Signs the Body Shows Before Death : మరణం ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. కానీ శరీరం చనిపోవడానికి ముందు సంకేతాలు ఇస్తుందట. దీని గురించి చాలామందికి డౌట్ ఉంటుంది. ఇది నిజమా? కాదా? అని. దీనిగురించి కొందరు సైన్స్‌ని ఆశ్రయిస్తే.. మరికొందరు మత గ్రంథాలలో సమాధానాలు వెతుక్కుంటారు. కానీ ఆశ్చర్యకరంగా.. ఆధునిక వైద్య శాస్త్రం, పురాతన నమ్మకాలు రెండూ కూడా మరణానికి ముందు సంభవించే నిర్దిష్ట మార్పులను సూచించాయి.
ఆకలి తగ్గుతుందా?
వైద్య శాస్త్రం ప్రకారం.. శరీరం జీవితపు చివరి దశలకు చేరుకునే కొద్దీ.. అనేక శారీరక ప్రక్రియలు క్రమంగా మందగిస్తాయని తెలిపింది. వైద్యులు, ఉపశమన సంరక్షణ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మరణానికి కొన్ని రోజుల ముందు శరీరం శక్తిని ఆదా చేసే స్థితిలోకి ప్రవేశిస్తుందట. ఆ సమయంలో మరణానికి దగ్గరగా ఉన్న వ్యక్తికి తరచుగా ఆకలి, దాహం తగ్గుతుందని గుర్తించింది. జీర్ణవ్యవస్థ మందగించి ఆకలి, నీరు తీసుకోవడం తగ్గిస్తారట. ఇది సాధారణ జీవ ప్రక్రియగా పరిగణిస్తారు.
శ్వాసలో మార్పులు..
చివరి రోజుల్లో శ్వాస తీసుకోవడం చాలా వేగంగా లేదా చాలా నెమ్మదిగా మారవచ్చు. కొన్నిసార్లు శ్వాస తీసుకోవడం అడపాదడపా జరుగుతుంది. దీనిని వైద్యులు చెయిన్-స్టోక్స్ శ్వాస అని పిలుస్తారు. గొంతు నుంచి శ్వాసలో గురక శబ్దం కూడా ఉండవచ్చు. దీనిని సాధారణంగా డెత్ రాటిల్ అని పిలుస్తారు.
నిద్రలో ఉన్నా..
శరీర శక్తి స్థాయిలు వేగంగా తగ్గుతాయట. అలాగే ఆ వ్యక్తి రోజులో ఎక్కువ సమయం నిద్రలోనే గడుపుతాడు. అయినా సరే మేల్కొన్న తర్వాత కూడా చాలా అలసటగా ఫీల్ అవుతాడట. చేతులు, కాళ్లు ఎత్తడం లేదా మాట్లాడటం కూడా కష్టంగా మారుతుంది.
మానసిక ఆలోచనలు..
మరణానికి కొన్ని రోజుల ముందు వ్యక్తి ప్రవర్తన, ఆలోచనలలో కూడా మార్పులు వస్తాయట. కొన్నిసార్లు ఆ వ్యక్తి భ్రాంతికి గురై.. తన పరిసరాలతో సంబంధం లేని విధంగా మాట్లాడటం ప్రారంభిస్తాడు. మరి కొందరైతే నిజానికి లేని వాటిని చూస్తున్నట్లు లేదా విన్నట్లు నివేదిస్తారు. వైద్య శాస్త్రం దీనికి ఆక్సిజన్ లేకపోవడం, మందుల ప్రభావాలు లేదా మెదడు కార్యకలాపాల్లో మార్పులే కారణమని చెబుతుంది.
సంప్రదాయాలు ఏమి చెప్తున్నాయంటే..
భారతీయ సంప్రదాయంలో.. గరుడ పురాణం, శివ పురాణం వంటి గ్రంథాలు మరణానికి ముందు సంభవించే సంకేతాలను వివరిస్తాయి. అయితే వీటిని శాస్త్రీయ ఆధారాలుగా కాకుండా విశ్వాసం, నమ్మకానికి సంబంధించిన విషయంగా చూస్తారు.
చివరిగా..
మరణానికి వారం ముందు శరీరం, మెదడు రెండూ వేగంగా పనితీరు క్షీణిస్తాయని నిపుణులు నమ్ముతున్నారు. అందుకే ఈ సమయంలో శారీరక బలహీనత, మానసిక గందరగోళం, భావోద్వేగ దూరం తరచుగా ఒకేసారి కనిపిస్తాయి. ఇది భయంతో కాకుండా అవగాహన, సున్నితత్వంతో చూడవలసిన సహజమైన ప్రక్రియగా చెప్తున్నారు.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పరిశోధనలు, పండితులు చెప్పిన వివరాలు సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.