జీవితంలో ఉల్లాసం, ఉత్సాహంతో పాటు రంగులు నింపేందుకు వచ్చింది హోలీ పండుగ. ఆనందంలో పడి ఆరోగ్యం గురించి విస్మరించకూడదు. హోలీ రంగులు చర్మం, జుట్టు, కళ్ళపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే హోలీ ఆడాలి. బయట అమ్మే సింథటిక్ రంగులు కళ్లపై పడితే చాలా ప్రమాదకరం. కాబట్టి హోలీ ఆడేటప్పుడు కచ్చితంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇక్కడ ఇచ్చాము. 


సేంద్రియ మార్గం 
సింథటిక్ రంగులను రసాయనాల మేళవింపుతో తయారుచేస్తారు. కాబట్టి వాటిని వాడకపోవడమే మంచిది. వీలైనంతవరకు సేంద్రియ పద్ధతిలో తయారుచేసిన హెర్బల్ రంగులనే వాడాలి. వీటిని ప్రకృతిలో సహజంగా లభించే కూరగాయలు, ఆకుకూరలు, పువ్వులతో తయారుచేస్తారు. కాబట్టి పొరపాటున కళ్ళల్లో పడినా కూడా పెద్దగా హాని ఉండదు.


బెలూన్ ఫైట్ వద్దు
నీళ్లలో రంగులు కలిపి, ఆ నీళ్లను బెలూన్లలో నింపి బెలూన్ ఫైట్ ఆడేవాళ్లు ఎంతోమంది. హోలీ రోజునే ఈ బెలూన్ ఫైట్ కనిపిస్తుంది. అయితే బెలూన్లను విసిరినప్పుడు అవి ముఖానికి తగిలి, అందులో ఉన్న రంగు నీళ్లు కళ్ళల్లో పడే అవకాశం చాలా ఎక్కువ. ఇవి ఒక్కొక్కసారి కంటికి శాశ్వతంగా హాని కలిగిస్తాయి. కాబట్టి బెలూన్ ఫైట్‌లాంటివి ఆడక పోవడమే మంచిది. ఒకవేళ బెలూన్ ఫైట్ ఆడాలి అనుకుంటే కచ్చితంగా సేంద్రియ రంగులని వాడాలి.


కళ్లద్దాలు ధరించండి 
కళ్లకు రంగుల నుంచి ఎలాంటి ప్రమాదం ఉండకూడదు అనుకుంటే నల్ల కళ్ళద్దాలనుకొని హోలీ రోజున వాటిని పెట్టుకోండి. వీటిని ధరించడం వల్ల రంగులు ఏవి కళ్ళల్లో పడే అవకాశం ఉండదు. జీరో పవర్ గ్లాసెస్, ప్రొటెక్టివ్ గ్లాసులు కూడా మార్కెట్లో దొరుకుతాయి. వాటిని కొని ధరించుకోవచ్చు.


కళ్ళ చుట్టూ క్రీమ్
 హోలీ ఆడే ముందు కళ్ల చుట్టూ కోల్డ్ క్రీమ్ లేదా కొబ్బరి నూనెను మందంగా పూయాలి. ఇది రంగులు కంటి చుట్టూ అంటుకునే ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అంతేకాదు కంటి చుట్టూ రంగులు పడినా కూడా వాటిని సులభంగా తొలగిపోయేలా చేస్తాయి.


కొన్ని రంగుల్లో చెమ్కీలు కూడా కలుపుతారు. ఈ చెమ్కీలు చాలా మందంగా ఉంటాయి. ఆ చెమ్కీలతో కూడిన రంగులు చల్లుకోవడం వల్ల అవి కళ్ళల్లో పెడితే తీవ్రమైన నొప్పికి కారణం అవుతాయి. డ్యామేజ్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి అలాంటి చెమ్కీలను రంగుల్లో కలపకూడదు. 


ఇలా చేయండి
అనుకోకుండా రంగులు కళ్ళల్లో పడితే వెంటనే చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. స్టెరైల్ సెలైన్ ద్రావణంతో కళ్ళను మెల్లగా కడిగినా కూడా రంగులు పోతాయి. వెంటనే కంటి వైద్యుల్ని సంప్రదించడం చాలా ముఖ్యం.  కళ్ళలో దురద మొదలైనా కూడా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదిస్తే మంచిది. కొన్నిసార్లు కళ్ళల్లో రంగు పడిన విషయాన్ని తేలిగ్గా తీసుకుంటే చివరకు చికాకు, వాపు, అలెర్జీలు ఇలా సమస్య పెరుగుకుంటూ వచ్చి కంటి చూపు కోల్పోయే పరిస్థితి వస్తుంది.


Also read: వేసవి ఆహారంలో ఈ ఐదు ఆకుపచ్చ పండ్లు చేర్చండి, చక్కటి ఆరోగ్యం మీ సొంతం














గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.