Serious Health Risks of Period Delay Medicines : పెళ్లిళ్లు, ట్రిప్స్, పరీక్షలు ఇలా ప్రత్యేక సందర్భాలు వచ్చినప్పుడు చాలామంది అమ్మాయిలు, మహిళలు పీరియడ్స్‌ను ముందుకు లేదా వెనక్కి మార్చుకునేందుకు మెడిసిన్స్ వాడుతారు. సాధారణంగా ఇందుకోసం ప్రొజెస్టెరోన్ టాబ్లెట్లు ఉపయోగిస్తారు. అయితే వీటిని డాక్టర్ సలహా లేకుండా వాడితే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని గైనకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
రీసెంట్గా ఓ అమ్మాయి పీరియడ్స్ ఆలస్యం చేసుకునేందుకు ట్యాబ్లెట్స్ వేసుకుని ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో పీరియడ్స్ డిలే అయ్యేందుకు వేసుకునే ట్యాబ్లెట్స్‌పై మరోసారి చర్చ మొదలైంది. దీనిపై క్లారిటి ఇస్తూ ఈ మాత్రలు వేసుకోవడం పలు సూచనలు చేశారు డాక్టర్ శిరీష. ఆస్టర్ ప్రైమ్ హాస్పిటల్లో ఆబ్స్టెట్రిక్స్, గైనకాలజి కన్సల్టెంట్‌గా చేస్తోన్న శిరీష పీరియడ్స్ రాకుండా చేసే మాత్రలు సేఫేనా? ఎప్పుడు ప్రమాదకరం? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో తెలిపారు. అవేంటంటే..
పీరియడ్స్ మార్చే మాత్రలు ఎప్పుడు సేఫ్?
డాక్టర్ శిరీష ప్రకారం పీరియడ్స్ మార్చే మాత్రలు కేవలం గైనకాలజిస్ట్ సూచించినప్పుడు మాత్రమే వాడాలి. అలాగే అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే తీసుకోవాలి. సాధారణంగా 3 నుంచి 5 రోజుల వరకు మాత్రమే వీటిని వాడటం సురక్షితం. అలాగే మందులు ఆపిన తర్వాత వారం రోజుల్లో పీరియడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఎవరికి ప్రమాదమో తెలుసా?
ఈ మెడిసన్స్ నేరుగా మెడికల్ షాప్‌లో కొనుగోలు చేసి వాడటం మంచిది కాదు. కానీ వీటిని వారం రోజుల కంటే ఎక్కువగా వాడితే ప్రమాదం. అలాగే రెగ్యులర్‌గా వాడటం.. డాక్టర్ సలహా లేకుండా డోస్ మార్చడం మంచిది కాదు.
సైడ్ ఎఫెక్ట్స్ ఇవే..
పీరియడ్ డేట్స్ మార్చే మాత్రలు వాడితే కొందరిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాంటి వాటిలో వికారం, తలనొప్పి, రొమ్ముల్లో నొప్పి లేదా మరింత స్మూత్‌గా మారడం, పొట్ట ఉబ్బరం, పీరియడ్స్ సైకిల్ డిస్టర్బ్ అవ్వడం వంటివి జరుగుతాయి. అలాగే మూడ్ స్వింగ్స్, ఒక్కసారిగా బ్లీడింగ్ ఎక్కువ అవడం, నిద్ర సమస్యలు వస్తాయి.
అలాగే కాళ్లలో నొప్పి లేదా వాపు, ఛాతిలో తీవ్రమైన నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన తలనొప్పి, శరీరం మొద్దుబారడం, చూపు మసకబారడం లేదా డబుల్ విజన్, మాట్లాడటంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త తీసుకోవాలని, వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు శిరీష. అలాగే ఈ మాత్రలను తప్పుగా, ఎక్కువగా వాడితే రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంది. డీప్ వెయిన్ థ్రాంబోసిస్, బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్స్, స్ట్రోక్, ప్రాణాపాయం కూడా కలగవచ్చు. కాబట్టి వీటిని లైట్ తీసుకోవద్దని చెప్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వీలైతే పీరియడ్స్‌ను సహజంగానే రావనివ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. అవసరం ఉన్నప్పుడే డాక్టర్ పర్యవేక్షణలో వాడాలి. అలాగే శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదని చెప్తున్నారు.
సమ్మర్ స్పెషల్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
