Rice Cooking Tips for Health : అన్నం ఇది మన ఆహారంలో ప్రధానమైన భాగం. కానీ మధుమేహం, అధిక బరువు వంటి సమస్యల దృష్ట్యా, దానిని ఎలా వండుకోవాలి అన్నదానిపై చాలా మందికి సందేహాలుంటాయి. నార్మల్‌గా గంజి వార్చి వండడమా, కుక్కర్‌లోనా, లేక ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్‌లోనా అన్నం వండడం ఆరోగ్యానికి మంచిదా? ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నం పరబ్రహ్మ స్వరూపమని చెప్తారు. కానీ ఆరోగ్య సమస్యల దృష్ట్యా చాలామంది అన్నం మానేయాలని సూచిస్తారు. ఎంత చెప్పినా అన్నం లేకుండా ఉండడం చాలామందికి కష్టంగా ఉంటుంది. అన్నం తినడం ఎలాగో తప్పదు అని తెలిసినప్పుడు దానిని ఎలా వండుకుంటే మీకు మంచిదని ఎప్పుడైనా ఆలోచించారా? ముఖ్యంగా మధుమేహం ఉండేవారు, బరువు తగ్గాలనుకునేవారు ఎలా వండుకోవాలంటే..

నార్మల్​గా వండుకుంటే.. 

లాభాలు :  గంజి వార్చి అన్నం వండుకోవడం ఓ రకంగా ఆరోగ్యానికి మేలు చేసే పద్ధతే. ఎందుకంటే మధుమేహంతో ఇబ్బంది పడేవారు, బరువు తగ్గాలనుకునేవారికి ఇది హెల్ప్ చేస్తుందని చెప్తున్నారు. అన్నంలోని అదనపు పిండి పదార్థం గంజిరూపంలో వెళ్లిపోతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు. ప్రెజర్ కుక్కర్ మాదిరి ఒత్తిడి ఉండదు కాబట్టి విటమిన్లు, పోషకాలు శరీరానికి అందుతాయి. 

నష్టాలు : అన్నం గంజి వార్చే పద్ధతిలో వండుకోవడం వల్ల కుక్కర్, రైస్ కుక్కర్ కంటే కాస్త ఎక్కువ సమయం తీసుకుంటుంది. అంతేకాకుండా ఇంధనం ఖర్చు కూడా ఉంటుంది. కొందరు వడకట్టకుండా బియ్యానికి తగ్గట్లు నీరు పోసి కుక్కర్ రైస్​లాగా వండుతారు. అలా వండుకుంటే దీనిలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. 

ప్రెజర్​ కుక్కర్​లో వండుకుంటే

లాభాలు : ప్రెజర్​ కుక్కర్​లో చాలామంది పప్పు, అన్నం కలిపి వేర్వేరు గిన్నెల్లో పెట్టుకుని వండేస్తారు. ఇలా చేయడం వల్ల వంట త్వరగా అవుతుంది. అలాగే ఇంధనం ఖర్చు తగ్గుతుంది. అన్నం మెత్తగా ఉడుకుతుంది. దీనివల్ల త్వరగా జీర్ణమవుతుంది. 

నష్టాలు : కుక్కర్​లో ప్రెజర్ కాస్త ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. అన్నంలోని విటమిన్ బి కాంప్లెక్స్ వంటి విటమిన్లు తగ్గుతాయి. అన్నంలో పిండి పదార్థం ఎక్కువగా ఉండిపోతుంది. 

ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్​లో వండుకుంటే.. 

లాభాలు : ఈజీగా అన్నం వడుకోవాలనుకునేవారికి, అన్నం వండడం రానివారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఎక్కువసేపు అన్నం వేడిగా ఉంటుంది. అలాగే మెత్తగా కూడా కుక్ అవ్వదు. 

నష్టాలు : ప్రెజర్ కుక్కర్ మాదిరిగానే దీనిలో కూడా అన్నంలో పిండిపదార్థం ఎక్కువగా మిగిలిపోతుంది. "warm" ఆప్షన్​లో ఎక్కువకాలం ఉంచితే అది ఎక్కువగా ఉడికిపోయే ప్రమాదముంది. 

మీరు బరువు తగ్గడం, మధుమేహాన్ని కంట్రోల్ చేయడం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నా.. అన్నం పూర్తిగా మానాల్సిన పని లేదు. ఎలా వండుకుంటున్నాము.. ఎలా తింటున్నామన్నదే మేటర్. మధుమేహం, బరువు తగ్గించుకోవాలనుకుంటే గంజి వార్చిన అన్నం తక్కువ పరిమాణంలో తీసుకోవాలి. లేదంటే పాలిష్ చేయని బియ్యం, బ్రౌన్ రైస్ వంటివి కూడా తీసుకోవచ్చు. ఆకలిని తీర్చుకునేందుకు ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉండే కూరగాయలు తీసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.