Pregnancy Journey : ప్రెగ్నెన్సీ అంటే కేవలం పురుషుడి వీర్యంతో జరిగే ప్రక్రియ కాదు. అలా అని కేవలం స్త్రీల వల్లే కూడా జరిగేది కాదు. ఇరువురి కలయిక వల్లనే ఓ ప్రాణం పురుడుపోసుకుంటుంది. ఈ జీవాన్ని మహిళ తన శరీరంలోనే మోస్తుంది కాబట్టి తల్లికి ఎక్కువ వాల్యూ ఇస్తారు. అయితే కొందరు మాత్రం వీర్యం ఉంటే చాలు పిల్లలు పుట్టేస్తారని భావిస్తారు. కానీ అది వాస్తవం కాదు. ఆరోగ్యకరమైన పిండాన్ని తయారు కావడానికి పురుషుడు, స్త్రీ ఇద్దరూ అవసరమే. స్త్రీ శరీరంలోని గర్భాశయంలో బిడ్డ పెరుగుతుంది. అయితే ఈ పిండం ఎలా ఏర్పడుతుంది. ఏ నెలల్లో ఏమేమి జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. 
 
గర్భధారణ నుంచి బిడ్డ పుట్టే వరకు చాలా సుదీర్ఘమైన, సంక్లిష్టమైన ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రక్రియలో అనేక ముఖ్యమైన దశలు ఉంటాయి. వీటి సహాయంతో కడుపులో బిడ్డ తయారవుతుంది. ఈ ప్రాసెస్​ను నిపుణులు మూడు ప్రధాన దశలుగా విభజించారు. వాటిలో ఒకటి జెర్మైనల్, రెండోది ఎంబ్రియానిక్, మూడోది ఫెటల్. చాలా మందికి వీటి గురించి తెలియదు.. అయితే ప్రెగ్నెన్సీ సమయంలో వీటిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.

మొదటి దశ (జెర్మైనల్ స్టేజ్)

గర్భధారణ తర్వాత మొదటి దశను జెర్మెనల్ స్టేజ్ అంటారు. పురుషుడి వీర్యం స్త్రీ అండంతో కలిసినప్పుడు జైగోట్ ఏర్పడుతుంది. ఇది గర్భాశయం వైపు కదులుతుంది. ఈ ప్రక్రియలో జైగోట్ అనేకసార్లు విడిపోయి.. బ్లాస్టోసిస్ట్ ఏర్పడుతుంది. ఇది గర్భాశయ గోడకు చేరుకుంటుంది. ఇది విజయవంతమైతే గర్భధారణ ప్రారంభమవుతుంది. ఆ సమయంలో శరీరం హార్మోన్ల ఉత్పత్తిని ప్రారంభిస్తుంది.

రెండో దశ (ఎంబ్రియానిక్ స్టేజ్)

ఈ దశ గర్భధారణ మూడవ వారం నుంచి ఎనిమిదవ వారం వరకు ఉంటుంది. ఈ సమయంలో బ్లాస్టోసిస్ట్ పరిమాణంలో మార్పులు ఉంటాయి. దానిని పిండం అంటారు. ఈ సమయంలో మెదడు, చేతులు, కాళ్లు, కళ్లు వంటి శరీర భాగాలు ఏర్పడటం ప్రారంభమవుతాయి. గుండె కూడా తయారవుతుంది. అది కొట్టుకోవడం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో చాలా మంది మహిళలు ఉదయం వికారం లేదా వాంతులు వంటివి ఎదుర్కొంటారు.

మూడోవ దశ (ఫెటల్ స్టేజ్)

ఈ దశలో గర్భధారణ తొమ్మిదవ వారం నుంచి పుట్టుక వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో పిండంలో లింగ నిర్ధారణ జరుగుతుంది. శరీరంలోని ముఖ్యమైన భాగాలు పరిపక్వం చెందుతాయి. జుట్టు, గోర్లు, వెంట్రుకలు కూడా పెరుగుతాయి. పిండం ఇప్పుడు తన అవయవాలను కదిలించడానికి కూడా సిద్ధమవుతుంది. అయితే స్త్రీ గర్భధారణ 20వ వారం వరకు దాని కదలికను అనుభవించకపోవచ్చు. ఈ దశలో పిండం పరిమాణం, బరువు వేగంగా పెరుగుతాయి.

37 నుంచి 40 వారాల్లో డెలీవరి అయిపోతుంది. కొందరికి 37 వారాలకంటే ముందే డెలీవరి అవుతుంది. మరికొందరికి 40 వారాలు దాటొచ్చు. మహిళ ఆరోగ్యం, జీవనశైలి, బేబి గ్రోత్ బట్టి ఇవి ఉంటాయి. అలాగే ఈ అంశాలన్ని నార్మల్ డెలివరీ, ఆపరేషన్​ చేసేలా చేస్తాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.