సాధారణంగానే గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహారపరంగా, ఆరోగ్యపరంగా ఎంత జాగ్రత్త పాటిస్తే పుట్టే పిల్లలు అంత హెల్దీగా ఉంటారు. అయితే ఒక కొత్త అధ్యయనంలో గాలి కాలుష్యం వల్ల  పుట్టబోయే పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వెల్లడైంది. గర్భిణులు అధికంగా గాలి కాలుష్యానికి గురైతే వారికి పుట్టబోయే పిల్లలు తక్కువ బరువుతో పుట్టే అవకాశం ఉందని చెబుతోంది కొత్త అధ్యయనం. అంతేకాదు ఇలా తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్లో వయసు పెరిగే కొద్దీ ఆస్తమా వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనం వివరిస్తోంది. శిశువుల్లో శ్వాసకోశ వ్యవస్థ అభివృద్ధి చెందడం మందగిస్తుందని చెబుతోంది. కాబట్టి గర్భిణీలు వాయు కాలుష్యానికి దూరంగా ఉండడం చాలా ఉత్తమం.


ఎవరైతే గాలి కాలుష్యానికి దూరంగా, పచ్చటి ప్రకృతిలో నివసిస్తారో అలాంటి వారికి ఆరోగ్యకరమైన బిడ్డ పుట్టే అవకాశం అధికమని చెబుతున్నారు పరిశోధనకర్తలు. ఈ అధ్యయనంలో భాగంగా నార్వే, డెన్మార్క్, ఐస్ లాండ్, స్వీడన్ వంటి దేశాల్లోని 4 వేల మంది కంటే ఎక్కువ మంది పిల్లల ఆరోగ్య డేటాను విశ్లేషించారు. వారిలో కొంతమంది తక్కువ బరువుతో పుట్టారు. అలాగే ఆస్తమాతో కూడా ఇబ్బంది పడుతున్నారు. వారి తల్లులు గర్భిణులుగా ఉన్నప్పుడు నివాస ప్రాంతాలు, వాతావరణం, గాలి కాలుష్యం వంటి డేటాలను కూడా విశ్లేషించారు అధ్యయనకర్తలు. గాలి కాలుష్యంలో జీవించిన గర్భిణులకు జన్మించిన పిల్లలు తక్కువ బరువుతో ఉన్నట్టు గుర్తించారు. పచ్చదనంతో కూడిన వాతావరణంలో జీవించిన గర్భిణులకు ఆరోగ్యకరమైన పిల్లలు పుట్టినట్టు గుర్తించారు. గాలి కాలుష్యం వల్ల గర్భస్థ శిశువులు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతారని తెలిసింది. సాధారణ శిశువులతో పోలిస్తే గాలి కాలుష్యానికి గురైన తల్లులకు పుట్టిన శిశువులు 30 గ్రాములు తక్కువగా బరువుతో పుడుతున్నట్టు ఈ అధ్యయనం చెబుతోంది.


అలాగే వేడి గాలులకు లేదా అతి చల్లని గాలులకు కూడా గర్భిణులు గురవడం మంచిది కాదు. వేడి గాలి వల్ల శరీరం డిహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. అలాగే చల్లని గాలుల వల్ల కూడా కొన్ని రకాల సమస్యలు రావచ్చు. కాబట్టి సాధారణ వాతావరణంలో గర్భిణీలు జీవించేలా చూసుకోవాలి. ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఆకుకూరలు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, చిరుధాన్యాలు వంటి వాటిని డైట్‌లో భాగం చేసుకోవాలి. ప్రతిరోజూ కప్పు పెరుగును కచ్చితంగా తినాలి. స్పైసి ఫుడ్, మసాలా ఆహారాన్ని దూరంగా పెట్టాలి. అలాగే వదులుగా ఉండే లేత రంగుల దుస్తులు వేసుకోవాలి. కాటన్ దుస్తులు ధరిస్తే ఇంకా మంచిది. వీలైనంత ఎక్కువగా ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మధ్యాహ్నం పూట ఒక అరగంట కునుకు తీస్తే మంచిది. రాత్రి నిద్ర మాత్రం చాలా ముఖ్యం. 


Also read: అమ్మాయిలు వెండి పట్టీలు ధరిస్తే ఆ నొప్పులన్నీ మాయం


Also read: కొంతమంది పిల్లల్లో నత్తి ఎందుకు వస్తుంది? తల్లిదండ్రులు ఏం చేయాలి?













గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.