Summer Drink Pineapple Tea : టీని చాలామంది ఇష్టంగా తాగుతారు. మసాలా టీ అయినా.. అల్లం టీ అయినా.. గ్రీన్ టీ అయినా.. మూడ్ రిఫ్రెష్ చేసుకోవడం కోసం తాగుతారు. అయితే వీటికి భిన్నమైన రుచిని ఇచ్చే గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవిలో టీ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కానీ ఈ రుచికరమైన టీ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. అదే పైనాపిల్ టీ. ఈ టీని ఎలా తయారు చేస్తారు? దీనివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

Continues below advertisement

పైనాపిల్ టీ

పైనాపిల్ టీని తయారు చేయడానికి పైనాపిల్ తొక్కను వాడతారు. పండును తిని తొక్కను పడేసేవారు.. దానితో చక్కగా టీ పెట్టుకుని తాగవచ్చు. దీనిలో విటమిన్ C తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయితే పైనాపిల్ తొక్కలో బ్రోమెలైన్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలా అని కేవలం తొక్కతోనే కాదు లోపలి గుజ్జుతో కూడా టీ తయారు చేసుకోవచ్చు. రుచి పెంచుకోవడానికి అల్లం లేదా దాల్చినచెక్క కూడా వేసుకోవచ్చు. మరి దీనిని తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం. 

వాపు, నొప్పి దూరం.. 

పైనాపిల్ టీలో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది వాపు, నొప్పిని తగ్గిస్తుంది. ఆర్థ్రైటిస్ సమస్య ఉన్నవారికి కూడా హెల్ప్ చేస్తుంది. 

Continues below advertisement

మెరుగైన జీర్ణశక్తి

బ్రోమెలైన్ ప్రొటీన్లను విచ్ఛిన్నం చేసే ఎంజైమ్. దీనివల్ల జీర్ణక్రియ మెరుగ్గా జరుగుతుంది. గ్యాస్, ఉబ్బరం తగ్గుతాయి. పైగా యాంటీబాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి కాబట్టి గట్ ఆరోగ్యం మెరుగవుతుంది.

రోగనిరోధక శక్తికై..

పైనాపిల్ తొక్కలో విటమిన్ C, కాల్షియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ C వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. శరీరంలో హాని చేసే ఫ్రీ రాడికల్స్ తగ్గుతాయి.

యాంటీఆక్సిడెంట్లు

పైనాపిల్​లోని ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ యాసిడ్లు, విటమిన్ C వంటి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఆక్సీడేటివ్ స్ట్రెస్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. తొక్కలో ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి.

చర్మ ఆరోగ్యానికై.. 

అనాసపండు టీలో అస్కార్బిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ తయారీకి అవసరం. దీనివల్ల చర్మం ముడతలు తగ్గి, నునుపుగా, ఆరోగ్యంగా మారుతుంది.

ఎనర్జీ కోసం.. 

విటమిన్ C తక్కువగా తీసుకునే వారిలో అలసట ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. బ్రోమెలైన్, విటమిన్ C కలిసి ప్రొటీన్లు, గ్లూకోజ్‌ను విచ్ఛిన్నం చేసి శక్తిని అందిస్తాయి. 

బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుందా?

పైనాపిల్ తొక్కలో చక్కెర, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది తేలికైన పానీయం. అయితే ఒక్క టీ వల్ల బరువు తగ్గదు. బరువు తగ్గాలనుకుంటే సమతుల్య ఆహారం, వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.

పైనాపిల్ టీ తయారీ విధానం

ముందుగా నీళ్లు బాగా మరిగించి.. శుభ్రంగా కడిగిన తొక్కలు లేదా పండ్ల ముక్కలు వేయండి. దానిలో అల్లం వేసుకోవచ్చు. పది నుంచి 15 నిమిషాలు మరగనివ్వండి. వడబోసి వేడిగా తాగవచ్చు. లేదా చల్లార్చి ఐస్ టీగా కూడా తీసుకోవచ్చు. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

రోజుకు ఒక కప్పు మాత్రమే సరిపోతుంది. ఎక్కువగా తాగితే వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి రావచ్చు. అలర్జీ ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. రక్తం గడ్డకట్టకుండా నిరోధించే మందులు లేదా యాంటీబయాటిక్స్ వాడేవారు వైద్యుని సలహా తీసుకోవాలి.

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.