YCP Leaders Celebrations: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు రిమాండ్ తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా కాక రేపుతోంది. స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రెండు వారాల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఉదయం నుంచి దాదాపు ఏడున్నర గంటలకుపైగా ఏసీబీ కోర్టులో వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. సీఐడీ తరఫున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు. సీఐడీ వాదనలతోనే కోర్టు ఏకీభవిస్తూ ఏసీబీ కోర్టు చంద్రబాబుకు ఈ నెల 22 వరకు 2 వారాల పాటు రిమాండ్ విధించింది.
చంద్రబాబు అరెస్ట్‌పై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ ఏపీలో టీడీపీ బంద్‌కు పిలుపునిచ్చింది. వైసీపీ నేతలు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. మంత్రి రోజా స్వీట్లు పంచారు. చంద్రబాబుకు ఆరంభం మాత్రమేనని, అంతం కాదని ఆమె అన్నారు. పైనుంచి దేవుడు చూస్తున్నాడని, చంద్రబాబుకు శిక్ష వేస్తాడని అన్నారు. చంద్రబాబు ఎంతో మంది ఉసురు పోసుకున్నారని, అందరి జీవితాలతో ఆడుకున్నారని ఆమె అన్నారు. ఇంకా మరిన్ని కేసుల్లో చంద్రబాబు జీవితాంతం జైలులో చిప్ప కూడు తింటారని రోజా అన్నారు. సరైన సమయంలో దేవుడు చంద్రబాబు పాపాలకు శిక్ష వేశాడని ఆమె అన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు పదేళ్లు జైలు శిక్ష పడుతుందని వైసీసీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. స్కిల్ డెవలప్‌మెంటు కేసు మాత్రమే కాదు, మరో ఆరేడు కేసులున్నాయని అన్నారు. చంద్రబాబు చట్టాలను అతిక్రమించారని ఆయన అన్నారు. విదేశాలకు నగదును, ఆస్తులను తరలించి దాచుకున్నారని ఆయన అన్నారు. కచ్చితమైన ఆధారాలతో చంద్రబాబుపై కేసు నమోదు చేశారని ఆయన అన్నారు.
చంద్రబాబుకు కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంపై మరో మంత్రి అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. కోట్ల రూపాయలిచ్చి తెచ్చిన లూథ్రా పొన్నవోలు ముందు బలాదూర్ అని ఆయన ట్వీట్ చేశారు. టీడీపీ పట్టుగా భావించే అమరావతిలో వైసీపీ నేతలు బాణసంచా పేల్చుతూ సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో వైసీపీ నేతలు స్వీట్లు పంచుకున్నారు. టాపాసులు పేల్చారు. అవినీతి అనకొండ చంద్రబాబుకు శిక్ష పడిందన్నారు.