యాంటీబయోటిక్స్ ఎప్పుడు వాడాలి? దీనిపై మన దేశంలో అవగాహన చాలా తక్కువగా ఉంది. అందుకే వీటిని ఎప్పుడు పడితే అప్పుడు వాడే దేశాల్లో మనది అగ్రస్థానంలో ఉంది. జనాభా అధికంగా ఉండడం, పేదరికం, అవగాహన లేకపోవడం, నిరక్షరాస్యత ఇవన్నీ కూడా ఇలా యాంటీబయోటిక్స్ ను నచ్చినట్టు వాడే పరిస్థితికి కారణం అవుతున్నాయి. ఎవరూ నమ్మని విషయం ఏమిటంటే ప్రపంచం మొత్తం మీద ఎయిడ్స్, మలేరియా వంటి రోగాల కన్నా యాంటీబయోటిక్స్ వాడి మరణిస్తున్న వారి సంఖ్య అధికంగా ఉంది.


ప్రపంచ దేశాల్లో యాంటీబయోటిక్స్‌ను అధికంగా వాడుతున్న దేశాల్లో మనదే మొదటి స్థానం. వీటిని వాడే పద్ధతి కూడా మన జనాభాకు సరిగా అవగాహన లేదు. అంతేకాదు యాంటీబయోటిక్స్ ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం కూడా మనదే. అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దుకాణాల్లో యాంటీబయోటిక్స్ ను అడ్డదిడ్డంగా అమ్మేది కూడా మనమే. అందుకే ఆరోగ్య నష్టాలు మన జనాభాలోనే అధికంగా ఉన్నాయి. అవసరం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు యాంటీబయోటిక్స్ వాడడం వల్ల మన శరీరంలో చాలా మార్పులు వస్తాయి. సాధారణ మందులకు లొంగాల్సిన బాక్టీరియా కూడా మన శరీరంలో జన్యు పరిణామాలకు లోనై శక్తివంతంగా తయారవుతుంది. యాంటీబయోటిక్స్ ను తట్టుకునే శక్తిని సంపాదించుకుంటోంది. దీనివల్ల సాధారణ యాంటీబయోటిక్స్‌కు రోగాలు తగ్గవు. మరింత శక్తివంతమైన యాంటీబయోటిక్స్ వాడాల్సి వస్తుంది. ఇలా వాడడం వల్ల శరీరం చాలా నీరసపడిపోతుంది. అవయవాలు నీరసపడతాయి.


యాంటీబయోటిక్సు కూడా తట్టుకునే శక్తి గల బ్యాక్టీరియాలను సూపర్ బగ్స్ అంటారు. మనం ఎడాపెడా యాంటీబయోటిక్స్ వాడడం వల్ల మన శరీరంలో ఈ సూపర్ బగ్స్ జీవించే అవకాశం ఉంది. సాధారణ బ్యాక్టీరియానే మనం వాడే యాంటీబయోటిక్స్ తట్టుకొని నిలిచే సూపర్ బగ్స్ గా రూపాంతరం చెందుతున్నాయి.  ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు సాధారణ ఔషధాలకు ఈ సూపర్ బగ్స్ లొంగవు. యాంటీ బ్యాక్టీరియా మందులకు కూడా లొంగవు. వాటికోసం మరింత శక్తివంతమైన ఖరీదైన మందులు వాడాల్సి వస్తుంది. అవన్నీ కూడా శరీరానికి హాని కలిగిస్తాయి. ప్రస్తుతం ఐసీయూలో చేరుతున్న ప్రతి పది మంది రోగుల్లో నలుగురికి ఈ యాంటీ బ్యాక్టీరియల్ రెసిస్టెన్స్ ఉన్నట్టు గుర్తించారు వైద్యులు.


శక్తివంతమైన యాంటీ బయోటిక్ మందులను ఎక్కువ కాలం వాడితే కాలేయం, కిడ్నీ వంటి అవయవాలు త్వరగా దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే వైద్యులకు సూచన మేరకే యాంటీబయోటిక్స్ వాడాలి. కానీ తెలుసు కదా అని నచ్చినట్టు యాంటీ బయోటిక్స్ మందులను మింగడం మంచి పద్ధతి కాదు. 


Also read: పిల్లలకు చదివింది గుర్తుండాలంటే వారి జ్ఞాపకశక్తిని పెంచే ఈ ఆహారాలు ఇవ్వండి




















గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.