''మహాభారతంలో బార్బరికుడు త్రిబాణంతో కురుక్షేత్రంను ఆపగలరు. అటువంటి బార్బరికుడిని శ్రీ కృష్ణ పరమాత్ముడు ఒక వరం అడిగి యుద్ధం జరిగేలా చేస్తారు. ఉత్తర భారతంలో బార్బరికునికి చాలా ఫాలోయింగ్ ఉంటుంది. మా సినిమాలో సత్యరాజ్ గారు కొన్ని సన్నివేశాల్లో బార్బరికునిలా కనిపిస్తారు'' అని దర్శకుడు మోహన్ శ్రీవత్స తెలిపారు.
సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'త్రిబాణధారి బార్బరిక్' (Tribanadhari Barbarik Movie). ఉదయభాను మరొక ప్రధాన పాత్ర పోషించారు. 'ది రాజా సాబ్' దర్శకుడు మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ పతాకంపై విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మించారు. వశిష్ట ఎన్ సింహా, 'సత్యం' రాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ తదితరులు నటించిన ఈ సినిమా ఆగస్టు 29న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా మీడియాకు దర్శకుడు మోహన్ శ్రీవత్స ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో మెయిన్ పాయింట్స్...
- చిన్నతనం నుంచి సినిమాల్లోకి రావాలని, దర్శకుడు కావాలని కలలు కన్నాను. అందుకోసం సంగీతాన్ని నేర్చుకున్నా. పలు ఈవెంట్లలో పాటలు పాడాను కూడా. ఆ సంగీతమే నాకు ఇన్నాళ్లూ తిండి పెట్టింది. డిఫరెంట్ సినిమా తీయాలని ఈ 'త్రిబాణధారి బార్బరిక్' కథ రాసుకున్నా. మా నిర్మాత నేరేషన్ విన్న వెంటనే ఓకే చేశారు. మారుతి గారు సైతం కథ విని ఆశ్చర్యపోయారు. నేరేషన్ విని నమ్మేశారు.
- మారుతి గారు సూపర్ హిట్ సినిమాలు చేశారు. అయితే ఆయన జానర్‌లో ఉండే సినిమా కాదిది. అయితే నేను నెరేట్ చేసిన తీరు చూసి ఓకే చేశారు. ఆ తర్వాత యాభై శాతం చిత్రీకరణ చేశా. అది చూశాక ఆయనకు నమ్మకం కలిగింది. విజయ్ సేతుపతి గారి 'మహారాజా' స్క్రీన్ ప్లే, టెంప్లెట్‌లో ఉంటుందీ సినిమా. ఆ సినిమా తర్వాత మారుతి గారు మా 'బార్బరిక్'ను ఎక్కువగా నమ్మారు. ఆయన మరిన్ని ఇన్ పుట్స్ ఇచ్చారు. ఆయన సహకారం మరువలేను.
- 'బార్బరిక్' కథలో చాలా లేయర్స్ ఉన్నాయ్. ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సంఘటనలకు మైథలాజికల్ టచ్ ఇచ్చా. ఇదొక కంటెంట్ బేస్డ్ ఫిల్మ్. ఇందులో ప్రతి పాత్రకు భిన్నమైన పార్శ్వాలు ఉంటాయి. ఆర్టిస్టులు అందరూ అద్భుతంగా నటించారు. నాకు సంగీతంపై అవగాహన ఉంది. ఆడియన్స్ పల్స్ తెలుసు. ఇన్ ఫ్యూజన్ బ్యాండ్‌తో మంచి బంధం ఉంది. అందుకని వాళ్ళను తీసుకున్నా. పాటలతో పాటు మంచి ఆర్ఆర్ ఇచ్చారు.
- మా సినిమాలో హీరో, విలన్ అని సపరేటుగా ఉండరు. అన్ని పాత్రల్లో అన్ని రకాల కోణాలు ఉంటాయి. ప్రతి ఒక్కరిలో అంతరంగిక యుద్ధం జరుగుతుంటుంది. ఈ సినిమాతో మంచి సందేశాన్ని ఇవ్వాలనుకున్నా. ప్రతి ఒక్కరం తప్పులు చేస్తాం. అయితే ఎమోషన్స్ కంట్రోల్‌లో పెట్టుకునే వాడు గొప్ప మనిషి అనేది సందేశం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్... 'బార్బరిక్' కథకు తగ్గట్టు నిర్మాత విజయ్ పాల్ రెడ్డి గారు ఖర్చు చేశారు. ఆయన ఎక్కడా రాజీ పడకుండా మాకు అండగా నిలిచారు. ఈ సినిమా అన్ని వర్గాలను ఆకట్టుకునే సినిమా.
Also Read: మహేష్ అన్న కొడుకు... బాలీవుడ్ హీరోయిన్ కూతురు... తెలుగు తెరకు జంటగా!