Painkillers: నొప్పి నివారణ మందులు లేక పెయిన్ కిల్లర్స్... వీటిని వాడే వారి సంఖ్య అధికంగానే ఉంది. వెన్ను నొప్పి వచ్చినా, కాళ్ళు నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా ముందుగా వేసుకునేది పెయిన్ కిల్లర్స్‌నే. అయితే పెయిన్ కిల్లర్స్‌ను ఇలా అధికంగా వాడడం అనేది మంచి పద్ధతి కాదు. ఇలా నొప్పి నివారణ మందులను వాడడం వల్ల ఆరోగ్యం పై దీర్ఘకాలంలో ప్రభావం పడుతుందని చెబుతున్నారు. పెయిన్ కిల్లర్లు రెండు రకాలు. ఒకటి పారాసిటమాల్ ఆధారంగా తయారైనవి. ఇక మిగతావి నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు.
ఇవి చాలా సులభంగా అందుబాటులో దొరుకుతున్నాయి. అందుకే వీటిని వాడే వారి సంఖ్య పెరిగిపోతుంది. వైద్యులు చెబుతున్న ప్రకారం మూడు నుంచి నాలుగు నెలల పాటు రోజుకు ఒక గ్రాము కన్నా ఎక్కువ పారాసిటమాల్ పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల తీవ్రమైన కాలేయ సమస్యలు, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఒక గ్రాము పారాసిటమాల్ తీసుకోవడం వల్ల ఆ ప్రభావం నేరుగా కాలేయంపైనా, మూత్రపిండాలపైనా పడుతుంది. ఒక గ్రాము పారాసిటమాల్ పెయిన్ కిల్లర్ , నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులు చేసేంత హానిని కలిగించవు. కానీ దీనిని కూడా ఎక్కువ కాలం పాటు తీసుకోకూడదు.
ఇక నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ ఎక్కువగా తీసుకుంటే... కాలేయానికి గాయం కావడం, పొట్టలో పుండ్లు ఏర్పడడం, గ్యాస్ట్రిక్, అల్సర్లు రావడం, మూత్రపిండాలు తీవ్రంగా నష్టపోవడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే ఇవి మీ అన్నవాహిక దిగువ భాగాన్ని చీల్చే అవకాశం ఉంది. ఈ మందులు రెండు వారాల కంటే ఎక్కువ కాలం పాటు తీసుకుంటే మూత్రపిండాలు శాశ్వతంగా నష్టపోవచ్చు. కాలేయం ఉండే భాగంలో నొప్పి వస్తుంది. కాలేయం సరిగాప పనిచేయకపోవడం వల్ల కాలేయం విడుదల చేసే ఎంజైమ్స్, బిలిరుబిన్ పెరుగుతాయి. కాలేయ పనితీరు తగ్గడం వల్ల రక్తం గడ్డకట్టే సమస్య పెరుగుతుంది. కాలేయం రక్తం గడ్డకట్టే కారకాన్ని అధికంగా విడుదల చేస్తుంది. దీనివల్ల రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది.
మూత్రపిండాల పనితీరు దెబ్బతిన్నట్లయితే మీకు సాధారణం కంటే చాలా తక్కువ మొత్తంలో మూత్రాన్ని ఉత్పత్తి చేస్తారు. ఇది ఎంతో సమస్యగా మారుతుంది. శ్వాస ఆడక పోవడం, నడుస్తున్నప్పుడు ఊపిరి తీసుకోవడానికి కష్టపడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పొట్టలో నొప్పి అసౌకర్యంగా కూడా అనిపిస్తుంది. తీవ్రమైన దగ్గు వేధిస్తుంది. దగ్గినప్పుడు రక్తం కూడా పడవచ్చు. అలాగే రక్తపు వాంతులు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్య సహాయం తీసుకోవాలి. పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు పడితే అప్పుడు నచ్చినట్టు వాడకూడదు.
Also read: డయాబెటిస్ ఉన్నవారికి ఔషధం పనస పిండి - బియ్యం, గోధుమలకు బదులు దీన్ని వాడండి