నాన్ వెజ్ ప్రియులకు మటన్ వంటకాలంటే ఎంతో ఇష్టం. ఎప్పుడూ మటన్ కర్రీ, మటన్ వేపుడు, మటన్ పాయ, మటన్ బిర్యానీ... ఇవే కాదు, కాస్త కొత్త రెసిపీలు కూడా ప్రయత్నించాలి. ఈ బ్లాక్ మటన్ కర్రీని ఓసారి ప్రయత్నించి చూడండి. రుచి అదిరిపోతుంది. ముఖ్యంగా రోటీలతో ఇవి మంచి జోడీ.
కావలసిన పదార్థాలు
మటన్ - ముప్పావు కిలో
పసుపు - అర టీ స్పూను
ఉల్లిపాయలు - నాలుగు
ధనియాలు - ఒక స్పూను
యాలకులు - 4
లవంగాలు - 4
ఎండుకొబ్బరి పొడి - అరకప్పు
అల్లం తరుగు - ఒక టేబుల్ స్పూన్
చింతపండు - చిన్న ఉండ
పుదీనా ఆకులు - ఒక కట్ట
పెరుగు - ఒక కప్పు
నూనె - 4 టేబుల్ స్పూన్లు
గసగసాలు - ఒక టేబుల్ స్పూన్
దాల్చిన చెక్క - ఒక అంగుళం ముక్క
మిరియాలు - నాలుగు
ఎండుమిర్చి - మూడు
బిర్యానీ ఆకు - ఒకటి
వెల్లుల్లి తరుగు - ఒకటిన్నర స్పూను
కసూరి మేతి - ఒక స్పూను
గ్రీన్ చట్నీ - అరకప్పు
తయారీ ఇలా
1. మటన్ ముక్కలను మొదట గోరువెచ్చని నీటితో శుభ్రం చేయాలి. తరువాత మళ్లీ సాధారణ నీటితో కడిగి పక్కన పెట్టుకోవాలి.
2. ఇప్పుడు ఒక గిన్నెలో మటన్ ముక్కలు, పసుపు, పెరుగు, ఉప్పు, గ్రీన్ చట్నీ వేసి బాగా కలపాలి. 20 నిమిషాల పాటు మ్యారినేట్ చేయాలి.
3. ప్రెషర్ కుక్కర్‌ను స్టవ్ మీద పెట్టి నూనె వేసి వేడెక్కాక ఉల్లిపాయల తరుగు వేసి వేయించాలి. అవి బ్రౌన్ రంగులోకి మారాక, ముందుగా మ్యారినేట్ చేసుకున్న మటన్ ముక్కలను జోడించాలి.
4. వీటిని బాగా కలిపాక ఒక కప్పు నీళ్లు పోసి మూత పెట్టి ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి.
5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి అందులో బిర్యాని ఆకు, మిగతా మసాలా దినుసులు వేసి వేయించాలి.
6. కాసేపు వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
7. తర్వాత ఎండు కొబ్బరి పొడిని వేసి వేయించాలి. వీటన్నింటిని మిక్సీలో వేసి మెత్తటి పేస్టులా మార్చుకోవాలి.
8. ఇప్పుడు మరో కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. వేడెక్కిన నూనెలో తరిగిన ఉల్లి వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి.
9. రెండు నిమిషాలు తరువాత ఉడికించిన మటన్ ముక్కలను వేసి బాగా కలపాలి. మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వాటిని ఉడికించాలి.
10. తర్వాత మిక్సీలో పేస్టులా చేసుకున్న మసాలా ముద్దను, గ్రీన్ చట్నీలో అందులో వేసి మటన్ ముక్కలను బాగా కలపాలి.
11. కసూరి మేతి, చింతపండు రసం కూడా వేసి బాగా కలపాలి.
12. ఇలా చిన్న మంట మీద అరగంట పాటు ఉడికిస్తే బ్లాక్ మటన్ కర్రీ రెడీ అవుతుంది. పైన పుదీనా ఆకులు చల్లుకుంటే సువాసన అదిరిపోతుంది.
మటన్ మితంగా తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అతిగా తింటే మాత్రం అనారోగ్యాలు తప్పవు. మటన్లో బి1, బి2, బి3, బి9, బి12, విటమిన్ E, విటమిన్ K ఉంటాయి. మటన్ తినడం వల్ల ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరుగుతుంది. గర్భిణులు మటన్ తినడం చాలా ముఖ్యం. పుట్టబోయే బిడ్డలకు నాడీ సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. మటన్ లో కాల్షియం అధికంగా ఉంటుంది. కాబట్టి ఎముకలు, దంతాలు గట్టిగా మారతాయి. ఇందులో ఉండే సెలీనియం, కొలీనియం వంటివి క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటాయి.
Also read: రోగాలు రాకుండా ఉండాలంటే పండ్లు, కూరగాయలను ఇలా శుభ్రం చేయాలి