Biggest Diabetes Myth : ఈ మధ్యకాలంలో దాదాపు ప్రతి ఇంట్లోనూ డయాబెటిస్‌కు భయపడి స్వీట్స్ మానేస్తున్నారు. లేదా ఎవరైనా తింటుంటే తక్కువగా తినండి.. లేకుంటే మీకు మధుమేహం వస్తుంది అనే వార్నింగ్ ఇస్తున్నారు. దీంతో చాలామంది స్వీట్స్, షుగర్ డ్రింక్స్ మానేస్తున్నారు. ఓ రకంగా ఇది మంచి విషయమే. కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే.. స్వీట్స్ మానేస్తున్నాను కాబట్టి నాకు షుగర్ రాదు అనే భావనలో ఉంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? నిపుణులు ఏమంటున్నారు?
స్వీట్స్ మానేస్తే మధుమేహం రాదా?
మధుమేహం కేవలం స్వీట్స్ తినడం వల్ల మాత్రమే వస్తుందా? లేద దాని వెనుక మరేదైనా ఇతర కారణం ఉందా? అనే ప్రశ్నకు నిపుణులు ఇలా ఆన్సర్ ఇస్తున్నారు. శరీరంలో ఇన్సులిన్ అనే హార్మోన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల మధుమేహం వస్తుంది. ఇది బాడీలో గ్లూకోజ్‌ను నియంత్రించలేనప్పుడు.. శరీరం గ్లూకోజ్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేనప్పుడు.. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి.. మధుమేహానికి దారితీస్తాయి.
కేవలం స్వీట్స్ తినడం వల్ల మాత్రమే మధుమేహం రాదు. కొనీ చెడు ఆహారపు అలవాట్లు, సరైన జీవనశైలి లేకపోవడం వల్ల డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది. అందుకే స్వీట్స్ మానేసిన వారిలో కూడా షుగర్ కంప్లైంట్స్ వస్తాయని నిపుణులు అంటున్నారు. పైగా మధుమేహంలో ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. అవి ఇన్సులిన్‌ను వివిధ రకాలుగా ప్రభావితం చేస్తాయి.
మధుమేహం రకాలు..
టైప్ 1 మధుమేహంలో.. శరీర రోగనిరోధక వ్యవస్థ పొరపాటున ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను దెబ్బతీస్తుంది. టైప్ 2 మధుమేహంలో.. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేదు లేదా ఇన్సులిన్ ప్రభావం తగ్గిపోతుంది. ఈ రెండింటికీ స్వీట్స్‌తో ప్రత్యక్ష సంబంధం ఉండదు. కానీ సరైన జీవనశైలి లేకపోవడం వల్ల ఇవి మరింత ఎక్కువ కావచ్చు.
మధుమేహానికి అసలు కారణాలు..
నిపుణుల ప్రకారం స్వీట్స్ నేరుగా మధుమేహానికి కారణం కాదు. కానీ ఒక వ్యక్తి ప్రతిరోజూ ఎక్కువగా స్వీట్స్ తింటూ.. కూల్ డ్రింక్స్ తాగుతూ.. ఫాస్ట్ ఫుడ్ తీసుకుంటే.. అది బరువు పెరగడానికి దారితీస్తుంది. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు తరచుగా పెరుగుతాయి. దీనివల్ల ఇన్సులిన్‌పై ఒత్తిడి పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో మధుమేహం వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది.
అలాగే ఫ్యామిలీలో ఎవరికైనా మధుమేహం ఉన్నా.. అధిక ఒత్తిడి, ఆందోళన.. శారీరక శ్రమ తక్కువగా ఉన్నవారిలో కూడా మధుమేహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది కేవలం ఆహార సంబంధిత రోగం కాదు.. శారీరక, మానిసక సమస్యల వల్ల ఎటాక్ చేస్తుందని గుర్తించుకోవాలి.
షుగర్ ప్రారంభ లక్షణాలు..
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే.. తరచుగా మూత్రవిసర్జనకు వెళ్తారు. అధిక దాహం, అలసట, నీరసం, గాయాలు నెమ్మదిగా మానడం, అప్పుడప్పుడు తల తిరగడం వంటి కొన్ని లక్షణాలు కనిపించవచ్చు.
ఎలా కంట్రోల్ చేయవచ్చంటే..
మధుమేహాన్ని నివారించడానికి షుగర్స్ పూర్తిగా మానాల్సిన అవసరం లేదు. కానీ సమతుల్యత చాలా అవసరం. ప్రతిరోజూ తేలికపాటి వ్యాయామం లేదా యోగా చేయండి. రెగ్యులర్‌గా నడవండి. సమతుల్య ఆహారం తీసుకోండి. జంక్ ఫుడ్, శీతల పానీయాలను పరిమితం చేయండి. బరువును అదుపులో ఉంచుకోండి. ఒత్తిడిని తగ్గించుకుని బాగా నిద్రపోండి. ఇవన్నీ మధుమేహం రాకుండా ఉండేందుకు.. వచ్చినా అదుపులో ఉంచుకునేందుకు హెల్ప్ చేస్తాయి.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
