మధుమేహం వల్ల శరీరంపై అనేక దుష్ప్రభావాలు ఉంటాయి. తల నుంచి కాలివరకు దీని ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా సెక్స్​ లైఫ్​పైన కూడా దీని ప్రభావం ఉంటుంది అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇది ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి మధుమేహం రాకుండా అయినా జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చేసిందంటే మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. 


రక్తంలో గ్లూకోజ్​ను నియంత్రించే ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి లేకపోవడం వల్ల వస్తుంది. కొన్నిసార్లు జన్యుపరమైన, పర్యావరణ కారకాల వల్ల కూడా వస్తుంది. కాబట్టి మెరుగైన జీవనశైలి అలవాట్లతో మధుమేహనికి దూరంగా ఉండొచ్చు. గుండెజబ్బులు, రక్తపోటుపై ఏవిధంగా శ్రద్ధ చూపిస్తామో.. మధుమేహం విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు వైద్యులు. కొన్ని సందర్భాల్లో అంతకంటే ఎక్కువ శ్రద్ధ చూపించాల్సి ఉంటుంది.  


సెక్స్​ లైఫ్​పై ప్రభావం..


చాలామందికి తెలియని విషయం ఏంటంటే మధుమేహం అనేది లైంగిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని. అవును అండీ మధుమేహం వల్ల కలిగే దుష్ప్రభావాల్లో ఇది ముఖ్యమైనది. దీని గురించి ఎవరూ ఎక్కువగా చర్చించరు కాబట్టి.. అంతగా దీనిని పట్టించుకోరు. అయితే మధుమేహంతో ఇబ్బంది పడేవారికి సెక్స్ లైఫ్ దెబ్బతింటుందంటున్నారు నిపుణులు. పురుషులలో అంగస్తంభన, అకాల స్కలనం వంటి సమస్యలకు దారి తీస్తుందట. మహిళల లైంగిక ఆరోగ్యంపై కూడా దీని ప్రభావం ఉంటుందంటున్నారు. ఇదే కాకుండా మధుమేహం శరీరంలో అనేక అంశాలపై ప్రభావం చూపిస్తుంది. 


జుట్టు, చర్మంపై ప్రభావం


శరీరంలోని అధిక గ్లూకోజ్ స్థాయిలు జుట్టురాలిపోయే ప్రమాదాన్ని పెంచుతాయి. ఎందుకంటే ఇది రక్తప్రసరణను ప్రభావితం చేస్తుంది. ఇది హెయిర్ ఫోలికల్స్​ పనిచేయకుండా ప్రభావితం చేస్తుంది. అలాగే చర్మంపై కూడా మధుమేహం ప్రభావం ఉంటుంది. శరీరంలోని చక్కెర స్థాయిలు చర్మంపై మార్పులకు దారితీస్తాయి. మచ్చలు, బొబ్బలు, పింపుల్స్ వంటివి వచ్చే అవకాశముంటుంది. చర్మం పొడిబారడానికి, దురుదకు దారితీసే బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్​ఫెక్షన్ల ప్రమాదం కూడా పెరుగుతుంది. 


కంటి సమస్యలు 


మధుమేహం ఉన్నవారికి కంటిసమస్యలు ఎక్కువగా ఉంటాయి. కంటిశుక్లం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మధుమేహం దీర్ఘకాలికమైన వ్యాధులలో ఒకటి. ఇది డయోబెటిక్ మాక్యులర్ ఎడెమా, గ్లాకోమా వంటి కంటి సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. మరికొన్ని కేసుల్లో అంధత్వం కూడా వచ్చే ప్రమాదముంది. అందుకే మధుమేహంతో బాధపడేవారు ఎక్కువగా కంటికి పలు కారణాలవల్ల ఆపరేషన్లు చేయించుకుంటూ ఉంటారు. 


నోటి సమస్యలు


మధుమేహ రోగులకు నోటిలో ఫంగల్, బాక్టీరియాల్ ఇన్ఫెక్షన్లకు ఎక్కువగా గురవుతారు. లాలాజల ప్రవాహ రేటు తగ్గడం, దాని యాంటీమైక్రోబయల్ ప్రభావాలు లేకపోవడమే దీనికి కారణం. దీనివల్ల గొంతులో మంట, తినడంలో ఇబ్బంది కలుగుతాయి.


మొత్తం ఆరోగ్యానికి రోగనిరోధక శక్తి చాలా అవసరం. అయితే షుగర్​తో ఇబ్బందిపడుతున్నప్పుడు రోగనిరోధక వ్యవస్థ తెల్ల రక్తకణాలపై అదనపు ఒత్తిడి కలిగిస్తుంది. దీనివల్ల న్యూమోనియా, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశముంది. గుండెపోటు, మూత్రపిండాల్లో ఇబ్బందులు వంటి సమస్యలు రావొచ్చు. బోలు వ్యాధి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహం విషయంలో అస్సలు అజాగ్రత్తగా ఉండొద్దు అంటున్నారు వైద్యులు. 


Also Read : ఈ సింపుల్ స్ట్రెచ్స్​ మీ నడుము నొప్పిని దూరం చేసేస్తాయి