Tata Researchers Amazing Discovery In Medical Research: ప్రముఖ క్యాన్సర్ పరిశోధన సంస్థ టాటా ఇన్‌స్టిట్యూట్ అరుదైన అద్భుతాన్ని ఆవిష్కరించబోతోంది. ఇప్పటి వరకు క్యాన్సర్ చికిత్స కోసం రోగులు లక్షల రూపాయలు ఖర్చు చేస్తుండగా, ఇకపై రూ.100 మాత్ర తో చెక్ పెట్టబోతోంది. క్యాన్సర్‌ రెండవసారి రాకుండా నిరోధించే చికిత్సను కనుగొన్నట్లు ఆ సంస్థ పరిశోధకులు వెల్లడించారు. ఈ మేరకు ఓ మాత్ర ను రూపొందించినట్లు టాటా మెమోరియల్ హాస్పిటల్ సీనియర్ క్యాన్సర్ సర్జన్ డాక్టర్ రాజేంద్ర బద్వే ప్రకటించారు. ఈ మాత్ర విలువ కేవలం రూ.100 అని వెల్లడించారు. ఈ మాత్ర రూపొందించేందుకు టాటా ఇన్సిస్టిట్యూట్ పరిశోధకులు, వైద్యులు దాదాపు 10 ఏళ్లు కష్టపడ్డారని తెలిపారు. ఈ మాత్ర రోగులలో రెండవసారి క్యాన్సర్ రాకుండా సమర్థవంతంగా నివారించే అవకాశం ఉందన్నారు. రేడియేషన్, కీమోథెరపీ లాంటి చికిత్సలతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ను కూడా 50 శాతానికి పైగా తగ్గించే సామర్థ్యం ఈ మాత్ర కు ఉందని వివరించారు.  


ఎలుకలపై ప్రయోగం విజయవంతం


క్యాన్సర్ మాత్ర రూపొందించేందుకు చేసిన ప్రయోగానికి సంబంధించిన కీలక విషయాలను రాజేంద్ర బద్వే వివరించారు. ‘‘ఈ పరిశోధనలో భాగంగా ఎలుకలలో మానవ క్యాన్సర్ కణాలను ప్రవేశపెట్టాం. ఈ కణాలతో ఎలుకలో కణితి ఏర్పడింది. ఆ తర్వాత ఎలుకలకు రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ, సర్జరీతో చికిత్స చేశాం. ఈ క్యాన్సర్ కణాలు చనిపోయి క్రోమాటిన్ కణాలు అని పిలిచే చిన్న ముక్కలుగా విడిపోయాయి. ఈ చిన్న కణాలు రక్తం ద్వారా శరీరంలోని ఇతర భాగాలకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యకరమైన కణాలలోకి ప్రవేశిస్తే మళ్లీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రెండవసారి క్యాన్సర్ వచ్చే అవకాశాలను నిరోధించేందుకు వైద్యులు ఎలుకలకు రెస్వెరాట్రాల్, కాపర్ కలిగిన ప్రో ఆక్సిడెంట్ మాత్రలు ఇచ్చారు. కాపర్ ఆక్సిజన్ రాడికల్‌లను ఉత్పత్తి చేస్తుంది. క్రోమాటిన్ కణాలను నాశనం చేస్తుంది. దీంతో రెండోసారి క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు’’ అని రాజేంద్ర తెలిపారు.


జూన్ లేదంటే జులై లోగా మార్కెట్‌లోకి వచ్చే అవకాశం


అంతేకాదు, టాటా సంస్థ పరిశోధకులు అభివృద్ధి చేసిన మాత్ర క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ ను 50 శాతం వరకు తగ్గిస్తుందని ఆయన వివరించారు. రెండవసారి క్యాన్సర్‌ను నివారించడంలో 30 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందన్నారు. ఈ మాత్ర ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆమోదం పొందాల్సి ఉన్నట్లు తెలిపారు. ఈ మాత్ర జూన్ లేదంటే జులై లోగా మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. క్యాన్సర్ చికిత్సను మెరుగుపరచడంలో ఈ మాత్ర కీలక పాత్ర పోషించబోతున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు లక్షల రూపాయలు అయిన క్యాన్సర్ చికిత్స ఖర్చు ఇకపై వందల్లోకి చేరే అవకాశం ఉందన్నారు.   






Read Also: తెల్ల రక్తణాలే విలన్స్? క్యాన్సర్ కణితులు పెరిగేందుకు కారణం అవేనట, అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి