Aadujeevitham: మలయాళం స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తానేప్పుడు కొత్త కొత్త కథలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంటాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో సక్సెస్ ను ఆస్వాదిస్తూ మంచి ఫాంలో ఉన్నాడు. సినిమాకోసం.. అందులోని పాత్రకు తగ్గట్లు మారడం కోసం ఎంత కష్టమైన పడతాడు. ఈ మధ్యే వచ్చిన ‘సలార్’ మూవీలోనూ ప్రభాస్‌కు స్నేహితుడిగా నటించి అందరినీ మెప్పించాడు. 


తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఆడు జీవితం’ అనే సినిమా మార్చి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆరేళ్లుగా ఈ మూవీ షూటింగ్ జరిగింది. అయితే ఈ సినిమాకు సంబంధించి పలు ఇంటర్వ్యూలలో పృథ్వీరాజ్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను ఈ సినిమా కోసం ఏకంగా 31 కిలోల బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చాడు. ఎడారిలో దారి తప్పిన వ్యక్తిగా కనిపించేందుకు ముఖంలో అలాంటి ఎక్స్ ప్రెషన్స్ వచ్చేందుకు మూడు రోజుల పాటు ఆహారం తీసుకోలేదట. తర్వాత కొంచెం తిని మళ్లీ మూడు రోజుల పాటు ఫుడ్ తినకుండా ఉండేవాట. కేవలం నీళ్లు, బ్లాక్ కాఫీ మాత్రమే తీసుకునేవాడినని చెప్పాడు. ఇంతవరకు బాగానే ఉంది. కేవలం నెల రోజుల్లో 31 కిలోల బరువు తగ్గడం సాధ్యమేనా. కేవలం నీళ్లు, కాఫీ తాగుతూ ఒక వ్యక్తి నెలరోజుల పాటు ఉండగలడా? చాలా మందిలో ఇలాంటి అనుమాలెన్నో మొదలయ్యాయి. ఆరోగ్యకరంగా నెలరోజుల్లో 31 కిలోల బరువు తగ్గడం సాధ్యమా? కాదా?


పృథ్వీరాజ్ ట్రైనర్ అజిత్ బాబు తెలిపిన వివరాల ప్రకారం... ‘ఆడుజీవితం’ మూవీలో పృథ్వీరాజ్ పాత్రకు తగ్గట్లుగా తాను కనిపించడం కోసం తీసుకున్న కఠోర శిక్షణ ఎంతో సవాలుగా మారిందన్నారు. ఎందుకంటే ఈ సినిమాలో పృథ్వీరాజ్ సహజంగా కనిపించాలి. అందుకే తక్కువ క్యాలరీలు తీసుకుంటూ.. బరువు తగ్గే ప్రయత్నం చేసినట్లు చెప్పారు. ఆ సినిమాకు సంబంధించిన ప్రాజెక్టు పూర్తయిన తర్వాత.. కోలుకోవడం కూడా చాలా ముఖ్యం. షూటింగ్ పూర్తయిన తర్వాత నిపుణుల పర్యవేక్షణలోనే ఆహారం తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. 


నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక సాధారణ వ్యక్తికి ఆరోగ్యకరమైన బరువు తగ్గడం అంటే 0.5 కిలోల నుంచి 1 కిలో వరకు ఉంటుంది. నెలకు గరిష్టంగా 4 కిలోల నుంచి 8 కిలోల వరకు తగ్గవచ్చు. ఆరోగ్య పరిస్ధితులను పరిగణలోనికి తీసుకుని బరువు తగ్గించే విధానం ఆధారపడి ఉంటుంది. ఒక వేళ మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఆరోగ్య నిపుణుల సలహా మేరకు మాత్రమే డైట్ ఫాలో అవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు. 


వేగంగా బరువు తగ్గడం వల్ల కలిగే నష్టాలు:


వేగంగా బరువు తగ్గడమనేది ఎప్పుడూ కూడా మెరుగైన ఆరోగ్యాన్ని సూచించదన్న విషయాన్ని గుర్తించుకోవడం చాలా ముఖ్యం. నిపుణుల సలహాలు తీసుకోకుండా మీరు బరువు తగ్గుతుంటే అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కండరాలు దెబ్బతినడం, పిత్తాశయంలో రాళ్లు, ఎలక్ట్రోలైట్ అసమతుల్యత, జీవక్రియ మందగించడం, తక్కువ జీవక్రియ రేటు వంటి సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. అందం కోసం, నలుగురిలో ప్రత్యేకంగా కనిపించడం కోసం బరువు తగ్గాలనుకుంటే మీ జీవితాలను ప్రమాదంలోకి నెట్టెసినట్లే అవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 


Also Read: ఈ ఏడాది ఉగాది ఎప్పుడు - చైత్ర పాడ్యమి రోజే ఎందుకు జరుపుకుంటారు!