సీనియర్ నటి లక్ష్మి కూతురు ఐశ్వర్య సినిమా కష్టాలు


ఎవరికైనా ఇబ్బందులు వస్తే కాస్త డ్రమటైజ్ చేసి "సినిమా కష్టాలు" అని చెప్పుకోవటం కామన్. సినిమా స్టోరీల్లోనే కాదు. సినిమాల్లోనే నటించే వాళ్లకూ ఇదే కష్టాలు. ఈ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరు ఎలా స్టార్‌డమ్ తెచ్చుకుంటారో, ఎవరు లైమ్‌లైట్‌ నుంచి పక్కకు తప్పుకుంటారో ఊహించలేం. అవకాశాలు ఉన్నన్నాళ్లు మంచి స్టేటస్‌ని అనుభవించిన వాళ్లే తరవాత ఫేడ్ అవుట్ అయిపోతారు. సినీ పరిశ్రమలో ఇలా చాలా మందే ఉన్నారు. వారిలో ఒకరు సీనియర్ నటి లక్ష్మీ కుమార్తె ఐశ్వర్య. ఒకప్పుడు మోహన్‌లాల్ లాంటి సూపర్‌స్టార్స్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఐశ్వర్య ఇప్పుడు పూట గడవని స్థితిలో కాలం వెళ్లదీస్తున్నారు. అవకాశాలు ఏమీ లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారట. ఆర్థిక కష్టాలు తట్టుకోలేక ఇంటింటికీ వెళ్లి సబ్బులు అమ్ముకుంటున్నారట. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన  ఇంటర్వ్యూలో ఈ విషయాలు చెప్పారు ఐశ్వర్య. 


సూపర్‌స్టార్స్‌తో నటించి..ఇప్పుడు అవకాశాల్లేక..


మలయాళం సూపర్‌ స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి మూడు సినిమాల్లో నటించిన ఐశ్వర్య..1991లో ఒలియంపుకల్ చిత్రంతో తెరంగేట్రం చేశారు. తరువాత వరుస చిత్రాలు చేసినా మళ్లీ పెళ్లి తరవాత బ్రేక్ తీసుకున్నారు. 1994లో తన్వీర్ అహ్మద్‌ను పెళ్లాడారు. వ్యక్తిగత కారణాల వల్ల వీళ్లిద్దరూ విడిపోవాల్సి వచ్చింది. ఈ సమస్యల మధ్య ఆమె సినిమాలకు దూరమయ్యారు. 1999లో హౌజ్‌ఫుల్‌ అనే చిత్రంలో పార్థిబన్‌తో కలిసి కమ్‌బ్యాక్‌ ఇచ్చారు. అప్పటి నుంచి వరుసగా చిన్న చిన్న పాత్రలు చేస్తూ వచ్చారు ఐశ్వర్య. హీరోయిన్ ఛాన్స్‌లు రాకపోయినా చిన్నక్యారెక్టర్‌లకే పరిమితమయ్యారు. ఇప్పుడు ఆ అవకాశాలు కూడా రావటం లేదని ఆవేదన చెందుతున్నారు ఐశ్వర్య. ఇంట్లో పిల్లులను పోషించలేని స్థితిలో ఉన్నానని, అందుకే సబ్బులు అమ్ముకుంటున్నారని ఇంటర్వ్యూలో చెప్పారు. సీరియల్స్‌లో అయినా నటించేందుకు అవకాశాలు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. మల్టీ మమ్మీ పేరిట తనకో యూట్యూబ్ ఛానల్ ఉందని అందరూ సబ్‌స్క్రైబ్‌ చేసుకుని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తాను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఓ ఉద్యోగం అవసరమని, అందుకోసమే చాలా ప్రయత్నిస్తున్నానని అన్నారు. తనకు ఆరోగ్య పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని, ఆర్థికంగా నిలదొక్కుకుంటే చాలని అంటున్నారు ఐశ్వర్య. సినిమాల్లో నటించటం కన్నా,  సీరియల్స్‌లో వచ్చిన అవకాశాల వల్లే ఎంతో కొంత పేరు తెచ్చుకున్నానని, మళ్లీ బుల్లితెరకు పరిచయమవ్వాలనుందని అన్నారు. తన పరిస్థితుల్ని అర్థం చేసుకుని సీరియల్ డైరెక్టర్లు అవకాశాలు ఇవ్వాలనంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మరి ఈ ఇంటర్వ్యూ చూసిన తరవాతైనా ఇండస్ట్రీ వర్గాల నుంచి ఐశ్వర్యకు పిలుపు వస్తుందో రాదో  వేచి చూడాలి. 


Also Read: 'విరాట పర్వం' రివ్యూ: రానా, సాయి పల్లవి సినిమా ఎలా ఉందంటే?


Also Read: 'రెక్కీ' వెబ్ సిరీస్ రివ్యూ: కామకోరిక ఎంత దూరం తీసుకువెళుతుంది? ఏయే పనులు చేయిస్తుందంటే?