ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ చాలా అవసరం. ఉదయం మనం తినే ఆహారం ఎంత శక్తివంతమైనది తింటే ఆ రోజంతా అంత ఉత్సాహంగా ఉంటుంది. అందుకే బ్రేక్ ఫాస్ట్ మానవద్దని, పోషకాలతో నిండిన ఆహారాన్ని తినమని సూచిస్తారు వైద్యులు. ఓట్స్ ఆమ్లెట్ శరీరానికి అవసరమయ్యే అన్నీ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటుంది.ఓట్స్‌లో రోగనిరోధక శక్తి ని పెంచే పోషకాలు ఉంటాయి. మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అంతే కాదు డయాబెటిక్ రోగులు ఓట్స్ ను ఆహారంగా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుడ్డులో కూడా ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది. బి విటమిన్లు, డి విటమిన్ కూడా లభిస్తుంది. పచ్చసొనలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరానికి చాలా అవసరం. రక్తహీనత రాకుండా ఇది అడ్డుకుంటుంది. గుడ్డులో ఉండే ల్యూటీన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కంటి సమస్యల నుంచి మనల్ని కాపాడుతుంది. పక్షవాతం వచ్చే అవకాశం కూడా 12 శాతం తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఓట్స్ ఆమ్లెట్ ఎలా చేయాలో ఇక్కడ వివరించాం చూడండి.
కావాల్సిన పదార్థాలు
ఓట్స్ - ఒక కప్పు
పాలు - అరకప్పు కప్పు
గుడ్డు - మూడు
మిరియాల పొడి - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడా
ఉల్లిపాయ తరుగు - మూడు స్పూనులు
పచ్చిమిర్చి తరుగు - రెండు స్పూనులు
కొత్తిమీర తరుగు- ఒక స్పూను
క్యారెట్ తురుము - రెండు స్పూనులు
పసుపు - చిటికెడు
తయారీ ఇలా
1. ఓట్స్ ను మిక్సీలో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి.
2. ఇందులో తగినన్ని పాలు, కాస్త నీళ్లు చేర్చి దోశెల పిండిలా జారేలా కలుపుకోవాలి.
3. పిండి కలుపుకున్నాక ఓ పదినిమిషాల మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.
4. ఈలోపు ఒక గిన్నెలో గుడ్లు కొట్టి స్పూనుతో గిలక్కొట్టాలి.
5. అందులో మిరియాల పొడి, కాస్త పసుపు, ఉప్పు వేసి మళ్లీ బాగా గిలక్కొట్టాలి.
6. ఓట్స్ దోశెల పిండిలో గుడ్లు మిశ్రమాన్ని వేసి బాగా కలపాలి.
7. ఉల్లి తరుగు, కొత్తి మీర తరుగు, పచ్చి మిర్చి తరుగు , క్యారెట్ తురుము వేసి బాగా మిక్స్ చేయాలి.
8. పెనంపై నూనె వేసి ఆమ్లెట్ లా వేసుకోవాలి.
9. రెండు వైపులా బాగా కాల్చి ప్లేటులోకి తీసుకోవాలి. దీన్ని చట్నీ లేకుండా తిన్నా చాలా బావుంటుంది.
Also read: టీలో బెల్లం వేసుకుని తాగుతున్నారా? ఆయుర్వేదం వద్దని చెబుతోంది
Also read: తిమ్మిర్లు ఎక్కువ వస్తున్నాయా? అయితే ఈ సమస్యలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి