Ovarian Cancer Prevention : మహిళల్లో ఎక్కువగా వచ్చే క్యాన్సర్​లలో అండాశయ క్యాన్సర్ ఒకటి. ఇది అండాశయాలలో లేదా వాటి చుట్టూ ఉన్న కణాలలో మొదలవుతుంది. దీని లక్షణాలు చాలా మైల్డ్​గా ఉంటాయి కాబట్టి త్వరగా గుర్తించడం కష్టమవుతుంది. లక్షణాలు బయటపడేసరికి ఆలస్యమైపోతుంది. కాబట్టి ఈ క్యాన్సర్ రాకుండా ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. లైఫ్​స్టైల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఇంతకీ ఆ మార్పులు ఏంటి? వాటితో కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.

బరువు 

ఒబెసిటీ శరీరంలో ఈస్ట్రోజెన్ లెవెల్స్ పెంచుతుంది. దీనివల్ల అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్​గా వ్యాయామం చేస్తూ.. ఆరోగ్యాన్ని అందించే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ బరువును అదుపులో ఉంచుకోవాలి. 

యాంటీఇన్​ఫ్లమేటరీ ఫుడ్

మీరు తినే ఫుడ్​లో యాంటీఇన్​ఫ్లమేటరీ ఫుడ్ ఉండేలా చూసుకోవాలి. కాబట్టి దానికోసం పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు, ఒమేగా ఫ్యాటీ 3 ఉండే హెల్తీ ఫ్యాట్స్ డైట్​లో చేర్చుకోవాలి. ప్రాసెస్ చేసిన ఫుడ్స్​, చక్కెర ఎక్కువగా ఉండే స్నాక్స్, డీప్ ఫ్రై చేసి ఆహారాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. 

వ్యాయామం

రోజుకు కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. జిమ్​కి వెళ్లకున్నా వాకింగ్, యోగా వంటివి చేస్తూ ఉండాలి. వారానికి 5 సార్లు ఈ యాక్టివిటీలు చేస్తూ ఉండండి. దీనివల్ల ఇమ్యూనిటీ పెరగడంతో పాటు హార్మోన్స్ కంట్రోల్​లో ఉంటాయి. బరువు కూడా అదుపులో ఉంటుంది. 

హార్మోనల్ సమస్యలు 

హార్మోనల్ సమస్యలను పెంచే వాటి జోలికి వెళ్లకూడదు. బర్త్ కంట్రోల్ పిల్స్ లేదా హార్మోన్ థెరపీ అనేది నిపుణుల హయాంలోనే జరిగేలా చూసుకోవాలి. లేదంటే ఇవి హార్మోనల్ సమస్యలను పెంచుతాయి. పీరియడ్స్ రెగ్యులర్​గా త్వరగా రావడం లేదా మోనోపాజ్ సమయంలో ఈ అండాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ కాబట్టి నిరంతరం వైద్యుల సలహాలు తీసుకుంటే మంచిది. 

ఆల్కహాల్, స్మోకింగ్

పొగతాగడం, మద్యం సేవించండం వల్ల శరీరంలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరుగుతుంది. ఇది క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. కాబట్టి వాటిని వీలైనంత త్వరగా మానేస్తే మంచిది. ధూమపానం మానేయడం వల్ల పునరుత్పత్తి ఆరోగ్యం మెరుగవుతుంది. లేదంటే ప్రెగ్నెంట్ అవ్వడం కష్టమవుతుంది.

కుటుంబ చరిత్ర

మీ ఫ్యామిలీలో ఎవరికైనా అండాశయ లేదా బ్రెస్ట్​ క్యాన్సర్ ఉంటే మీకు కూడా అవి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. BRCA జన్యుపరమైన మ్యూటేషన్స్ క్యానర్స్ ప్రమాదాన్ని పెంచుతాయి కాబట్టి రెగ్యులర్​గా చెకప్స్ చేయించుకోవాలి.

ఒత్తిడి 

ఒత్తిడిని తగ్గించుకోవాడనికి ట్రై చేయండి. ఎందుకంటే స్ట్రెస్ లెవెల్స్ పెరిగినప్పుడు రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. కాబట్టి యోగా, మెడిటేషన్ వంటివి రెగ్యులర్​గా చేయాలి. అలాగే నాణ్యమైన నిద్ర కూడా ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇవన్నీ హార్మోనల్  సమస్యలు రాకుండా కూడా హెల్ప్ చేస్తాయి. 

హెల్త్ చెకప్స్ రెగ్యులర్​గా చేయించుకుంటూ.. శరీరానికి కావాల్సిన సప్లిమెంట్స్ అందిస్తూ.. గ్రీన్​ వంటి వాటిని రొటీన్​లో చేర్చుకుంటే అండాశయ క్యాన్సర్ మాత్రమే కాదు ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే మీ హెల్త్ విషయంలో ఏదైనా డౌట్ కలిగితే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.