ఇంట్లో ఒక్క బొద్దింక కనిపిస్తేనే అప్రమత్తం అయిపోతాం. వెంటనే వాటిని ఇంట్లో నుంచి తరిమేస్తాం. అయితే, ఓ సంస్థ మీ ఇంట్లోకి 100 బొద్దింకలు వదులుతామని, ఇందుకు అంగీకరిస్తే.. 2 వేల డాలర్లు(రూ.1.5 లక్షలు) ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇదే ఆఫర్ మీకు ఇస్తే.. ఇందుకు అంగీకరిస్తారా? 


అయినా.. మన ఇంట్లో బొద్దింకలు వదిలితే వారికి ఏమిట లాభం అనేగా మీ సందేహం? అయితే, మీరు ఆ సంస్థ గురించి తెలుసుకోవాలి. అమెరికాలోని నార్త్ నార్త్ కరోలినాకు చెందిన పెస్ట్ కంట్రోల్ కంపెనీ ఈ ఆఫర్ ప్రకటించింది. ఇంట్లోకి 100 అమెరికన్ బొద్దింకలను వదిలేందుకు అనుమతి ఇస్తే.. ఇంటి యజమానికి రూ.1.5 లక్షలు ఇస్తామని తెలిపింది. 


ఎందుకు ఇదంతా?: ఇంట్లో తిరిగే బొద్దింకలను నిర్మూలించే పద్ధతిని పరీక్షించేందుకే ఆ సంస్థ ఈ ఆఫర్ ప్రకటించింది. అయితే, ఇలా చేసేందుకు ఆ సంస్థ ఎవరినీ ఒత్తిడి చేయడం లేదు. ఆసక్తి ఉంటే తమ ‘పెస్ట్ ఇన్ఫార్మర్’ వెబ్‌సైట్‌కు వెళ్లి దరఖాస్తు చేయండని అడుగుతోంది. వారు కావాలంటే సొంతంగా ఆ బొద్దింకలను ఓ గదిలో వేసి ప్రయోగం చేయొచ్చు. అయితే, ఇంట్లో పెరిగే బొద్దింకలకు, ప్రత్యేకంగా గదుల్లో వేసి పెంచే బొద్దింకలకు మధ్య చాలా తేడా ఉంటుందట. వాటి నిర్మూలన పద్ధతుల్లో కూడా వ్యత్యాసం ఉంటుందట. అందుకే, బొద్దింకలను ఇంట్లోకి వదిలి 30 రోజులపాటు పరీక్షిస్తారట. ఇందుకు ఆ ఇంటి యజమాని లిఖిత పూర్వకంగా అంగీకారం తెలపాలి.


Also Read: వీర్య దానంతో డబ్బే డబ్బు, ఇలా చేస్తే మీరూ సంపాదించవచ్చు!


ఒక వేళ వారు బొద్దింకల నిర్మూలన విధానం విఫలమై.. 30 రోజుల తర్వాత కూడా అవి ఇంట్లోనే తిష్టవేస్తే ఏం చేస్తారనే సందేహం కూడా మీకు వచ్చే ఉంటుంది. 30 రోజుల తర్వాత కూడా బొద్దింకలు ఉంటే.. మరో 30 రోజుల కోసం మరో రూ.1.56 లక్షలు ఆ సంస్థ చెల్లిస్తుంది. అంటే, ఆ బొద్దింకలు ఎన్నాళ్లు వారి ఇంట్లో ఉంటాయో.. అన్నాళ్లు ఆ సంస్థ వారికి డబ్బు చెల్లిస్తూనే ఉంటుంది. ఈ ప్రకటన చేసిన వెంటనే ఆ సంస్థకు 2,200 దరఖాస్తులు అందాయట. జులై 31 వరకు అప్లికేషన్ పేజీ అందుబాటులో ఉంటుంది. అయితే, చివరికి వీరు కేవలం 5 నుంచి 7 ఇళ్లను మాత్రమే ఎంపిక చేసుకుంటారు.  


Also Read: ఇట్స్ బాయ్ థింగ్, అబ్బాయిలూ ఉదయాన్నే అలా జరక్కపోతే, త్వరగా చచ్చిపోతారట!