వేసవిలో మండే ఎండల్లో ఇంటికి రాగానే చల్లని పానీయాన్ని తాగాలనిపిస్తుంది. ఎండల్లో తిరగడం వల్ల చెమట ద్వారా సోడియం బయటకు పోతుంది. దీనివల్ల డిహైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లోకి రాగానే చక్కెర, ఉప్పు కలిపిన నిమ్మరసాన్ని తాగడం వల్ల చాలా ఉపయోగం ఉంది. అయితే నిమ్మకాయ కోసి, పిండి, నీళ్లలో కలిపి, పంచదార, ఉప్పు కలిపి ఈ రసాన్ని తయారు చేస్తారు.  రోజు నిమ్మకాయ కోయాల్సిన అవసరం లేకుండా నిమ్మ పొడిని తయారు చేసుకుంటే సరి. తాగాలనిపించినప్పుడు గ్లాసు నీటిలో రెండు చెంచాల పొడి కలుపుకుని తాగితే తాజా నిమ్మరసం తాగిన ఫీలింగ్ వస్తుంది. ఇలా చేయడం వల్ల పని కూడా సులభతరం అవుతుంది. ఇనిస్టెంట్ నిమ్మరసం కోసం నిమ్మ పొడిని ఎలా తయారు చేయాలో చూద్దాం.


1. ముందుగా నిమ్మకాయలను కోసి రసం తీసి పెట్టుకోవాలి.
2. మిక్సీలో పంచదార వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. 
3. పెద్ద ట్రే పై ఈ పంచదార పొడిని కాస్త ఉప్పును, నిమ్మ రసాన్ని చల్లుకొని, ఆ మిశ్రమాన్ని చేతులతో బాగా కలపాలి.
4.  ఆ ట్రేపై ఒకే చోట కుప్పలా కాకుండా ఈ పొడిని ఎండబెట్టడానికి వీలుగా ట్రే అంతా విస్తరించేలా చేయాలి.
5.  దీన్ని ఎండలో నాలుగైదు రోజులు ఎండబెట్టాలి. దుమ్ము ధూళి పడకుండా పైన ఏదైనా కవర్ చేయడం మంచిది. 
6. నాలుగైదు రోజుల్లో అది పొడిలా మారిపోతుంది. దీన్ని గాలి చొరబడని డబ్బాలో వేసి ఉంచుకోవాలి. 
7. ఇది మూడు నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుంది. 


ఎండలో నుంచి ఇంటికి వచ్చాక చల్లని నీళ్లలో ఈ పొడిని వేసుకుని తాగితే డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు.  


నిమ్మరసం తాగితే...
నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుందని అందరికీ తెలుసు. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. శరీరంలోని కణాలను నాశనం చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి ఇది మనల్ని కాపాడుతుంది. అజీర్తితో బాధపడే వారికి కూడా నిమ్మరసం ఎంతో మేలు చేస్తుంది. మీ శరీరం పోషకాలను శోషించుకునేలా చేస్తుంది. పేగు కదలికలను మెరుగుపరిచి కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. నిమ్మరసం తాగడం వల్ల ముఖంపై మొటిమలు వచ్చే అవకాశం తగ్గుతుంది. కాఫీ, టీలు తాగే బదులుగా నిమ్మరసం తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతోంది.  రోజును పరగడుపున గ్లాసు నిమ్మరసంతో ప్రారంభించడం వల్ల  బరువు పెరిగే అవకాశం తగ్గుతుంది. బరువును తగ్గించడంలో ఇది నేచురల్ రెమెడీగా పనిచేస్తుంది. వికారం, వాంతులు వంటి సమస్యలను కూడా తగ్గించడానికి నిమ్మరసం సాయం చేస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనల్ని హానికారక వైరస్‌ల నుంచి కాపాడుతాయి. ముఖంపై ముడతలు, గీతలు వంటివి త్వరగా రాకుండా ఉండాలన్న రోజూ నిమ్మరసం తాగాలి.


Also read: నిద్రపోయే వేళ అలా చేస్తే గర్భిణీలలో మధుమేహం వచ్చే ప్రమాదం