రాయలసీమలో ఏ ఇంటికి వెళ్లినా ఒట్టి తునకలు కచ్చితంగా ఉంటాయి. ఒట్టి తునకలు అంటే చికెన్ లేదా మటన్ తో తయారుచేసే ఒరుగులు. వీటిని ఒకసారి చేసి పెట్టుకుంటే నచ్చినప్పుడల్లా కూర వండుకోవచ్చు. వడియాల్లా వీటిని ఒక డబ్బాలో వేసి దాచుకోవచ్చు. చికెన్ లేదా మటన్లో అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, మసాలా వేసి బాగా కలపాలి. తరువాత వాటిని ఎండలో ఎండబెట్టాలి. అవి గిన్నెలో వేస్తే గలగలలాడేలా శబ్దం వచ్చేలా ఉంటాయి. అప్పుడు వాటిని దాచుకుంటే ఏడాదంతా వండుకోవచ్చు. వీటిలో కూర ఎలా వండాలో తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు
ఒట్టితునకలు - ఒక కప్పు
ఉల్లిపాయ - ఒకటి
పచ్చిమిర్చి - మూడు
అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు
కారం - ఒక స్పూను
పసుపు - పావు స్పూను
కొత్తిమీర - అర కట్ట
గరం మసాలా - ఒక స్పూను
టొమాటో - ఒకటి
లవంగాలు - రెండు
దాల్చిన చెక్క - చిన్న ముక్క


తయారీ ఇలా 
ఒక గిన్నెలో నీళ్లు వేసి బాగా వేడి చేయాలి. నీళ్లు బాగా వేడెక్కాక ఆ నీటిలో ఒట్టి తునకలు వేసి నానబెట్టాలి. కాసేపటికి అవి మెత్తగా అవుతాయి. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక లవంగాలు, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ తరుగు వేసి బాగా వేయించాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు వేసి కలపాలి. టొమాటో తరుగు కూడా వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమంలో పసుపు, కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ముందుగా నీళ్లలో నానబెట్టుకున్న ఒట్టి తునకలు వేసి బాగా కలపాలి. కాస్త నీళ్లు పోసి మూత పెట్టి ఉడికించాలి. చివర్లో గరం మసాలా పొడి వేసి కలపాలి. దించడానికి అయిదు నిమిషాల ముందు కొత్తిమీర చల్లుకోవాలి. అంతే ఒట్టి తునకల కూర రెడీ అయినట్టే. ఒట్టితునకలుగా మీరు చికెన్ లేదా మటన్... ఏది ఎంచుకుంటారో మీ ఇష్టం.  దీన్నే ఎండు ముక్కల కూర అని కూడా అంటారు. 


ఒట్టి తునకల కూర అప్పుడప్పుడు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ కూర తినడం వల్ల రుచి అదిరిపోతుంది. చికెన్ వండిన ఒట్టి తునకల కూర తినడం వల్ల కండరాలకు పుష్టిగా మారుతాయి. ఆకలిని కూడా పెంచుతుంది. ఎముక బలానికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. గుండె ఆరోగ్యానికి ఈ కూర మేలు చేస్తుంది. దీనిలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. మటన్ తో వంటి ఒరుగులతో పోలిస్తే చికెన్ ఒరుగులతో వండిన కూర మంచి టేస్టీగా ఉంటుంది. చికెన్ ఒరుగుల కూర అధికంగా తిన్నా కూడా మంచిదే. కానీ మటన్ ఒరుగులు కూడా అధికంగా తింటే శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోయే అవకాశం ఉంది. 




Also read: ఆహారంలో ఉప్పు పూర్తిగా మానేస్తే ఎంత ప్రమాదమో తెలుసా?


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.