బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డకౌట్ అయితే ఆ బాధే వేరు. కనీసం అర్థ సెంచురీ చేసైనా పెవిలియన్‌కు వెళ్లాలని ప్రతి బ్యాట్స్‌మ్యాన్‌కు అనిపిస్తుంది. పడకగది విషయంలో కూడా అంతే.. మగాళ్లు మంచి స్కోర్ సాధించాలని అనుకుంటారు. అది సాధ్యం కానప్పుడు వయాగ్రాను నమ్ముకుంటారు. కానీ, అది అంత సేఫ్ కాదు. వయాగ్రాను అతిగా వాడితే.. మొదటికే ప్రమాదం రావచ్చు. సహజ సిద్ధమైన ఆట తీరుకు అది భంగం కలిగించవచ్చు.. లేదా మిమ్మల్ని రిటైర్ అయ్యేలా చేయొచ్చు. అందుకే, దానికి ప్రత్యామ్నాయాల కోసం పరిశోధకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఓ గ్యాడ్జెట్ పనితీరును పరిశీలించారు. అసలు విషయం తెలిశాక వారేవా అంటూ ఆ ఆసక్తికర విషయాలను బయటకు వెల్లడించారు. ఇంతకీ ఆ గ్యాడ్జెట్ ఏమిటో తెలుసా? 


రేడియో తరంగాలనే మందు


ఈ గ్యాడ్జెట్ గురించి మీరు ఇప్పటివరకు విని ఉండరు. కానీ, వింటూ కాస్త కొత్తగా ఆసక్తికరంగా ఉంటుంది. మీలో చాలామందికి రేడియోను వినే అలవాటు ఉండే ఉంటుంది. అయితే, మనం ఆ రేడియోకు సంబంధించిన తరంగాల గురించి పెద్దగా విని ఉండం. 1 మెగా‌హెర్ట్జ్ తరంగాలను విడుదల చేసే ఒక గ్యాడ్జెట్.. వయాగ్రా వంటి ఔషదాల అవసరం లేకుండా అంగస్తంభన లోపాన్ని దూరం చేస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.


రెండు నెలల్లోనే సత్ఫలితాలు


ఈ టెక్నిక్‌ను ప్రస్తుతం సెల్యులైట్, యాంటీ వ్రింక్లే ట్రీట్‌మెంట్‌గా ఉపయోగిస్తున్నారు. ఇది కొల్లాజెన్‌ను ఇంప్రూవ్ చేసి రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఇజ్రాయెల్‌‌‌లోని  హైఫాలో గల రామ్‌బామ్ హాస్పిటల్‌లో రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ ట్రీట్మెంట్ పొందిన 28 మందిలో 14 మందిలో ఊహించని మార్పు చూశారట. సుమారు రెండు నెలల తర్వాత వారిలో అంగస్తంభన సమస్యలన్నీ తొలగిపోయాయట. మిగతా 14 మందిలో 11 మందిలో అంగం పనితీరు గణనీయంగా మెరుగుపడిందట. ముగ్గురిలో మాత్రమే ఎలాంటి మార్పు కనిపించలేదట.


ఇలా పనిచేస్తుందట


ఈ సరికొత్త టెక్నిక్‌ గురించి ఇటీవల డాక్టర్ ఇలాన్ గ్రూయెన్‌వాల్డ్.. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఇంపోటెన్స్ రీసెర్చ్‌లో ప్రస్తావించారు. ‘‘అంగస్తంభన సమస్యలను పరిష్కరించడంలో రేడియో ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. దాన్ని చాలా సేఫ్‌గా, సులభంగా ఉపయోగించవచ్చు’’ అని పేర్కొన్నారు. రేడియో తరంగాలను తక్కువ పౌనఃపున్యాలు (ఫ్రీక్వెన్సీ) వద్ద వర్తించినప్పుడు.. అది శక్తిని పొందిన అణువులు, అయాన్ల మధ్య పరస్పర చర్యలకు కారణమవుతుంది. కణజాలంలో వేడిని సృష్టిస్తుంది. వేడెక్కిన కొత్త కొల్లాజెన్, ఎలాస్టిన్ ఫైబర్స్ ఫలితంగా నిర్మాణాత్మక మార్పులు జరుగుతాయి. అది అంగస్తంభన సమస్యలను దూరం చేయడానికి ఉపయోగపడతాయి’’ అని పేర్కొన్నారు.


అప్పట్లో.. ఎలక్ట్రిక్‌ షాక్‌వేవ్


గతంలో యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా జరిపిన అధ్యయనంలో కూడా కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఎలక్ట్రికల్ షాక్ వేవ్ థెరపీ వల్ల నిర్ధారిత భాగంలో రక్త ప్రసారణ మెరుగై.. అంగస్తంభన బాగా జరుగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో.. పురుషులు భవిష్యత్తులో అంగస్తంభన సమస్యల గురించి బెంగ పెట్టుకోవల్సిన అవసరం ఉండకపోవచ్చు. వయాగ్రాకు గుడ్‌బై చెప్పి.. సురక్షిత విధానాలతో సమస్యలకు పరిష్కారం పొందవచ్చు. సెంచురీలు చేసి.. పార్టనర్‌ను మెప్పించవచ్చు. ప్రస్తుతం ఈ గ్యాడ్జెట్ ప్రయోగదశలోనే ఉంది. దీన్ని వైద్యుల పర్యవేక్షణలోనే ఉపయోగించాలి. కాబట్టి, కేవలం డాక్టర్స్‌ మాత్రమే వీటిని ఉపయోగించే అవకాశం ఉంది.


Also Read: సెక్స్​ లైఫ్​‌‌పై మధుమేహం ప్రభావం.. మగవారికి ఆ సమస్యలు వచ్చే ఆస్కారం


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.