ఒక ప్రాణాన్ని నిలపాలంటే రక్తదానం చేయాలి. ఒక ప్రాణాన్ని సృష్టించాలంటే వీర్యదానం చేయాలి. ఇవి రెండూ ఇతరులకు మేలు చేసేవే. సంతాన సమస్యలతో కుమిలిపోయే జంటల కల నెరవేరాలంటే వీర్యదాత ఉండాల్సిందే. ఇప్పటికే ఇండియాలో చాలామంది వీర్యదానానికి ముందుకొస్తున్నారు. కొందరు స్వచ్ఛందంగా తమ వీర్యాన్ని దానిమిస్తుంటే, మరికొందరు వీర్యం దానాన్ని సంపదగా మార్చుకుంటున్నారు. అయితే, వీర్యదానం చేయడం చట్టబద్దమేనా? రూల్స్ ఏం చెబుతున్నాయి? వీర్యదానంతో ఎంతవరకు సంపాదించవచ్చు? ఇందుకు ఎవరిని సంప్రదించాలి?
వీర్యదానం లేదా స్పెర్మ్ డోనేషన్ అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం. ఇప్పటికే ఇండియాలో చాలాచోట్ల స్పెర్మ్ బ్యాంకులు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని సంస్థలు స్పెర్మ్ డొనేషన్ చేసేవారికి నగదు కూడా చెల్లిస్తున్నాయి. ఎందుకంటే, ఈ స్పెర్మ్ బ్యాంకులు.. వీర్యాన్ని అమ్మేందుకు భారీ మొత్తాన్ని వసూలు చేస్తున్నాయి. స్పెర్మ్ డొనేషన్ పూర్తిగా చట్టబద్ధం. కాబట్టి, ఎవరైనా సరే స్పెర్మ్ డోనర్ కావచ్చు. దాన్ని ఉద్యోగంగా కూడా ఎంచుకోవచ్చు.
స్పెర్మ్‌ను ఏం చేస్తారు?: దాత ఇచ్చే వీర్యాన్ని స్పెర్మ్ బ్యాంకులు ప్రత్యేక ఉష్ణోగ్రతల వద్ద స్టోర్ చేస్తాయి. పిల్లలు కావాలనుకొనే జంటకు ఆ వీర్యాన్ని దానమిస్తారు. ఆ స్పెర్మ్‌లోని శుక్రకణాలను మహిళ అండంలోకి ప్రవేశపెడతారు. ఫలితంగా ఆ మహిళ గర్భం దాల్చి, బిడ్డకు జన్మనిస్తుంది. అయితే, ఆ బిడ్డకు మీరు బయోలాజికల్‌గా తండ్రే. కానీ, హక్కుల పరంగా ఆ బిడ్డకు ఆ మహిళ భర్తే తండ్రి. అంటే పుట్టిన బిడ్డకు వారు మాత్రమే తల్లిదండ్రులవుతారు. ఒక్కసారి వీర్యాన్ని దానమిచ్చేసిన తర్వాత.. దానిపై దాతకు ఎలాంటి హక్కులు ఉండవు. ఇందుకు దాత నుంచి ముందుగానే ఒప్పందం చేసుకుంటారు. ఆ పుట్టిన బిడ్డతో దాతకు భవిష్యత్తులో ఎలాంటి సంబంధం ఉండదు.
అంతా రహస్యంగానే..: వీర్యదానం చేసేవారి పేర్లను స్పెర్మ్ బ్యాంక్‌లు గోప్యంగా ఉంచుతాయి. వీర్యదానం వల్ల పుట్టబోయే బిడ్డల భవిష్యత్తుకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఇది చాలా అవసరం. అంతేగాక, కొందరు బెదిరింపులకు పాల్పడే అవకాశాలు కూడా ఉండటంతో దీన్ని చాలా సీరియస్‌గా పరిగణిస్తారు. అందుకే, దాత వివరాలను గ్రహీతలకు గానీ, గ్రహీతల వివరాలను దాతలకు గానీ ఇవ్వరు. ప్రస్తుతం మన సమాజంలో వీర్యదానంపై సదాభిప్రాయం లేదు. వీర్యదానంతో పుట్టిన బిడ్డలను చిన్నచూపు చూసే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే, దీన్ని రహస్యంగా నిర్వహిస్తారు. కాబట్టి, మీరు వీర్యదానం చేసినట్లయితే మీ ఇంట్లోవారికి కూడా ఆ విషయం చెప్పకుండా గోప్యత పాటించాలి. అలాగే, వీర్యదానంతో డబ్బు సంపాదించేవారిని కూడా మన సమాజం స్వీకరించదు. దీన్ని తప్పుడు పనిగా భావిస్తారు.
స్పెర్మ్ డొనేషన్ ఎందుకు?: ఇటీవల సంతాన సమస్యలు బాగా పెరిగాయి. చాలామంది పురుషుల్లో వీర్య నాణ్యత సమస్యతో బాధపడుతున్నారు. ఫలితంగా పిల్లలు పుట్టడం కష్టంగా మారింది. అలాంటివారికి ‘స్పెర్మ్’ ఎంతో అసవరం. ఇండియాలో చాలామంది పురుషులు తమ స్పెర్మ్ నాణ్యత, స్పెర్మ్ కౌంట్‌ను పెంచుకోవడం కోసం నిల్ స్పెర్మ్ కౌంట్ చికిత్సను పొందుతున్నారు. కొందరు మాత్రం దాత స్పెర్మ్‌ను ఉపయోగించి IVF, IUI విధానంలో గర్భం దాల్చుతున్నారు. కొందరు అవివాహిత మహిళలు కూడా పురుషుల ప్రమేయం లేకుండా గర్భం దాల్చేందుకు స్పెర్మ్ డోనర్స్, IVF చికిత్సలను ఎంచుకుంటున్నారు. కొందరు లెస్పియన్ కూడా ఈ విధానంలో పిల్లలు కంటున్నారు.
వీర్యదానం చేయడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి?: వీర్యదానం చేయాలంటే ఈ కింది షరతులు వర్తిస్తాయి. కాబట్టి, ప్రతి ఒక్కరూ వీర్యదాతలు కాలేరు.
⦿ కొన్ని క్లినిక్‌లు దాతల ఎత్తు, బరువు, చర్మం రంగు, శారీరక సౌష్టవాన్ని పరిగణలోకి తీసుకుంటాయి.
⦿ వీర్యాన్ని స్వీకరించి గర్భం దాల్చేవారి వివరాలను అడగకూడదు. వీర్య గ్రహీతలను దాత కలవకూడదు.
⦿ వీర్యదానం ప్రక్రియ మొత్తాన్ని గోప్యంగా ఉంచాలి. అలా ఉంటేనే దాత నుంచి తరచుగా వీర్యాన్ని స్వీకరిస్తారు.
⦿ వీర్యదానం చేయడానికి సిద్ధమయ్యే వ్యక్తిలో వీర్యం నాణ్యంగా ఉండాలి. స్పెర్మ్ కౌంట్ (శుక్రకణాల సంఖ్య) ఎక్కువగా ఉండాలి.
⦿ దాతకు ఎలాంటి వ్యాధులు ఉండకూడదు. దాత ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ కూడా బాగుండాలి.
⦿ దాత వయస్సు తప్పనిసరిగా 21 నుంచి 41 ఏళ్లు లోపు ఉండాలి.
ఎంత చెల్లిస్తారు?: కొన్ని సంస్థలు దాత ఆరోగ్యం, శరీర సౌష్టవం, రూపురేఖలు ఆధారంగా డబ్బులను చెల్లిస్తుంటాయి. ఒక వీర్యదాతకు సుమారు రూ.2 వేలు నుంచి రూ.5 వేలు వరకు చెల్లిస్తున్నారు. అలా ఎన్నిసార్లు వీర్యాన్ని ఇస్తే అన్నిసార్లు చెల్లిస్తారు. బాగా చదువుకున్న వ్యక్తులు, క్రీడాకారులు, ప్రముఖులకైతే ఇంకా ఎక్కువ డబ్బును చెల్లిస్తున్నారు. చిన్న సీసా వీర్యాన్ని ఒక ఇన్-విట్రో పెర్టిలైజేషన్(IVF)కు ఉపయోగిస్తారు. ఈ వీర్యాన్ని స్వీకరించే మహిళ గర్భం దాల్చాలంటే కనీసం రెండు నుంచి మూడుస్లారు ఆ ప్రక్రియను చేయాలి. అంటే, ఒక దాత నుంచి సుమారు 2 నుంచి 3 సార్లు వీర్యాన్ని స్వీకరిస్తారు. ప్రస్తుతం ఆరోగ్యకరమైన వీర్యానికి భారీ డిమాండ్ ఉంది. కాబట్టి, ఈ విలువ రూ.10 వేలకు పెరిగే అవకాశాలు ఉన్నాయట. కాబట్టి, మీ లక్ బాగుంటే.. చేతినిండా డబ్బే!
గమనిక: ఈ కథనాన్ని కేవలం మీ అవగాహన కోసమే అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదు.
Also Read: ఇట్స్ బాయ్ థింగ్, అబ్బాయిలూ ఉదయాన్నే అలా జరక్కపోతే, త్వరగా చచ్చిపోతారట!
Also Read: కారులో సెక్స్ చేసిన మహిళకు రూ.40 కోట్లు పరిహారం, ఇదెక్కడి విడ్డూరం!