Andhra Pradesh Special Thatigarelu : గోదారోళ్లు చేసే వంటలకు మామూలు క్రేజ్ ఉండదు. ఆ ప్రాంతం వెళ్లారంటే.. ఒక్కో సీజన్లో ఒక్కో టేస్టీ ఫుడ్‌ని కామన్‌గా చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వేసవి కాలం తర్వాత.. ఆగస్టు.. అక్టోబర్ సమయాల్లో బాగా ఎక్కువగా తాటిగారెలు, తాటి రొట్టెలు చేసుకుంటూ ఉంటారు. ఇదే తాటిముంజలు.. తాటికాయలుగా మారే సమయం. అయితే ఈ తాటికాయలను ఉపయోగించి టేస్టీ ఫుడ్స్ చేసుకుంటే ఆ రుచిని మీరు మరువలేరు. అలాంటివాటిలో తాటి గారెలు ఒకటి. కాస్త ఓపికతో తాటి గుజ్జు తీసుకుంటే.. ఈ టేస్టీ రెసిపీ చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మరి దీనిని ఎలా చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు
తాటికాయలు
ఇడ్లీ రవ్వ - రెండు కప్పులు
బెల్లం - కప్పు
కొబ్బరి తురుము - 1 కప్పు
ఉప్పు - చిటికెడు
యాలకుల పొడి - చిటికెడు
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా
తయారీ విధానం
ముందుగా తాటికాయలు తీసుకోవాలి. అవి మరీ పచ్చిగా ఉండకూడదు. పండినవి బాగుంటాయి. వాటి నుంచి మంచి వాసన వస్తుంటే ఇంకా రుచిగా ఉంటాయి. అయితే ముందుగా తాటికాయలను కడిగి.. వాటిని కాసేపు నీటిలో నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల తాటి గుజ్జు త్వరగా వస్తుంది. ఓ అరగంట వాటిని నీటిలో వేసి వదిలేయాలి. ఇప్పుడు కొబ్బరిని తీసుకుని తురుముకోవాలి. అలాగే బెల్లాన్ని కూడా తురిమి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు తాటికాయలపై ఉన్న తొక్కను తీసివేయాలి. నల్లని తొక్కను తీసేసి.. తాటిగుజ్జును తీసుకోవాలి. గరుకుగా ఉండే గిన్నెలు లేదా.. చేతిని బలంగా ఉపయోగించి గుజ్జును తీసుకోవాలి. ఇది కాస్త శ్రమతో కూడుకున్న పని. కానీ దీని రుచి మీరు పడిన శ్రమకి వర్త్ అనిపిస్తుంది. ఇలా తీసుకున్న పల్ప్‌ను ఓ మిక్సింగ్ బౌల్లోకి వేసుకోండి. ఇప్పుడు దానిలో ఇడ్లీరవ్వను వేసుకోవాలి. అనంతరం పచ్చికొబ్బరి తురుము, బెల్లం తురుము, ఉప్పు, యాలకుల పొడి వేసుకోవాలి.
ఈ పదార్థాలన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మీరు బెల్లానికి బదులు.. చక్కెర కూడా వేసుకోవచ్చు. ఇది కూడా మంచి రుచిని ఇస్తుంది. కానీ మీరు చక్కెరకు దూరంగా ఉంటే బెల్లం మంచి ఆప్షన్ అవుతుంది. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై కడాయి పెట్టాలి. దానిలో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేయండి. అది వేడి అయ్యాక.. ముందుగా తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని.. గారెలుగా చేసుకోవాలి. ఈ గారెలను నూనెలో వేయాలి.
తాటి గారెలను రెండు వైపులా వేయించుకున్నాక.. మంచి బ్రౌన్, గోల్డెన్ రంగును వస్తుంది. ఇలా వేగిన తర్వాత వాటిని నూనె నుంచి తీసివేయాలి. అంతే టేస్టీ టేస్టీ తాటిగారెలు రెడీ. ఇవి చాలా రుచిగా ఉంటూ.. స్వీట్ క్రేవింగ్స్‌ని దూరం చేస్తాయి. పైగా ఆరోగ్యానికి కూడా చాలా మంచివి. కొందరు వీటిలో కొబ్బరి తురుము వేసుకోరు. మొత్తం ప్రాసెస్ మాత్రం సేమ్ ఫాలో అవుతారు. ఈ టేస్టీ గారెలను చిన్నవారి నుంచి పెద్దవారు వరకు అందరూ హాయిగా తింటారు.
Also Read : శ్రావణమాసం స్పెషల్ ఆవ పులిహోర.. నోరూరించే సింపుల్ రెసిపీ ఇదే