి. ఒక పది నిమిషాలు పాటు గ్రేవిని ఉడికించాలి. తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కోఫ్తాలను అందులో వేయాలి. చిన్న మంట మీద ఓ పది నిమిషాలు ఉడికించాలి. దించేసేముందు కాస్త గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసి ఓసారి కలుపుకొని స్టవ్ కట్టేయాలి. దీన్ని వేడి వేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతుంది. చపాతీలోకి కూడా బాగుంటుంది.
అరటికాయలు తినడం వల్ల ఆరోగ్యానికి అంతా మంచే జరుగుతుంది. దీనిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి అధిక రక్తపోటు ఉన్నవారు అరటికాయలు తినడం వల్ల మేలు జరుగుతుంది. హైబీపీ అదుపులో ఉంటుంది. గుండెపోటు వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. గుండెకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. దీనిలో విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ b6 అధికంగా లభిస్తాయి. కాబట్టి అరటికాయను వారానికి రెండుసార్లు తినడం ముఖ్యం. మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా అరటికాయను తినవచ్చు. అరటికాయ గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువ. కాబట్టి దీన్ని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. పైగా చక్కెర స్థాయిలు తగ్గించడానికి అరటికాయ సహాయపడుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటికాయను తినడం వల్ల వారికి మరింత ఆరోగ్యం చేకూరుతుంది.
Also read: ఇంట్లో ఆస్తమా రోగులు ఉన్నారా? అయితే వీటికి గుడ్ బై చెప్పండి