Signs of Infertility in Women: పెళ్లయిన తర్వాత దంపతులు తాము సాధ్యమైనంత త్వరగా పిల్లల్ని కనాలని కోరుకుంటారు. ముఖ్యంగా మహిళలకు తాము అమ్మ అని పిలిపించుకోవాలని ఉంటుంది. కానీ చాలాసార్లు ప్రయత్నించినా కొందరు వివాహితలు గర్భం దాల్చలేకపోతున్నారు. భార్యాభర్తలు రెగ్యూలర్‌గా శారీరక సంబంధం కొనసాగించిన తర్వాత కూడా పిల్లలు పుట్టకపోతే, ఎంత కాలం తర్వాత దాన్ని సంతానలేమి (Infertility) సమస్యగా భావించాలనే ప్రశ్న భార్య భర్తలలో తలెత్తుతుంది. సంతానలేమి సమస్యను వంధ్యత్వం అని కూడా పిలుస్తారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, దీనికి ఒక గ్లోబల్ కండీషన్ ఉంది. కొత్తగా పెళ్లయిన ప్రతి జంట ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. 

సంతానలేమి అని ఎప్పుడు పరిగణిస్తారు?

డాక్టర్ హిమాషు రాయ్ సంతానలేమి సమస్యలపై మాట్లాడుతూ, "ఒక జంట 12 నెలల పాటు ఎలాంటి సేఫ్టీ లేకుండా క్రమం తప్పకుండా శారీరక సంబంధం పెట్టుకుని, మహిళ గర్భం దాల్చకపోతే ఆ జంటకు సంతానలేమి సమస్యగా పరిగణిస్తారు. దీనినే అంతర్జాతీయ స్థాయిలో Infertility అంటారు." 

స్త్రీలు, పురుషులు ఇద్దరిలోనూ సమస్య ఉండవచ్చు

  • సంతానలేమి అనేది కేవలం మహిళలకి సంబంధించిన సమస్య అని చాలా మంది భావిస్తారు, కానీ ఇది నిజం కాదు.
  • దాదాపు 40 శాతం సంతానలేమి కేసులలో కారణాలు మహిళలకు సంబంధించినవి ఉంటాయి.
  • 30-35 శాతం కేసులలో సమస్య పురుషులకు సంబంధించినది అయి ఉంటున్నాయి.
  • 20-25 శాతం సంతానం కలగని కేసులలో ఇద్దరు భాగస్వాములలోనూ సమస్య ఉంటుంది. 

సంతానలేమికి ప్రధాన కారణాలు

  • మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతతో పాటు PCOS (PCOS), ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం, అధిక వయస్సు, లేదా థైరాయిడ్ వంటి సమస్యలు.
  • పురుషులలో అయితే తక్కువ స్పెర్మ్ కౌంట్ (Sperm Count), స్పెర్మ్ నాణ్యత తక్కువగా ఉండటం, మద్యం సేవించడం, సిగరెట్ (Smoking) తాగడం, ఒత్తిడి, ఊబకాయం లాంటి కారణాలు ఉన్నాయి.
  • జీవనశైలి కారకాలు - సరైన నిద్ర లేకపోవడం, అసమతుల్య ఆహారం తీసుకోవడం, జంక్ ఫుడ్ తినడం, ఉద్యోగ, వ్యాపార సంబంధ అధిక ఒత్తిడి లాంటివి వంధ్యత్వానికి కారణం అవుతాయి. 

ఎన్నిసార్లు దంపతుల మధ్య కలయిక అవసరం

గర్భధారణ అవకాశాలను పెంచడానికి ఋతుస్రావంలో భాగంగా అండం విడుదల సమయంలో వారానికి 2 నుంచి 3 సార్లు భార్యాభర్తలు శారీరకంగా కలిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువసార్లు శారీరకంగా కలవడం ద్వారా గర్భం వస్తుందని గ్యారంటీ లేదు. అందుకు సరైన సమయం, ఆరోగ్యకరమైన శరీరం లాంటివి ఉండటం చాలా ముఖ్యం. 

వైద్యుడిని ఎప్పుడు సంప్రదించాలి

  • మహిళ వయస్సు 35 సంవత్సరాల కంటే తక్కువగా ఉన్నప్పటికీ, ఏడాది గడిచినా కూడా గర్భం దాల్చకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి. 
  • మహిళ వయస్సు 35 సంవత్సరాలు దాటితే, రెగ్యూలర్‌గా శారీరకంగా కలుస్తున్నా 6 నెలల ప్రయత్నాల తర్వాత సైతం గర్భం రాకపోతే  వైద్యుడిని సంప్రదించాలి.
  • పురుషులలో నిరంతరం అలసటగా అనిపించడం, లైంగిక కోరికలు తగ్గడం లాంటి సమస్యలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. 

గమనిక: వార్తలో ఇచ్చిన  సమాచారం కొందరు వైద్యుల నివేదికలను ఆధారంగా అందించాం. ఏదైనా ఆరోగ్య సలహాను పాటించే ముందు, కచ్చితంగా సంబంధిత నిపుణుడిని, డాక్టర్లను సంప్రదించడం ముఖ్యం.