Vegetarian Pulao Recipes : పులావ్ అంటే ఇష్టమా? అయితే శ్రావణమాసంలో చక్కగా దాల్ పులావ్ చేసేసుకోండి. దీనిని బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీనిని సులభంగా చేయడమే కాకుండా రుచిలో కూడా చాలా మంచి అనుభూతిని ఇస్తుంది. పిల్లల నుంచి పెద్దలవరకు అందరూ ఇష్టపడి తింటారు. మరి ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా తయారు చేసుకోవాలి.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
నూనె - 2 టీస్పూన్స్
నెయ్యి - 2 టీస్పూన్స్
దాల్చిన చెక్క - 1 అంగుళం
లవంగాలు - 4
యాలకులు - 4
షాజీరా - అర టీస్పూన్
స్టార్ పువ్వు - 1
బిర్యానీ ఆకు - 1
మరాఠి మొగ్గ - 1
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 6
పుదీనా - పావు కప్పు
బఠానీ - పావు కప్పు
టమాటా - 1
క్యారెట్ - 1
బంగాళ దుంప - 1
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
పెసరపప్పు - అరకప్పు
పెరుగు - పావు కప్పు
బియ్యం - ఒక కప్పు
ఉప్పు - రుచికి తగినంత
కొత్తిమీర - గార్నిష్‌కి తగినంత
తయారీ విధానం
ముందుగా పెసరపప్పును పది నిమిషాలు నానబెట్టుకోవాలి. బియ్యాన్ని కూడా కడిగి ఓ అరగంట పక్కన పెట్టుకోవాలి. అంతేకాకుండా ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా పొడుగ్గా కోసుకోవాలి. టమోటాలు, క్యారెట్, బంగాళదుంపలను ముక్కలుగా కోసుకోవాలి. అల్లం వెల్లుల్లిని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టుకోవాలి. దానిలో నూనె, నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి.
నూనె వేడి అయిన తర్వాత దానిలో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, మరాఠి మొగ్గ వేసుకోవాలి. అవి కాస్త వేగి.. మంచి వాసన వస్తున్నప్పుడు దానిలో ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి వేగిన తర్వాత దానిలో పచ్చిమిర్చి, పుదీనా వేసుకోవాలి. బఠానీలు వేసి.. కాసేపు ఉడికించుకోవాలి. అనంతరం టమోటా, క్యారెట్, బంగాళ దుంపలు ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. వాటిని బాగా కలిపి మగ్గించుకోవాలి.
Also Read : శ్రావణమాసం స్పెషల్ ఆవ పులిహోర.. నోరూరించే సింపుల్ రెసిపీ ఇదే
ముక్కలు కాస్త ఉడికిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుకోవాలి. అనంతరం పెసరపప్పు, పెరుగు వేసి బాగా కలపాలి. బియ్యం వేసి మరోసారి కలపాలి. పెసరపప్పు అరకప్పు తీసుకుంటే బియ్యం కప్పు తీసుకోవాలి. బియ్యం కప్పు తీసుకుంటే నీరు రెండు కప్పులు తీసుకోవాలి. నీరు వేసి.. ఉప్పు వేసి కలిపి.. కొత్తమీర వేసి మూతపెట్టాలి.
నీరు పూర్తిగా ఇంకిపోయి.. రైస్ ఉడికిపోతుంది. అంతే వేడి వేడి టేస్టీ దాల్ పులావ్ రెడీ. దీనిని తయారు చేయడం చాలా తేలిక కాబట్టి ఉదయాన్నే లంచ్ బాక్స్ కోసం సిద్ధం చేసుకోవచ్చు. దీనిలో కర్రీ వేసుకోకపోయినా తినొచ్చు. ఆవకాయతో కూడా దీనిని తీసుకోవచ్చు. రైతా కూడా మంచి కాంబినేషన్. మరి ఇంకెందుకు ఆలస్యం. మీరు కూడా ఈ టేస్టీ రెసిపీని తయారు చేసి.. లంచ్‌కి సిద్ధం చేసేసుకోండి.
Also Read : గోదావరి స్పెషల్ తాటిగారెలు.. ఇవి చేసుకుని తినాలంటే కూసింత కళాపోషణ ఉండాలి