పాలకూర వండాక వచ్చే వాసన చాలా మందికి నచ్చదు. ముఖ్యంగా పిల్లలకి. అందుకే ఇలా పాలకూర పులావ్ చేస్తే పిల్లలే కాదు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చల్లని వాతావరణంలో వేడివేడి పాలకూర్ పులావ్ భలే రుచిగా ఉంటుంది. రైతా తోడుగా దీన్ని తింటే టేస్టీగా ఉంటుంది.  


కావాల్సిన పదార్థాలు
పాలకూర తరుగు - ఒక కప్పు
క్యారెట్ తరుగు - పావు కప్పు
ఉల్లిపాయ - ఒకటి (నిలువుగా తరిగినవి)
పచ్చిమిర్చి - నాలుగు (నిలువుగా కోయాలి)
టమోటా - అరకప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు - ఒక టీస్పూన్
పులావ్ ఆకు - రెండు
బియ్యం - రెండు కప్పులు 
నూనె - తగినంత
నెయ్యి - ఒక టీస్పూన్
దాల్చిన చెక్క - ఒక ముక్క
పులావ్ ఆకు - రెండు 
యాలకులు - రెండు
లవంగాలు - మూడు 
స్టార్ అనిస్ - ఒకటి
పసుపు - ఒక టీస్పూను
నీరు - సరిపడినంత
ధనియాల పొడి - ఒక టీస్పూను


తయారుచేయు విధానం
1. పాలకూర తరుగును బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. 
2. స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో పాలకూర తరుగు, ఉప్పు, పసుపు వేసి వేయించాలి. 
3. ఆకుల్లోని నీరు దిగి, అది ఇంకే వరకు వేయించాలి. నీరు ఇంకిపోయాక స్టవ్ కట్టేసి చల్లార్చాలి. మిక్సీలో వేసి మెత్తగా పేస్టు చేసుకోవాలి. 
4. ఇప్పుడు స్టవ్ మీద పులావ్ వండే గిన్నెను పెట్టుకోవాలి. నూనె వేసి, వేడి అయ్యాక పులావ్ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, స్టార్ అనిస్ వేసి వేయించాలి. 
5. మసాలా దినుసులు వేగాక ఉల్లిపాయ తరుగు వేసి కాసేపు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్టు కూడా యాడ్ చేయాలి. కాస్త పసుపు, ధనియాల పొడి కూడా వేసి కలపాలి.
6. అవి వేగాక పచ్చిమిర్చి, టమోటా ముక్కలు వేయాలి. టమోటా మెత్తగా మగ్గాక క్యారెట్ ముక్కలు వేయాలి. పదినిమిసాల పాటూ చిన్నమంటపై వేయించాలి. 
7. ఇప్పుడు పాలకూర పేస్టును కూడా వేసి కలపాలి. 
8. బియ్యం కడిగి వేసి, తగినంత నీళ్లు పోయాలి. సగం ఉడికాక అన్నంపై నెయ్యిని వేయాలి. మంచి సువాసన వస్తుంది. 
9. అన్నం ఉడికాక ఆపేయాలి. ఈ పాలకూర పులావ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యం కూడా. పిల్లలకు పెట్టాలనుకుంటే మసాలా దినసులు తగ్గించుకోవాలి. 


Also read: పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల డయాబెటిస్ వచ్చే ఛాన్స్


Also read: దేశీ వైన్... చలికాలంలో తాగితే శరీరానికి వెచ్చదనం, ఆరోగ్యం కూడా


Also read: చలికాలంలో వెచ్చదనాన్ని ఇచ్చే బీట్‌రూట్ కొబ్బరి పాల సూప్... తాగితే రక్తహీనత దరిచేరదు












ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌  చేయండి.