వైద్యులు, పోషకాహార నిపుణులు ఎల్లప్పుడూ ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లను తినమని సిఫారసు చేస్తూనే ఉంటారు. కానీ వాటిని పాటించేవారు తక్కువగానే ఉంటారు. అయితే మండే వేసవిలో మాత్రం కచ్చితంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే తాజా ఆకుకూరలు, పండ్ల మీద ఆధారపడాలి. ముఖ్యంగా ఐదు రకాల ఆకుపచ్చని పండ్లు కచ్చితంగా తినమని చెబుతున్నారు. ఆహార నిపుణులు ఈ ఆకుపచ్చని కూరగాయలు, పండ్లలో క్లోరోఫిల్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడుతుంది. అంతేకాదు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగు పరచడంలో కూడా సాయం చేస్తుంది. అధిక రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి ఈ ఆకుపచ్చ పండ్లు కూరగాయలు సాయపడతాయి. యూనివర్సిటీ ఆఫ్ వార్మిక్ చెందిన ప్రొఫెసర్ వోస్వాల్డ్ ఒక పరిశోధనను నిర్వహించారు. ఆ పరిశోధనా వివరాలను ప్రపంచానికి తెలియజేశారు. అందులో ఆకుపచ్చని పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని. అలాగే సంతోషం కూడా అధికమవుతుందని చెప్పారు. కచ్చితంగా తినాల్సిన ఐదు ఆకుపచ్చ పండ్లు ఇవే.


గ్రీన్ ఆపిల్స్ 
రెడ్ ఆపిల్స్ తరచూ తింటూనే ఉంటారు. ఈ వేసవిలో గ్రీన్ యాపిల్స్ తినడం అలవాటు చేసుకోండి. దీనిలో ఐరన్, కాల్షియం, విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సాయపడుతుంది. ఈ గ్రీన్ యాపిల్లో క్వెర్సెటిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎముకలు బలహీనంగా ఉన్నవారు తప్పనిసరిగా గ్రీన్ యాపిల్స్ తమ మెనూలో చేర్చుకోవాలి. అలాగే అధిక బరువును తగ్గించే ఫైబర్ కూడా దీనిలో అధికంగా ఉంటుంది. 


జామ పండు 
జామలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఈ జామలో ఉండే మెగ్నీషియం ఒత్తిడిని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. ఈ పండులో ఫైబర్ అధికం. ఆ ఫైబర్ పేగు ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. మధుమేహం ఉన్నవారు జామ పండును కచ్చితంగా తినాలి. ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించే శక్తి జామకు అధికం. కంటి ఆరోగ్యానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. ఈ పండులో విటమిన్ ఏ, సి, ఫోలేట్, జింక్, కాపర్ వంటి పోషకాలు ఉన్నాయి.


ఉసిరి
ఉసిరి విటమిన్ సికి నెలవు. ఆ విటమిన్‌తో పాటు విటమిన్ AB కాంప్లెక్స్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, డైయూరిటిక్ యాసిడ్ వంటి పోషకాలు నిండుగా ఉంటాయి. అలాగే ఇందులో ఉండే క్రోమియం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఈ చిన్న తీయగా పుల్లగా ఉండే పండు రోగ నిరోధక శక్తిని బలపరుస్తుంది. జీర్ణక్రియను సక్రమంగా సాగేలా
చేస్తుంది.


ద్రాక్ష 
అద్భుతమైన పండ్లలో ద్రాక్ష కూడా ఒకటి. పొటాషియం, కాల్షియంతో పాటు విటమిన్ A, C, B సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ కలిసి మీ ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఇందులో ఉండే ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ద్రాక్ష తినడం వల్ల క్షణాల్లో శక్తి లభిస్తుంది. అలసట తీరిపోతుంది. ఎవరైతే రోజు ద్రాక్ష తింటారో వారు అధిక బీపీ, మలబద్దకం వంటి సమస్యల బారిన తక్కువగా పడతారు.


కివి 
సూపర్ మార్కెట్లలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. కివి పళ్ళు వీటిలో విటమిన్ E, C , ఫోలేట్, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ హైపర్టెన్సి లక్షణాలు అధికం. రక్తంలో ప్లేటులెట్లు పెంచే గుణం కివిలో ఉంది. గర్భిణీ స్త్రీలు కచ్చితంగా తినాల్సిన పండ్లలో కివి కూడా ఒకటి. దీని గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తింటే మంచిది.


Also read: రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవాలా? అయితే రాత్రి పడుకునే ముందు ఈ నాలుగు పనులు చేయండి












గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.