Ayushman Bharat Scheme in India : దేశంలోని ఆయుష్మాన్ భారత్ యోజన అతిపెద్ద ఆరోగ్య పథకం. జన ఆరోగ్య యోజన ప్రతి ఒక్క అవసరమైన వ్యక్తికి అందాలని.. ఉచిత వైద్యం దక్కాలనే లక్ష్యంతో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించారు. అయితే ఇప్పుడు దాని సేవలు ప్రజలకు దూరమవుతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే తాజాగా వెలువడిన గణాంకాలు ప్రకారం.. ఆయుష్మాన్ భారత్ యోజనపై ఉన్న విశ్వసనీయతను దూరం చేసేలా ఉన్నాయి. అలాగే ఫ్యూచర్లో దీనిని ఉపయోగించుకోవాలనే వారికి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. గతంలో ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ఆసుపత్రులు ఈ పథకంలో చేరేవి. కాని ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రులు ఈ పథకంపై ఆసక్తిని కోల్పోతున్నట్లు కనిపిస్తోంది.
2024–25లో తగ్గిన కొత్త ఆసుపత్రుల చేరిక
2024–25లో ఆయుష్మాన్ భారత్ యోజనలో కేవలం 2,113 ఆసుపత్రులు మాత్రమే చేరాయి. అదే 2023–24లో అయితే ఈ సంఖ్య 4,271.. దానికి ముందు సంవత్సరంలో 2022–23లో 3,124 ఆస్పత్రులు ఈ పథకంలో చేరాయి. అలా చూసుకుంటే ఈ పథకంలో ఈసారి చేరే ఆసుపత్రుల సంఖ్య స్పష్టంగా తగ్గినట్లు కనిపిస్తుంది. ఈ సమాచారాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రతాపరావు జాధవ్ అందించారు.
పథకంలో మొత్తం ఎన్ని ఆసుపత్రులు ఉన్నాయి?
దేశవ్యాప్తంగా ఆయుష్మాన్ భారత్ యోజనలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 31,466 ఆసుపత్రులు చేరాయి. వీటిలో 14,194 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి. అంటే పథకం పరిధి పెరిగింది.. కానీ కొత్త భాగస్వామ్యంలో తగ్గుదల ఉంది.
పథకంలో ఎన్ని చికిత్సలు ఉన్నాయి?
ఆయుష్మాన్ భారత్ పథకం కింద లభించే చికిత్సల ఆరోగ్య ప్రయోజనాల ప్యాకేజీని ఇప్పటికీ ఐదుసార్లు అప్‌డేట్ చేశారు. 2022లో వచ్చిన కొత్త ప్యాకేజీ HBP 2022, 27 వేర్వేరు ప్రత్యేకతలలో 1,961 రకాల వైద్య విధానాలను ఈ పథకం కవర్ చేస్తుంది.
ప్రైవేట్ ఆసుపత్రులు ఎందుకు వెనుకడుగు వేస్తున్నాయి?
ఈ పథకంలో ప్రైవేట్ ఆస్పత్రులు వెనకడుగు వేస్తున్నాయనేది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. దానిపై నిపుణులు, ప్రైవేట్ ఆసుపత్రుల ప్రకారం దానికి రెండు ప్రధాన సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది.
- క్లెయిమ్ చెల్లింపులో ఆలస్యం – నిబంధనల ప్రకారం.. రాష్ట్రాల లోపల ఉన్న రోగులకు 15 రోజుల్లో, ఇతర రాష్ట్రాల రోగులకు 30 రోజుల్లో చెల్లింపులు జరగాలి. కానీ వాస్తవానికి ఈ సమయ పరిమితి చాలాసార్లు దాటేస్తుంది. ముఖ్యంగా పెద్ద ఆసుపత్రులు, ఖరీదైన చికిత్సల విషయంలో ఇది జరుగుతుంది.
- ప్యాకేజీ రేటు – చికిత్సకు బదులుగా లభించే డబ్బు.. వ్యయం కంటే తక్కువగా ఉంటుందని చాలా ప్రైవేట్ ఆసుపత్రుల కంప్లైయింట్. దీనివల్ల వారికి ఆర్థిక నష్టం వాటిల్లుతుంది.
ఈ సమస్యల కారణంగా పథకాన్ని చౌకగా ఉంచాలని చాలామంది కోరుకుంటున్నారు. అలాగే ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా సమతుల్య ఆర్థిక ప్రయోజనాలు లభిస్తే ఈ ఆయుష్మాన్ భారత్ యోజన ప్రజలకు చేరుతుందని భావిస్తున్నారు. దీనివల్ల పథకం ఎక్కువ కాలం కొనసాగుతుంది కూడా. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ కల సాకారమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సమస్యలు పరిష్కారమైతే.. మరిన్ని వైద్య సేవలు ప్రజలకు ఉచితంగా లభించనున్నాయి అంటున్నారు నిపుణులు.