సాధారణ జిలేబితో పోలిస్తే పనీర్‌తో చేసే జిలేబి చాలా రుచిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిదే. సాధారణ జిలేబీలో అధికంగా మైదా ఉంటుంది. కానీ పనీర్ జిలేబీలో పనీర్ ఉంటుంది.కాబట్టి ఈ జిలేబి తినడం వల్ల ప్రొటీన్, కాల్షియం పుష్కలంగా అందుతుంది.  పనీర్ లో మంచి కొవ్వు ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి అవసరం. పనీర్ తినడం వల్ల రొమ్ము, పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం తగ్గిపోతుంది. ఇది తినడం వల్ల దంతాల సమస్యలు, కీళ్ల నొప్పులు రాకుండా ఉంటాయి. ఎముకలు గట్టిగా మారతాయి. కాబట్టి పిల్లలకు తరచూ పనీర్ జిలేబి తినిపిస్తే మంచిది.


కావాల్సిన పదార్థాలు 
పనీర్ తురుము - పావు కిలో 
పంచదార - ఒక కప్పు 
కార్న్ పౌడర్ - పావు కప్పు 
కుంకుమ పువ్వు - రెండు రేకులు 
యాలకుల పొడి - పావు స్పూను 
నెయ్యి - సరిపడా 
బేకింగ్ సోడా - అర స్పూను 
పిస్తా, జీడిపప్పు - గుప్పెడు 
గోధుమపిండి - రెండు స్పూన్లు


తయారీ ఇలా
ఒక గిన్నెలో కార్న్ పొడి, గోధుమపిండి, బేకింగ్ సోడా వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని పల్చగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. ఆ మిశ్రమంలోనే పనీర్ తురుమును కూడా వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని ఒకసారి మిక్సీ పడితే అది పేస్టులా అయిపోతుంది. దాన్ని జిలేబిలా వేయడానికి వీలుగా ఒక కవర్లో వేయాలి. ఆ కవర్ చివరన చిన్న రంధ్రం పెట్టాలి. స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి వీలుగా నెయ్యి వేయాలి. పనీర్ జిలేబిని నేతిలోనే వేయిస్తారు. నెయ్యిలో కవర్‌ను కోన్‌లా చేసి జిలేబిలా వేసుకోవాలి. వాటిని రంగు మారేవరకు దోరగా వేయించాలి. మరో పక్క స్టవ్ మీద పంచదార, యాలకుల పొడి, నీళ్లు, కుంకుమపువ్వు వేసి లేత పాకాన్ని తీయాలి. నెయ్యిలో ఫ్రై అయిన జిలేబిలను తీసి ఆ పాకం గిన్నెలో వేయాలి. తరువాత తీసి ప్లేట్లో వేసుకోవాలి. పైన పిస్తా, జీడిపప్పు ముక్కలను తురిమి చల్లాలి. అంతే పనీర్ జిలేబి రెడీ అయినట్టే. సాధారణ జిలేబితో పోలిస్తే చాలా టేస్ట్ గా ఉంటుంది. సాధారణ జిలేబి కాస్త సన్నగా ఉంటే ఇది మందంగా ఉంటుంది. పనీర్ తురుము కోన్‌లోంచి జారాలి కాబట్టి కాస్త పెద్ద రంధ్రమే పెట్టుకోవాలి. 


పనీర్‌లో గుండె సంబంధిత ఆరోగ్యాన్నిచ్చే పోషకాలు ఉంటాయి. ఒమెగా 3, ఒమెగా 6 ఫ్యాటీ ఆమ్లాలు ఉంటాయి. ఇవి రుమటాయిడ్ ఆర్ధరైటిస్ వంటివి రాకుండా ఉంటాయి. దీనిలో పీచు అధికంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. పనీర్ తింటే త్వరగా పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి పనీర్ తింటూ బరువు తగ్గవచ్చు. మహిళలు పనీర్ అధికంగా తింటే మంచిది. ముఖ్యంగా మెనోపాజ్ దశకు దగ్గరలో ఉన్న మహిళలు చిరాకు, ఒత్తిడి రాకుండా ఉంటాయి.  పిల్లలకు కూడా పనీర్ జిలేబి తింటే మంచే జరుగుతుంది. 


Also read: స్మోకింగ్ కన్నా ఎక్కువ గంటలు కూర్చుని పనిచేసే ఉద్యోగమే డేంజర్



Also read: యాంటీబయోటిక్స్ ఎడాపెడా వాడుతున్నారా? చాలా ప్రమాదకరం.