Vinayaka Chavithi Recipes 2024 : మోదకాలు లేని వినాయక చవితి ఉండదనే చెప్పాలి. ఎందుకంటే వినాయకచవితి రోజు మోదకాలకు ఉండే ప్రత్యేకతే వేరు. గణేషుడుకి ఇవి అంటే చాలా ఇష్టమని చెప్తారు. ఆరోజు మోదకాల్లో వివిధ రకాలు వండుతారు. అయితే ఈసారి వినాయక చవితికి రవ్వ మోదకాలు(Ravva Modak), డ్రై ఫ్రూట్స్ మోదకాలు(Dry Fruit Modak) సిద్ధం చేసేయొచ్చు. వీటిని తయారు చేయడం కష్టమనుకుంటున్నారేమో.. చాలా సింపుల్‌గా వీటిని వండేయొచ్చు. మరి వీటిని ఎలా వండాలి. కావాల్సిన పదార్థాలు ఏంటి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
రవ్వ మోదకాలకు కావాల్సిన పదార్థాలు
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్స్
రవ్వ - కప్పు
పాలు - రెండు కప్పులు
యాలకుల పొడి - అర టీస్పూన్
పంచదార - ముప్పావు కప్పు
కొబ్బరి - 1 కప్పు
బెల్లం - అర కప్పు
యాలకుల పొడి -
తయారీ విధానం
ముందుగా స్టౌవ్ వెలిగించి దానిపై మందపాటి పాన్ పెట్టండి. దానిలో నెయ్యి వేసి కరగనివ్వాలి. నెయ్యి వేడిగా మారి కరిగిన తర్వాత దానిలో కొబ్బరి వేసి రెండు నిమిషాలు వేపాలి. అనంతరం దానిలో బెల్లం వేయాలి. యాలకుల పొడి వేసి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి. కొబ్బరిలోని నీటితో బెల్లం కరిగి పూర్తిగా కొబ్బరిలో కలుస్తుంది. బెల్లం, కొబ్బరి కాస్త దగ్గరైన తర్వాత స్టౌవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో కడాయి తీసుకుని దానిలో నెయ్యి వేసి రవ్వను వేయించుకోవాలి.
రవ్వ నుంచి మంచి అరోమా వచ్చిన తర్వాత దానిలో పాలు వేయాలి. పాలు, రవ్వ బాగా కలిసిపోవాలి. రవ్వ మంచిగా ఉడికి.. పాలల్లో కలిసి దగ్గరవుతుంది. ఇలా అయిన మిశ్రమంలో పంచదార వేసి.. అది కరిగి రవ్వలో కలిసే వరకు కలుపుకోవాలి. రవ్వ పాన్ని వదిలేంత వరకు దానిని కలుపుతూనే ఉండాలి. స్టౌవ్ ఆపేసి.. దానిలో నెయ్యి వేసి కలపాలి. ఇప్పుడు మోదకాలు చేసుకునే మౌల్డ్ తీసుకోవాలి. దానిలో రవ్వను, ముందుగా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని మధ్యలో ఉంచి మౌల్డ్ చేయాలి. అంతే టేస్టీ రవ్వ మోదకాలు రెడీ.
డ్రై ఫ్రూట్స్ మోదకాలకు కావాల్సిన పదార్థాలు
ఖర్జూరం - 150 గ్రాములు
కొబ్బరి పొడి - 50 గ్రాములు
జీడిపప్పు - 3 టేబుల్ స్పూన్స్
నెయ్యి 1 టేబుల్ స్పూన్
బాదం - 1 టేబుల్ స్పూన్
యాలకుల పొడి - చిటికెడు
పిస్తా - 2 టేబుల్ స్పూన్స్
పాల పొడి - 50 గ్రాములు
గసగసాలు - 1 టీస్పూన్
తయారీ విధానం
ముందుగా సీడ్స్ లేకుండా ఖర్జూరం తీసి దానిని పేస్ట్ చేసుకోవాలి. జీడిపప్పును కూడా పౌడర్‌గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. బాదం, పిస్తాలను పలుకులుగా చేసుకోవాలి. ముందుగా స్టౌవ్ వెలిగించి దానిలో కొబ్బరి పొడి వేసి కాస్త వేయించి పక్కన పెట్టుకోవాలి. అరోమా వచ్చే వరకు వేయిస్తే సరిపోతుంది. అనంతరం గసగసాలు వేసి.. చిట్లేవరకు వాటిని కూడా వేయించి పక్కన పెట్టుకోవాలి.
అదే కడాయిలో బాదం పలుకులు, పిస్తా వేసి వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కాస్త నెయ్యి వేసి ఖర్జూరం పేస్ట్‌ని వేయాలి. దీనిని సన్నని సెగ మీద వేయించుకోవాలి. తర్వాత స్టౌవ్ ఆపేసి పాలపిండి వేసి ఖర్జూరం పేస్ట్‌లో మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిలో జీడిపప్పు పొడి, బాదం, పిస్తా పలుకులు, గసగసాలు, కొబ్బరి పొడి. యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. మోదకాల మౌల్డ్‌కి నెయ్యి రాసి.. ఈ మిశ్రమాన్ని వాటిలో స్టఫ్ చేస్తే డ్రై ఫ్రూట్స్ మోదకాలు రెడీ. లేదంటే దీనిని ఉండలుగా చుట్టుకుని లడ్డూలుగా కూడా ప్రసాదంగా పెట్టవచ్చు.