బరువు తగ్గడం కోసం ఒక్కొక్కరు ఒక్కో రకమైన డైట్ ప్లాన్ ఫాలో అవుతూ ఉంటారు. తిండి తగ్గించి బరువు తగ్గే ప్లాన్ చేస్తున్నామని మరి కొందరు చెప్తారు. నిజానికి ఆహారం తీసుకుని ఆరోగ్యకరంగా బరువు తగ్గవచ్చని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. తక్కువ కార్బ్ ఆహారాలు తీసుకుని బరువు తగ్గాలని అనుకుంటారు. కానీ దానికి బదులుగా ప్రోటీన్లు తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇది బరువుని తగ్గించడంలో మరింత సమర్థవంతంగా సహాయపడుతుంది.
ప్రోటీన్లు, పిండి పదార్థాలు ఎలా పని చేస్తాయి?
చేపలు, మాంసం, పాల ఉత్పత్తులు, నట్స్, తృణధాన్యాల్లో ప్రోటీన్లు సమృద్ధిగా లభిస్తాయి. అవి కండరాలు, ఎముకలని బలోపేతం చేయడానికి, హార్మోన్లు నియంత్రించడానికి సహాయపడతాయి. అంతే కాదు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇక బ్రెడ్, బీన్స్, మొక్క జొన్న వంటి కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి. మెదడు చురుకుగా ఉండేందుకు, శరీర దారుఢ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి.
హెల్త్ లైన్ ప్రకారం మెదడు, ఏకాగ్రతని కాపాడేందుకు పిండి పదార్థాలు చాలా అవసరం. ఆటలు ఆడుతూ అధిక శారీరక శ్రమ చేసే వారికి శక్తి తిరిగి పుంజుకోవడానికి కార్బోహైడ్రేట్లు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అయితే బరువు తగ్గే విషయంలో మాత్రం కార్బోహైడ్రేట్లు కంటే ప్రోటీన్లు మంచివని సూచిస్తున్నారు.
ప్రోటీన్లు తీసుకోవడం వల్ల లాభాలు
⦿ పిండి పదార్థాల కంటే ప్రోటీన్లు ఎక్కువ కేలరీలని బర్న్ చేస్తాయి. ఇవి పొట్టని ఎక్కువ సేపు నిండుగా ఉండేలా చేస్తాయి. జంక్ ఫుడ్ కోరికలు తగ్గిస్తాయి.
⦿ ఆకలిని నియంత్రించడంలో సహాయపడతాయి.
⦿ మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచేందుకు ప్రోటీన్లు సహకరిస్తాయి
⦿ అధిక ప్రోటీన్లు కలిగిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వుని కరిగించేందుకు దోహదపడుతుందని బీబీసీ హెల్త్ సూచిస్తుంది.
ప్రోటీన్లు అధికంగా తీసుకోవడం వల్ల నష్టాలు
అనేక ఫ్యాడ్ డైట్ మాదిరిగానే ఆహారంలో ప్రోటీన్లు పెంచి పిండి పదార్థాలని పరిమితం చేయడం వల్ల ప్రతికూలతలు ఉన్నాయి. రోజువారీ ఆహారంలో అధిక మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం వల్ల మూత్రపిండాల సమస్యలకి దారితీయవచ్చు. ఇది సుదీర్ఘకాలంలో ప్రాణాంతకం కావొచ్చు.
పిండి పదార్థాలు ఫైబర్ ని అందిస్తాయి. కాబట్టి ఎక్కువ కాలం పాటు తక్కువ ఫైబర్ ఆహారాలు తీసుకుంటే పేగుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. పెద్ద పేగు వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. అందుకే ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు సమంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి.
ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
కొవ్వు, ఫైబర్, ప్రోటీన్లు మిశ్రమంగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ప్రోటీన్ ఎక్కువసేపు పొట్ట నిండుగా ఉంచుతుంది. అలాగే కొవ్వు ఎప్పుడు తినడం మానేయాలి అని మీకు చెప్పడానికి హార్మోన్లతో కలిసి పని చేస్తుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలకి దూరంగా ఉండాలి. ఇవి జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. అంతే కాదు రక్తంలో చక్కెర స్థాయిలని పెంచుతాయి. ప్రోటీన్స్ కోసం చేపలు, గుడ్లు, బీన్స్, మాంసం, చిక్కుళ్ళు, నట్స్, టోఫు, కొవ్వు లేని పాల ఉత్పత్తులు తీసుకోవచ్చు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: బాగా అలసటగా ఉంటోందా? ఇందుకు కారణాలివే!