రక్తంలో అధిక చక్కెర లేదా గ్లూకోజ్ ఉండటాన్నే మధుమేహం అంటారు. ఇది ప్రాణాంతక సమస్యలకు దారి తీసే ఒక సైలెంట్ కిల్లర్. ఒకసారి మధుమేహం బారిన పడితే దాని నుంచి పూర్తిగా బయటపడడం అసాధ్యం. కానీ అదుపులో ఉంచుకొని సాధారణ జీవితం గడపవచ్చు. ఆధునిక జీవితంలో ఉన్న ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, కుటుంబ చరిత్ర వంటి కారణాలవల్ల ఎక్కువ మంది మధుమేహం బారిన పడుతున్నారు. రక్తంలో అసాధారణమైన చక్కెర నిల్వలు ఈ మధుమేహానికి కారణం అవుతున్నాయి. డయాబెటిస్ ఒంట్లో చేరితే శరీరంలోని ప్రతి అవయవాన్ని ప్రభావితం చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోపోతే శరీరంలోని ప్రధాన అవయవాలకు తీవ్ర సమస్యలు వస్తాయి.


కొంతమంది ప్రీ డయాబెటిస్ స్టేజీలోనే ఆ రోగాన్ని గుర్తిస్తారు. అలాంటివారు రోజూ మందులు వాడాల్సిన అవసరం లేకుండానే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా డయాబెటిస్ రాకుండా అడ్డుకోవచ్చు రోజువారి జీవనంలో చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోవాలి. అధికంగా చక్కెర ఉండే ఆహారాలను, మైదాతో చేసిన ఆహారాలను వదిలివేయాలి. కనీసం రోజుకి అరగంట వేగంగా నడవాలి. కూల్ డ్రింకులు, జంక్ ఫుడ్ వంటి వాటికి దూరంగా ఉండాలి. మధుమేహం వచ్చిందంటే మూత్రపిండాలు, నరాలు, గుండెకు నష్టం కలిగే అవకాశం ఉంది. డయాబెటిస్ వచ్చినవారు, ప్రీ డయాబెటిస్ స్టేజ్‌లో ఉన్నవారు, డయాబెటిస్ రాకుండా జాగ్రత్త పడాలి అనుకునే వారు... చేయాల్సిన పనులు నాలుగు ఉన్నాయి. ప్రతిరోజు రాత్రి నిద్ర పోవడానికి ముందు ఈ నాలుగు పనులు అలవాటు చేసుకుంటే భవిష్యత్తులో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం తగ్గుతుంది. 


1. రాత్రి నిద్రపోయే ముందు చమోమిలే టీ ఒక కప్పు తాగాలి. దీన్ని చామంతి పూలతో తయారుచేస్తారు. మార్కెట్లో ఈ టీ పొడి అందుబాటులో ఉంటుంది. దీని రాత్రి తాగడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికం.


2. బాదం పప్పులను ఉదయం నానబెట్టి రాత్రి తినడం అలవాటు చేసుకోవాలి. వీటిలో మెగ్నీషియం, ట్రిప్టోఫోన్ అధికంగా ఉంటాయి. ఇవి నిద్రా నాణ్యతను పెంచుతాయి. రాత్రి ఆకలి వేయకుండా అడ్డుకుంటాయి. అలాగే రాత్రి సమయంలో ఏదైనా తినాలన్న కోరికలను కూడా తగ్గిస్తాయి. తద్వారా ఉదయం చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి.


3. ఒక స్పూను మెంతి గింజలను నీటిలో నానబెట్టి రాత్రి నిద్రపోయే ముందు వాటిని తినాలి. మెంతి గింజల్లో అద్భుతమైన హైపోగ్లైసిమిక్ గుణం ఉంది. ఇది శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.


4. నిద్రపోవడానికి పావుగంట ముందు వజ్రాసనంలో 15 నిమిషాలు కూర్చోవాలి. ఇది రక్తప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి. 


Also read: పిల్లల ప్రాణాలు తీస్తున్న అడెనో వైరస్, దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే











గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.