Anti-Aging Breakthrough: వయసైపోతుందనే బాధ లేదు.. ఎనర్జీ తగ్గుతుందనే ఆందోళన లేదు. దానిని జయించే కొత్త మార్గం దొరికింది. సైంటిస్టుల కృషి ఫలిస్తే.. 50 ఏళ్ల తర్వాత కూడా యంగ్ అండ్ ఎనర్జిటిక్‌గా ఉండే అవకాశం ఉంది.  అడ్వాన్స్డ్‌డ్ జెనెటిక్స్‌ ద్వారా ఇప్పుడు ఇది సాధ్యమవుతుంది. ఆ దిశగా చేస్తున్న పరిశోధనల్లో మంచి ఫలితాలు వచ్చాయి.

Continues below advertisement

కణాల వయసుకు రివర్స్ గేర్? సైన్స్ చూపిస్తున్న కొత్త దారి

ఇప్పటివరకు వృద్ధాప్యం అంటే శరీరం నెమ్మదిగా బలహీనపడటం అనే భావన ఉంది. వయసు పెరిగేకొద్దీ శక్తి తగ్గడం, అవయవాలు సరిగా పనిచేయకపోవడం, రోగాల ముప్పు పెరగడం… ఇవన్నీ సహజమే అనుకున్నారు. కానీ ఇప్పుడు శాస్త్రవేత్తలు ఆ భావనను మార్చే దిశగా ముందడుగు వేశారు. పాత కణాలను మళ్లీ యవ్వన స్థితికి తీసుకురావడం సాధ్యమవుతుందా అనే ప్రశ్నకు కొత్త సమాధానం దొరుకుతోంది.

Continues below advertisement

మన శరీరంలోని ప్రతి కణంలో ఒకే డీఎన్‌ఏ ఉంటుంది. కానీ ప్రతి కణం ఎలా పనిచేయాలో నిర్ణయించేది లోపల జరిగే జీన్ల నియంత్రణ వ్యవస్థ. యవ్వనంలో ఈ వ్యవస్థ చక్కగా సమన్వయంతో నడుస్తుంది. కాలం గడిచేకొద్దీ ఈ నియంత్రణలో గందరగోళం మొదలవుతుంది. దాంతో కణాలు శక్తిని కోల్పోతాయి, సెల్ ప్రొడక్షన్ తగ్గుతుంది. అవయవాల పనితీరు మందగిస్తుంది. అంటే వృద్ధాప్యం అనేది కేవలం శరీరానికి వచ్చిన నష్టం కాదు – కణాల్లో తేడా వచ్చిన సమన్వయం కూడా ప్రధాన కారణం.

యవ్వనాన్ని కాపాడే నాలుగు కీలక స్విచ్‌లు

అమెరికాలోని UCSF యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కణాల్లోని నియంత్రణ వ్యవస్థను లోతుగా అధ్యయనం చేశారు. ఈ పరిశోధనలో నాలుగు ముఖ్యమైన నియంత్రణ కారకాలు బయటపడ్డాయి – E2F3, EZH2, STAT3, ZFX. ఇవి కణాల్లో జరిగే ప్రక్రియలకు దిశానిర్దేశం చేసే మాస్టర్ స్విచ్‌లుగా పనిచేస్తాయి. యవ్వనంలో ఇవి యాక్టివ్‌గా ఉంటాయి. వయసు పెరిగేకొద్దీ ఇవి మందగిస్తాయి. ఈ స్విచ్‌లను మళ్లీ ఆన్ చేయగలిగితే పాత కణాలు తిరిగి యవ్వనంలా ప్రవర్తించగలవని శాస్త్రవేత్తలు గుర్తించారు.పరిశోధనలో వృద్ధాప్య మానవ కణాలపై ఈ స్విచ్‌లను యాక్టివేట్ చేశారు. కొద్ది రోజుల్లోనే స్పష్టమైన మార్పులు కనిపించాయి. కణాల్లో శక్తి పెరిగింది. విభజన మళ్లీ మొదలైంది. జీన్ పనితీరు యవ్వన స్థాయికి చేరింది. సారాంశంగా చెప్పాలంటే – పాత కణాలు మళ్లీ కొత్త కణాల్లా పనిచేయడం మొదలుపెట్టాయి. ఇది ఇప్పటివరకు వృద్ధాప్యంపై జరిగిన పరిశోధనల్లో ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు.

 

ఎలుకలపై పరీక్షల్లో మరింత బలమైన ఆధారం

ల్యాబ్ ఫలితాలతో ఆగకుండా శాస్త్రవేత్తలు జీవుల్లోనూ పరీక్షలు చేశారు. వృద్ధాప్య ఎలుకల్లో ఈ నియంత్రణ స్విచ్‌లలో ఒకదాన్ని యాక్టివేట్ చేయగా లివర్‌లో కొవ్వు తగ్గింది, పాత గాయాల మచ్చలు తగ్గాయి, షుగర్ నియంత్రణ మెరుగైంది. ముఖ్యంగా అవయవాల పనితీరు యువ ఎలుకల స్థాయికి దగ్గరగా మారింది. కాబట్టి ఈ పద్ధతి కేవలం సిద్ధాంతం మాత్రమే కాదని, వాస్తవికంగా పనిచేయగల అవకాశముందని సూచిస్తోంది.

గేమ్ చేంజర్ పరిశోధన

ఇప్పటివరకు వృద్ధాప్యాన్ని శరీరానికి వచ్చిన డ్యామేజ్‌గా మాత్రమే చూశాం. కానీ ఈ పరిశోధన  కొత్త మార్గాలను చూపిస్తోంది. వృద్ధాప్యం అంటే కణాల్లో సమన్వయం తప్పిపోవడం. ఆ సమన్వయాన్ని తిరిగి సరిచేస్తే వృద్ధాప్య ప్రభావాలను తగ్గించవచ్చు. అంటే కణాలను మార్చడం కాదు, వాటి పనితీరును మళ్లీ సెట్ చేయడం.ఇప్పటికీ ఇది పరిశోధన ప్రారంభ దశలోనే ఉంది. మనుషులపై పూర్తి స్థాయి పరీక్షలు జరగాల్సి ఉంది. భద్రత అంశాలపై మరిన్ని అధ్యయనాలు అవసరం. అయినా ఈ ఫలితాలు అడ్వాన్స్‌డ్ జెనటిక్స్‌లో  కొత్త మార్గానికి తలుపులు తెరుస్తున్నాయి.

ఇది చావును జయించడం కాదు

ఇలా ముసలి వాళ్లని యువకులుగా ఉంచే ప్రక్రియతో చావును కూడా జయించొచ్చా..లేదా ఎక్కువుగా కాలం జీవించొచ్చా అనే ఓ భావన వైపు తీసుకెళుతుంది. అయితే దీనిని ఆ కోణంలో కాకుండా వృద్దాప్యంలోనూ మంచి శక్తివంతంగా.. ఆరోగ్యంగా మనుషులు ఉండేలా చేయగలిగే ఆవిష్కరణగా చూడాలి అని చెబుతున్నారు.కణాల్లో దాగి ఉన్న యవ్వన బ్లూప్రింట్‌ను మళ్లీ మేల్కొలిపే దిశగా సైన్స్ ముందుకు సాగుతోంది.