Panic Attack Causes and Precautions : నేటి అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా చాలామంది అధిక ఒత్తిడికి లోనవుతున్నారు. పని ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, సోషల్ మీడియా, ఆర్థిక సమస్యలు.. ఇలా అన్నీ మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి. దీని ఫలితంగా చాలా మంది పానిక్ అటాక్స్ వంటి మానసిక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పానిక్ అటాక్స్ లైట్ తీసుకోకూడదని.. ఎందుకంటే ఇవి కొన్నిసార్లు ప్రాణాంతకం కావచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
పానిక్ అటాక్స్‌ని ముందుగానే గుర్తించి.. సరైన చర్యలు తీసుకుంటే సమస్యను నియంత్రించవచ్చని చెప్తున్నారు. కాబట్టి ఈ సమస్యపై అవగాహన చాలా అవసరం. అసలు పానిక్ అటాక్స్ అంటే ఏమిటి? దీనిని ఎలా ఎదుర్కోవాలి? సమస్యను దూరం చేసుకోవడానికి ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో చూసేద్దాం.
పానిక్ అటాక్స్ అంటే..
పానిక్ అటాక్ అంటే అకస్మాత్తుగా కలిగే భయం లేదా ఆందోళనగా చెప్పవచ్చు. ఈ సమయంలో.. బాధితుడిలో ఏదో జరగబోతోందనే భయం కలుగుతుంది. ఈ భయం భయంకరమైన స్థాయిలో ఉంటుంది. దీనివల్ల గుండె వేగంగా కొట్టుకోవడం, ఆయాసం, చెమటలు పట్టడం, చేతులు, కాళ్లు మొద్దుబారడం లేదా తిమ్మిరిగా అనిపించడం వంటివి జరుగుతాయి.
పానిక్ అటాక్ లక్షణాలు..
పానిక్ అటాక్‌లో హృదయ స్పందన లేదా ఆందోళన, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఊపిరాడకపోవడం, చెమట పట్టడం లేదా వణకడం, ఛాతీ నొప్పి లేదా అసౌకర్యం, తల తిరగడం లేదా స్పృహ కోల్పోతున్నట్లు అనిపించడం, చేతులు, కాళ్లలో తిమ్మిరి లేదా జలదరింపు, శరీరం తన నుంచి తాను వేరుపడినట్లు అనిపించడం, చనిపోతానేమోనన్న భయం లేదా నియంత్రణ కోల్పోతానేమోనన్న భయం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
పానిక్ అటాక్స్కి కారణాలు..
ఒత్తిడి, మానసిక సమస్యలు, PTSD లేదా ఫోబియాల వంటి మానసిక ఆరోగ్య సమస్యలు, థైరాయిడ్, గుండె సమస్యలు లేదా హార్మోన్ల అసమతుల్యత, కెఫీన్, మద్యం, మాదకద్రవ్యాలు వంటి వాటి వల్ల పానిక్ అటాక్స్ ఎక్కువగా జరుగుతాయి. అలాగే కుటుంబంలో పానిక్ డిజార్డర్ సమస్య ఉన్నా కూడా పానిక్ అటాక్స్ ఎదుర్కోవాల్సి రావచ్చు.
4-4-4-4 బాక్స్ బ్రీతింగ్ టెక్నిక్..
పానిక్ అటాక్‌లను ఎదుర్కోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని పాటిస్తూ ఉంటే.. వాటిని నియంత్రించవచ్చని చెప్తున్నారు నిపుణులు. వాటిలో 4-4-4-4 బాక్స్ బ్రీతింగ్ అనే శ్వాస వ్యాయామం ఒకటి. దీనిలో భాగంగా 4 సెకన్ల పాటు శ్వాస లోపలికి పీల్చి, 4 సెకన్ల పాటు బిగపట్టి, 4 సెకన్ల పాటు శ్వాసను బయటకు వదిలి.. మళ్లీ 4 సెకన్ల పాటు బిగపట్టండి.
5-4-3-2-1 టెక్నిక్..
పానిక్ అటాక్‌ని తగ్గించడంలో 5-4-3-2-1 టెక్నిక్ బాగా హెల్ప్ చేస్తుంది. దీనిలో భాగంగా 5 వస్తువులను చూడండి. 4 వస్తువులను తాకండి. 3 శబ్దాలను వినండి. 2 వాసనలను పీల్చండి. 1 టేస్ట్ చూడండి. అలాగే ఇది కేవలం ఒక పానిక్ అటాక్ మాత్రమే.. ఇది తగ్గిపోతుందని మీకు మీరు చెప్పుకోండి. కెఫీన్, ఆల్కహాల్‌కు దూరంగా ఉండండి. క్రమం ధ్యానం చేస్తే కలిగే లాభం ఉంటుంది.
వైద్య సహాయం ఎప్పుడు తీసుకోవాలంటే..
భయాందోళనలు పదేపదే వస్తుంటే లేదా మీ దినచర్యకు ఆటంకం కలిగిస్తుంటే.. వైద్య సహాయం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT) మీ ఆలోచనా విధానాలను మార్చడం ద్వారా ఈ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. వైద్యుడు ఆందోళన తగ్గించడానికి నివారణ లేదా యాంటీ-డిప్రెసెంట్ మందులను సూచించవచ్చు. మానసిక ఆరోగ్య నిపుణుడిని సంప్రదించడం ద్వారా లక్షణాలను సరిగ్గా గుర్తించి, చికిత్స చేయడానికి వీలవుతుంది.
లైఫ్స్టైల్లో చేయాల్సిన మార్పులు
భయాందోళనలను నివారించడానికి, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి.. ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయండి. 7 నుంచి 8 గంటల పాటు తగినంత నిద్ర పొందండి. సోషల్ మీడియా, స్క్రీన్ సమయాన్ని పరిమితం చేసుకోండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ.. ఒత్తిడిని తగ్గించుకోవడానికి పెయింటింగ్, సంగీతం లేదా పుస్తక పఠనం వంటివి స్టార్ట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి.
గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.
