చపాతీతో జోడీగా ఎక్కువ మంది ఇష్టపడేది పాలక్ పన్నీర్ కర్రీ లేదా పన్నీర్ బటర్ మసాలా. ఈ రెండే కాదు పన్నీర్ తో చేసే పుదీనా పన్నీర్ కర్రీ కూడా అదిరిపోతుంది. పరోటా, చపాతీ, రోటీలకు ఇది సూపర్ జోడి. దీన్ని కూడా చేయడం చాలా సులువు. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కర్రీ తినాలనిపిస్తుంది. దీని ఫ్లేవర్‌కు మెదడు కూడా రిఫ్రెష్ మెంట్‌ను ఇస్తుంది. కాబట్టి మిగతా కూరలతో పోలిస్తే పుదీనా పన్నీర్ కర్రీ తింటేనే మేలు.  పిల్లలకు కూడా ఇది బాగా నచ్చుతుంది. ఒక్కసారి దీన్ని ఇలా చేసి చూడండి. దీనికి అభిమానులు అయిపోవడం ఖాయం.


కావాల్సిన పదార్థాలు
పనీర్ - 200 గ్రాములు 
ఉల్లిపాయ - ఒకటి 
టమోటోలు - రెండు 
పుదీనా ఆకులు - ఒక కట్ట 
నూనె - సరిపడినంత 
పసుపు - పావు స్పూను 
కారం - ఒక స్పూను 
గరంమసాలా - అర స్పూను


తయారీ ఇలా
ముందుగా పుదీనా ఆకులను ఏరి చిన్నగా తరిగి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి బ్రౌన్ రంగులోకి వచ్చేవరకు వేయించాలి. అందులో పసుపు, కారం, ఉప్పు కూడా వేసి కలపాలి. టమోటోలను ప్యూరీగా మార్చి, ఆ ప్యూరీని కూడా కళాయిలోని మిశ్రమంలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు పనీర్‌ను కూడా వేసి కలపాలి. మీకు కావాలనుకుంటే ముందుగా పనీర్ ముక్కలను వేయించి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు సన్నగా తరిగిన పుదీనా ఆకులను కూడా వేసి కలపాలి. పైన గరం మసాలా చల్లాలి. మూత పెట్టి ఉడికించాలి. చిన్న మంట మీద ఉడికిస్తే ఈ కర్రీ చక్కగా ఉడుకుతుంది. పుదీనా ఆకులు, టమోటోలు అన్నీ బాగా మిక్స్ అయ్యి... మెత్తగా ఇగురులా మారేవరకు ఉడికించాలి. నూనె పైకి తేలింది అంటే పుదీనా కర్రీ రెడీ అయినట్టే. ఇది నాన్, రోటి, లచ్చా పరాటా ఇలా దేనితో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. 


పుదీనా తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో లాభం. దీనిలో మ శరీరానికి అవసరమైన ఎన్నో పోషకాలు ఉన్నాయి. శారీరక ఆరోగ్యంతో పాటూ మానసిక ఆరోగ్యాన్ని పుదీనా కాపాడుతుంది. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6 వంటి విటమిన్లతో పాటూ మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, క్యాల్షియం, ఫైబర్, ప్రొటీన్ వంటి పోషకాలు దీనిలో ఉంటాయి. డయాబెటిక్ రోగులకు పుదీనా ఎంతో మేలు చేస్తుంది. పుదీనా తినడం వల్ల రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటాయి. పొట్ట నొప్పి తగ్గడానికి, జీర్ణ కోశ వ్యాధులు తగ్గడానికి పుదీనా ఎంతో మేలు చేస్తుంది. అంటే పొట్టలోని సమస్యలను ఇది త్వరగా తగ్గిస్తుంది. 


Also read: బొప్పాయి ఆకులు రక్తంలోని ప్లేట్స్‌లెట్స్ సంఖ్యను ఎలా పెంచుతాయి?


Also read: వారిద్దరి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నా, ఆయనతో కలిసి ఉండలేకపోతున్నా























































































































































































గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.